breaking news
Women Wrestlers
-
ఓవరాల్ టీమ్ చాంప్ భారత్
అమ్మాన్ (జోర్డాన్): ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత మహిళల జట్టు ఫ్రీస్టయిల్ విభాగంలో తొలిసారి ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు చేరాయి. 69 కేజీల విభాగం ఫైనల్లో కాజల్ 9–2తో ఒలెక్సాండ్రా రిబాక్ (ఉక్రెయిన్)పై గెలిచి బంగారు పతకం సాధించింది. 46 కేజీల విభాగం ఫైనల్లో శ్రుతిక శివాజీ పాటిల్ 0–13తో యు కత్సుమె (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. 40 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో రాజ్‌బాలా 11–5తో మొనాకా ఉమెకావా (జపాన్)పై, 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో ముస్కాన్ 12–2తో ఇసాబెల్లా గొంజాలెస్ (అమెరికా)పై విజయం సాధించారు. 61 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో రజి్నత 2–6తో హినై హర్బనోవా (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో మొత్తం 10 వెయిట్ కేటగిరీల్లో పోటీలు జరగ్గా... తొమ్మిది కేటగిరీల్లో భారత రెజ్లర్లు పోటీపడ్డారు. ఐదు స్వర్ణాలు (25 పాయింట్ల చొప్పున), ఒక రజతం (20 పాయింట్లు), రెండు కాంస్యాలు (15 పాయింట్ల చొప్పున) సొంతం చేసుకున్నారు. మరో కేటగిరీలో నాలుగో స్థానం (10 పాయింట్లు) లభించింది. ఓవరాల్‌గా 185 పాయింట్లతో భారత్ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. 146 పాయింట్లతో జపాన్ రన్నరప్‌గా నిలువగా... 79 పాయింట్లతో కజకిస్తాన్ మూడో స్థానం పొందింది. -
మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించండి: కోర్టు
న్యూఢిల్లీ: ముప్పున్న మహిళా రెజ్లర్లకు భద్రతను ఉపసంహరించడం తగదని పేర్కొన్న కోర్టు తక్షణమే భద్రత కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ముగ్గురు రెజ్లర్లు గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇదివరకే ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు.కేసు విచారణలో ఉంది. కాగా... కేంద్రంలో అధికారపక్షం నేత అయిన బ్రిజ్‌భూషణ్ నుంచి హాని ఉంటుందని గతంలో ఆ ముగ్గురు రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా పోలీసు భద్రతను ఉపసంహరించడం ఏంటని అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పుత్ ఢిల్లీ పోలీసులను తలంటారు.వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. రెజ్లర్ల భద్రతపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ‘ఎక్స్’ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిజ్‌భూషణ్‌పై పోరాడుతున్న రెజ్లర్లకు భద్రతను తొలగించారని వినేశ్ పోస్ట్ చేసింది.