బ్రిజ్‌ భూషణ్‌కు భారీ ఊరట | Big Relief for Brij Bhushan: Delhi Court Acquits Wrestlers Harassment Case | Sakshi
Sakshi News home page

బ్రిజ్‌ భూషణ్‌కు భారీ ఊరట

Aug 3 2026 10:53 AM | Updated on Aug 3 2026 11:04 AM

Big Relief for Brij Bhushan: Delhi Court Acquits Wrestlers Harassment Case

ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మాజీ ఎంపీ, మాజీ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సహ నిందితుడైన మాజీ అసిస్టెంట్‌ సెక్రటరీ వినోద్‌ తోమర్‌ను కూడా కోర్టు నిర్దోషిగా తేల్చింది.

రౌస్‌ అవెన్యూ కోర్టులో అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ అశ్విని పన్వర్‌ సోమవారం ఈ తీర్పును వెలువరించారు. కోర్టులో మీడియా ప్రవేశానికి అనుమతి లేకపోవడంతో తీర్పు వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. అయితే బ్రిజ్‌ భూషణ్‌ తరఫు న్యాయవాదులు దీనిని “గౌరవప్రదమైన నిర్దోషిత్వ తీర్పు”గా అభివర్ణించారు.

రెజ్లర్ల ఆరోపణలతో మొదలైన వివాదం
బ్రిజ్‌ భూషణ్‌పై ఆరుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి వేధించారని ఫిర్యాదులు చేశారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం 2023లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ఒలింపిక్‌ పతక విజేతలు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ తదితర రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు చేపట్టారు. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెజ్లర్ల ఆందోళన తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. 2023 జూన్‌లో పోలీసులు బ్రిజ్‌ భూషణ్‌పై అభియోగ పత్రం దాఖలు చేశారు.

ఏయే సెక్షన్ల కింద కేసు?
ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌ భూషణ్‌పై ఐపీసీలోని 354 (మహిళ గౌరవానికి భంగం కలిగించే చర్యలు), 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంటాడటం), 506 (బెదిరింపులు) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2024లో ట్రయల్‌ కోర్టు ఐదుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదులకు సంబంధించి బ్రిజ్‌ భూషణ్‌పై అభియోగాలు నమోదు చేసింది. అయితే విచారణ సందర్భంగా రక్షణ తరఫు న్యాయవాదులు ఆరోపణల్లో వ్యత్యాసాలు ఉన్నాయని వాదించారు.

బ్రిజ్‌ భూషణ్‌ వాదన ఏంటి?
తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ మొదటి నుంచి ఖండిస్తూ వచ్చారు. ఫిర్యాదుల్లో తేదీలు, ఘటనలకు సంబంధించిన వివరాల్లో మార్పులు ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని ఆరోపణలు జరిగిన సమయంలో తాను ఆ ప్రాంతంలోనే లేనని, తనపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని వాదించారు. ఫిర్యాదులు చేయడంలో ఆలస్యం కూడా కీలక అంశమని పేర్కొన్నారు.

మైనర్‌ కేసులోనూ ఊరట
ఈ కేసులో ఓ మైనర్‌ రెజ్లర్‌ కూడా ఆరోపణలు చేసింది. అయితే తర్వాత ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో.. పోక్సో చట్టం కింద నమోదైన కేసును పోలీసులు మూసివేయాలని కోరారు. అనంతరం ఆ కేసు కూడా ముగిసింది.

రాజకీయంగా కూడా కీలక పరిణామం
బ్రిజ్‌ భూషణ్‌ భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్‌ నేతగా ఉన్నారు. అయితే రెజ్లర్ల వివాదం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌కు అవకాశం కల్పించింది. తాజా కోర్టు తీర్పుతో బ్రిజ్‌ భూషణ్‌కు న్యాయపరంగా పెద్ద ఊరట లభించినట్లైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement