'ఇక అత‌డి రీఎంట్రీ క‌ష్ట‌మే.. అంద‌రూ మ‌ర్చిపోండి' | Former India cricketer weighs in on Sai Sudharsans absence after Padikkal's century | Sakshi
Sakshi News home page

'ఇక అత‌డి రీఎంట్రీ క‌ష్ట‌మే.. అంద‌రూ మ‌ర్చిపోండి'

Aug 16 2026 7:17 PM | Updated on Aug 16 2026 7:29 PM

Former India cricketer weighs in on Sai Sudharsans absence after Padikkal's century

టీమిండియా యువ బ్యాట‌ర్ సాయి సుదర్శ‌న్ గాయం కార‌ణంగా శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌కు దూర‌మైన సంగతి తెలిసింది. ఈ సిరీస్‌కు తొలుత ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భార‌త జ‌ట్టులో సెల‌క్ట‌ర్లు చోటు క‌ల్పించారు. కానీ బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌కు ఫిట్‌నెస్ క్లియ‌ర‌న్స్ ల‌భించ‌క‌పోవ‌డంతో అత‌డిని జ‌ట్టు నుంచి త‌ప్పించారు. 

అయితే సాయి సుద‌ర్శ‌న్ అందుబాటులో లేక‌పోవ‌డంతో మ‌రో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్ దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్‌కు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ద‌క్కింది. దాదాపు రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ భార‌త జెర్సీలో ప‌డిక్క‌ల్ క‌నిపించాడు. అయితే ఈ కర్ణాట‌క బ్యాట‌ర్ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ప‌డిక్క‌ల్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 167 పరుగులు చేసి మేనెజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పడిక్కల్ సత్తాచాటడంతో సుదుర్శన్‌కు తిరిగి భారత జట్టులో చోటు దక్కడం కష్టమే అని అతడు అభిప్రాయపడ్డాడు.

"భారత టెస్ట్ జట్టులో సాయి సుదర్శన్ స్ధానం ప్రమాదంలో పడింది. కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పడిక్కల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. పడిక్కల్ తన రీ-ఎంట్రీని గ్రాండ్‌గా చాటుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో టెస్టుల్లో మూడో స్థానాన్ని పడిక్కల్ దాదాపు ఖాయం చేసుకున్నట్లే. 

ఒకవేళ సాయిసుదర్శన్ ఫిట్‌నెస్ సాధించినా తిరిగి భారత జట్టులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అద్భుత ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌ను కూడా పక్కన పెట్టే సాహసం సెలక్టర్లు  చేయలేరు.  ఒకవేళ సుదర్శన్ రీఎంట్రీ ఇచ్చినా తుది జట్టులో చోటు దక్కడం మాత్రం కష్టమే" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.

సుదీర్ఘకాలం నంబర్-3 స్థానంలో రాణించిన ఛతేశ్వర్ పుజారా వైదొలిగిన తర్వాత ఆ స్థానంలో భారత్ పలు ప్రయోగాలు చేసింది. కొన్నాళ్ల పాటు శుబ్‌మన్ గిల్ ఆ స్థానంలో రాణించగా, ఆ తర్వాత కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లను కూడా మేనేజ్‌మెంట్ పరిశీలించింది. కానీ ఇప్పుడు పడిక్కల్ రూపంలో టీమిండియాకు నంబర్-3 స్థానంలో సరైన ఆటగాడు దొరికినట్లయింది.
చదవండి: IND vs SL: ముగిసిన రెండో రోజు ఆట‌.. భారీ స్కోర్‌ సాధించిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement