క్రికెట్ ప్రపంచానికి మరో అన్నదమ్ముల జోడీ పరిచయమైంది. వారిద్దరూ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించారు. ఓపెనర్లగా బరిలోకి దిగిన ఆ జంట 124 పరుగుల లక్ష్యాన్ని ఊదిపడేసింది. వారే ఇటలీ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా. గురువారం వాంఖడే వేదికగా జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో నేపాల్‌ను పది వికెట్ల తేడాతో ఇటలీ చిత్తు చేసింది. మోస్కా బ్రదర్స్ అజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశారు. టీ20 ప్రపంచకప్‌లో ఇటలీకి ఇదే తొలి విజయం.
ఆస్ట్రేలియా నుంచి వచ్చి...
‘మోస్కా బ్రదర్స్’ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం ఇటలీ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లగా వీరిద్దరు అక్కడే సిడ్నీలో పుట్టారు. అక్కడి క్రికెట్ సంస్కృతి వల్ల ఆటపై మక్కువ పెంచుకొని ఇద్దరూ కలిసే ఆటను నేర్చుకోవడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేసేవారు. ఆస్ట్రేలియాలో క్లబ్ స్థాయిలో ఆడిన తర్వాత వీరిద్దరు ఇటలీ చేరారు. తమ కొత్త జట్టును తీర్చిదిద్దేందుకు ఇటలీకి ఇలాంటి ఆటగాళ్ల అవసరం ఏర్పడింది.
ఈ క్రమంలో జాతీయ జట్టుకు ఎంపికైన వీరిద్దరు 2022లో ఒకే మ్యాచ్ ద్వారా (గ్రీస్‌పై) అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం విశేషం. టోర్నీ ముగిసిన తర్వాత ‘మోస్కా బ్రదర్స్’ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోతారు. పెద్దవాడైన ఆంథోనీ పదేళ్ల పాటు కార్పెంటర్‌గా పని చేసి బాలఖైదీల కేంద్రంలో కార్పెంటర్ పనిని నేర్పించే ఉద్యోగంలో ఇటీవలే చేరాడు. మూడేళ్లు చిన్నవాడైన జస్టిన్ ఒక పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్నాడు.
మెనెంటీ బ్రదర్స్’ కూడా...
‘మోస్కా బ్రదర్స్’కు ఆటలో స్ఫూర్తిగా నిలిచిన మరో ఇద్దరు ఆస్ట్రేలియన్ సోదరులు కూడా ఇటలీ జట్టులోనే ఉన్నారు. నేపాల్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన హ్యారీ మెనెంటీæ చిన్నవాడు కాగా, బెన్ మెనెంటీ అతనికంటే మూడేళ్ల పెద్దవాడు. వీరు కూడా సిడ్నీకి చెందిన వారే. ఈ ఇద్దరి ప్రోత్సాహంతోనే క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ‘మోస్కా బ్రదర్స్’ ఇప్పుడు వారిద్దరిలో కలిసి ఇటలీ జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడటం విశేషం. అయితే ‘మెనెంటీ’లకు ఇప్పటికే చెప్పుకోదగిన అనుభవం ఉంది. బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్, సిడ్నీ సిక్సర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు టాస్మేనియా తరఫున 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.
హాకీ వరల్డ్ కప్‌లో ఆడి...
ఇటలీ టీమ్‌లో ఇద్దరు దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా ఉన్నారు. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో కెపె్టన్‌గా వ్యవహరించిన దురదృష్టవశాత్తూ గాయంతో టోర్నీకి దూరమైన వేన్ లీ మాడ్‌సన్ స్వస్థలం డర్బన్. జాతీయ జట్టుకు టెస్టు ఆడే అవకాశం రాకపోయినా... మాడ్‌సన్‌కు ఏకంగా 253 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల అనుభవం ఉంది.
అతను దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 2006 హాకీ వరల్డ్ కప్‌లో, 2006 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడటం విశేషం. సఫారీ టీమ్‌కు 2021 వరకు 6 వన్డేలు, 13 టి20లు ఆడిన జేజే స్మట్స్ ఇప్పుడు ఇటలీ టీమ్‌లో ఉన్నాడు. తన జీవితంలో ఒక్కసారి కూడా ఇటలీ దేశంలో అడుగు పెట్టకుండా అతను ఆ దేశం తరఫున వరల్డ్ కప్ ఆడుతుండటం ఆసక్తికరం.
టీ20 ప్రపంచకప్‌లో అన్నదమ్ముల జోడీలు ఇవే
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏడు అన్నదమ్ముల జోడీలు కలిసి మ్యాచ్‌లు ఆడాయి. తాజా ప్రపంచకప్‌లో ఇటలీ నుంచి రెండు ‘బ్రదర్స్’ జోడీలు ఆంథోనీ మోస్కా–జస్టిన్ మోస్కా; హ్యారీ మెనెంటీ–బెన్ మెనెంటీ రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాయి. గతంలో ఇర్ఫాన్ పఠాన్–యూసుఫ్ పఠాన్ (భారత్; 2007)... నాథన్–బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్)... డ్వేన్ బ్రావో–డారెన్ బ్రావో (వెస్టిండీస్) ... మోర్నీ మోర్కెల్–అల్బీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా)... డేవిడ్ హస్సీ–మైక్ హస్సీ (ఆ్రస్టేలియా) ‘బ్రదర్స్’ కలిసి టి20 ప్రపంచకప్‌లో ఆడారు.


