breaking news
erigaisi arjun
-
అర్జున్‌కు మూడో స్థానం
చెన్నై: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో అనీశ్ గిరి (నెదర్లాండ్స్), అర్జున్, కార్తికేయన్ మురళీ (భారత్) 5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. దాంతో అనీశ్‌కు రెండో స్థానం, అర్జున్‌కు మూడో స్థానం, కార్తికేయన్‌కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. 7 పాయింట్లతో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్ చాంపియన్‌గా నిలిచాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు నిహాల్ సరీన్ 4.5 పాయింట్లతో ఐదో స్థానంలో, విదిత్ 4 పాయింట్లతో ఏడో స్థానంలో, ప్రణవ్ 3 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహించారు. శుక్రవారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేముల్లో కీమెర్ 41 ఎత్తుల్లో రే రాబ్సన్ (అమెరికా)పై, అనీశ్ గిరి 33 ఎత్తుల్లో జోర్డెన్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. అర్జున్–కార్తికేయన్ గేమ్ 49 ఎత్తుల్లో... విదిత్ (భారత్)–లియాంగ్ (అమెరికా) గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. విజేత కీమెర్కు రూ. 25 లక్షలు... అనీశ్‌కు రూ. 15 లక్షలు... అర్జున్‌కు రూ. 10 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదే వేదికపై జరిగిన చాలెంజర్స్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రాణేశ్ 6.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. తద్వారా వచ్చే ఏడాది చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. హైదరాబాద్ ప్లేయర్ హారిక 1.5 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది. -
అర్జున్–కీమెర్ ఆరో రౌండ్ గేమ్ ‘డ్రా’
చెన్నై: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ మాస్టర్స్ కేటగిరీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ చేరింది. విన్సెంట్ కీమెర్ (జర్మనీ)తో మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను అర్జున్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇతర గేముల్లో జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) 51 ఎత్తుల్లో నిహాల్ సరీన్ (భారత్)పై, అవండర్ లియాంగ్ (అమెరికా) 61 ఎత్తుల్లో ప్రణవ్ (భారత్)పై గెలిచారు. రే రాబ్సన్ (అమెరికా)–కార్తికేయన్ మురళీ (భారత్) గేమ్ 123 ఎత్తుల్లో... విదిత్ గుజరాతి (భారత్)–అనీశ్ గిరి (నెదర్లాండ్స్) గేమ్ 109 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఆరో రౌండ్ తర్వాత కీమెర్ 4.5 అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 3.5 పాయింట్లతో అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే టోర్నమెంట్ చాలెంజర్స్ కేటగిరీలో భారత గ్రాండ్‌మాస్టర్,హైదరాబాద్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక తొలి విజయం అందుకుంది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలితో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హారిక 80 ఎత్తుల్లో గెలిచింది. -
అర్జున్‌కు తొలి పరాజయం
చెన్నై: క్వాంట్‌బాక్స్ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ మాస్టర్స్ కేటగిరీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్‌కు తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో అర్జున్ 70 ఎత్తుల్లో భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్ చేతిలో ఓడిపోయాడు. మరో గేమ్‌లో కార్తికేయన్ మురళీ (భారత్) 46 ఎత్తుల్లో జోర్డాన్ వాన్ ఫారీస్ట్ (నెదర్లాండ్స్)పై గెలుపొందాడు. రే రాబ్సన్ (అమెరికా) –అవండర్ లియాంగ్ (అమెరికా) గేమ్ 26 ఎత్తుల్లో ... విదిత్ (భారత్)–ప్రణవ్ (భారత్) గేమ్ 86 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్)–విన్సెంట్ కీమెర్ (జర్మనీ) గేమ్ 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.ఇదే టోర్నమెంట్ చాలెంజర్స్ కేటగిరీలో భారత గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మూడో ఓటమిని చవిచూసింది. భారత్‌కే చెందిన లియోన్ ల్యూక్‌తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో హారిక 59 ఎత్తుల్లో ఓడిపోయింది. ఆధిబన్ (భారత్)–ప్రాణేశ్ (భారత్) గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇతర గేముల్లో దీప్తాయన్ ఘోష్ (భారత్) 76 ఎత్తుల్లో హర్షవర్ధన్ (భారత్)పై, ఇనియన్ (భారత్) 45 ఎత్తుల్లో ఆర్యన్ చోప్రా (భారత్)పై, అభిమన్యు పురాణిక్ (భారత్) 43 ఎత్తుల్లో వైశాలి (భారత్)పై విజయం సాధించారు. -
మూడో రౌండ్లో అర్జున్ గెలుపు
చెన్నై: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ నిలకడైన ప్రదర్శనతో మూడో రౌండ్ గేమ్‌లో విజయం సాధించాడు. దీంతో చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ‘మాస్టర్స్’ కేటగిరీలో భారత ఆటగాడు రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శనివారం జరిగిన గేమ్‌లో అర్జున్... అమెరికా గ్రాండ్‌మాస్టర్ రే రాబ్సన్‌ను కంగుతినిపించాడు. ఆరంభం నుంచే దీటైన పైఎత్తులు వేస్తూ వచి్చన అర్జున్ గెలిచేదాకా పట్టుదల కనబరిచాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పావులు కదిపాడు. ఇదే జోరుతో అర్జున్ 46 ఎత్తుల్లో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. తొలిరౌండ్లో గెలిచిన తెలంగాణ ఆటగాడు రెండో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ప్రస్తుతం మూడు రౌండ్లు ముగిసేసరికి 2.5 పాయింట్లతో ఒక్కడే రెండో స్థానంలో ఉన్నాడు. ఆడిన మూడు రౌండ్లూ గెలిచిన జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్ (3) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో రౌండ్లో కీమర్... కార్తీకేయన్ మురళీపై గెలుపొందాడు. మిగతా భారత ఆటగాళ్లలో గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతి కీలకమైన విజయాన్ని సాధించాడు. సహచరుడు నిహాల్ శరిన్ (0.5)పై విదిత్ (1.5) గెలుపొందాడు. అతనికిది మొదటి విజయం కాగా... భారత యువ ఆటగాడు వి.ప్రణవ్ మూడో రౌండ్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నీ టాప్ సీడ్, గ్రాండ్‌మాస్టర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)ను ఆద్యంతం నిలువరించాడు. దీంతో డచ్ ఆటగాడు డ్రా చేసుకోక తప్పలేదు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఇంకా ఆరు రౌండ్లు మిగిలున్నాయి. హారిక గేమ్ డ్రా ఇక్కడే జరుగుతున్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ ‘చాలెంజర్స్’ టోర్నీలో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. ఆధిబన్ భాస్కరన్‌తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను హారిక డ్రా చేసుకుంది. ఆర్. వైశాలికి లియోన్ ల్యూక్ (భారత్) చేతిలో చుక్కెదురైంది. అభిమన్యు పురాణిక్... హర్షవర్ధన్‌పై, ప్రాణేశ్... ఇనియన్పై గెలుపొందారు. ఆర్యన్ చోప్రా, దీప్తాయన్ ఘోష్‌ల మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది -
అర్జున్ గేమ్ ‘డ్రా’
చెన్నై: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ‘మాస్టర్స్’ కేటగిరీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. జోర్డాన్ వాన్ ఫారీస్ట్ (నెదర్లాండ్స్)తో శుక్రవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను అర్జున్ 42 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్ వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. భారత గ్రాండ్‌మాస్టర్ వి.ప్రణవ్‌తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో కీమెర్ 46 ఎత్తుల్లో గెలిచాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన గేమ్‌లో అమెరికా ప్లేయర్ రే రాబ్సన్ 54 ఎత్తుల్లో విజయం సాధించాడు. కార్తికేయన్ మురళీ (భారత్)–లియాంగ్ (అమెరికా) గేమ్ 42 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్)–నిహాల్ సరీన్ (భారత్) గేమ్ 60 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. హారిక ఓటమి ఇదే వేదికపై జరుగుతున్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ ‘చాలెంజర్స్’ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్‌కు చెందిన ద్రోణవల్లి హారిక వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. భారత్‌కే చెందిన ఇనియన్‌తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో హారిక 39 ఎత్తుల్లో ఓడిపోయింది. అభిమన్యు పురాణిక్ (భారత్) 48 ఎత్తుల్లో లియోన్ ల్యూక్ (భారత్)పై గెలిచాడు. వైశాలి (భారత్)–ఆధిబన్ (భారత్) గేమ్ 36 ఎత్తుల్లో... ప్రాణేశ్ (భారత్)–దీప్తాయన్ ఘోష్ (భారత్) గేమ్ 29 ఎత్తుల్లో... ఆర్యన్ చోప్రా (భారత్)–హర్షవర్ధన్ (భారత్) గేమ్ 21 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. -
అర్జున్ శుభారంభం
చెన్నై: క్వాంట్‌బాక్స్ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన మాస్టర్స్ కేటగిరీ తొలి రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ 49 ఎత్తుల్లో అవండర్ లియాంగ్ (అమెరికా)పై గెలుపొందాడు. తెలంగాణ రాష్ట్ర యువజన క్రీడల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తొలి ఎత్తు వేసి అర్జున్–లియాంగ్ గేమ్‌ను ప్రారంభించారు. ప్రణవ్ (భారత్)–కార్తికేయన్ మురళీ (భారత్) గేమ్ 44 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్)–రే రాబ్సన్ (అమెరికా) గేమ్ 59 ఎత్తుల్లో... విదిత్ గుజరాతి (భారత్)–జోర్డాన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) గేమ్ 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... విన్సెంట్ కీమెర్ (జర్మనీ) 52 ఎత్తుల్లో నిహాల్ సరీన్ (భారత్)పై విజయం సాధించాడు. ‘మాస్టర్స్’ కేటగిరీలో పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లు జరుగుతాయి. హారిక పరాజయం మరోవైపు ఇదే వేదికపై జరుగుతన్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చాలెంజర్స్ టోర్నీని హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పరాజయంతో ప్రారంభించింది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ దీప్తాయన్ ఘోష్‌తో జరిగిన తొలి గేమ్‌లో హారిక 44 ఎత్తుల్లో ఓడిపోయింది. ఇతర గేముల్లో లియోన్ ల్యూక్ (భారత్) 47 ఎత్తుల్లో హర్షవర్ధన్ (భారత్)పై, ప్రాణేశ్ (భారత్) 26 ఎత్తుల్లో ఆర్యన్ చోప్రా (భారత్)పై నెగ్గారు. అభిమన్యు పురాణిక్ (భారత్)–ఆధిబన్ (భారత్) గేమ్ 46 ఎత్తుల్లో... వైశాలి (భారత్)–ఇనియన్ (భారత్) గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. చాలెంజర్స్ టోర్నీ విజేతకు వచ్చే ఏడాది ‘మాస్టర్స్’ టోర్నీలో పాల్గొనే అవకాశం ఇస్తారు. -
మార్పు... మంచి కోసమే!
చెస్... అందరికీ సుపరిచతమైన ఆట... ఏదో ఒకదశలో ఒక్కసారైనా ఆడిన వాళ్లు ఎందరో ఉన్నారు. అంతర్జాతీయంగానూ ఈ క్రీడకు ఎంతో పేరుంది. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం చెస్ ఇంకా అరంగేట్రం చేయలేదు. ఆ దిశగా అడుగులు వేయాలంటే ముందుగా ఆట అందరికీ మరింత చేరువయ్యేలా చేయాలి. ఒకప్పుడు క్లాసికల్ ఫార్మాట్లోనే ఎక్కువగా చెస్ టోర్నీలు జరిగేవి. కాలక్రమేనా చెస్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. నార్వే దిగ్గజం, వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకుంటున్నాడు. గ్రాండ్చెస్ టూర్... ఫ్రీస్టయిల్ చెస్... సూపర్‌బెట్ చెస్... ఇలా మేటి గ్రాండ్మాస్టర్లను భాగస్వామ్యం చేస్తూ నిలకడగా టోర్నీలు నిర్వహిస్తున్నాడు. ఈ తరహా మార్పులతో చెస్‌కు మరింత ఆదరణ పెరుగుతోందని... ఈ ఆట కొత్త శిఖరాలకు చేరుకోవడానికి దోహదం పడుతుందనిప్రపంచ ఆరో ర్యాంకర్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ అభిప్రాయపడుతున్నాడు. నేటి నుంచి జరగనున్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న అర్జున్ గత ఫలితాల గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్తాతని తెలిపాడు. చెన్నై: అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న భారత స్టార్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి స్వదేశంలో మెగా టోర్నీకి సిద్ధమయ్యాడు. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడనున్నారు. భారత్ నుంచి అర్జున్‌తో పాటు, విదిత్ గుజరాతీ, నిహాల్ సరీన్, కార్తికేయన్ మురళి, ప్రణవ్ బరిలో ఉన్నారు. ఇటీవల నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న అర్జున్... ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్‌తో పాటు ఇ–స్పోర్ట్స్ వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. స్వదేశంలో జరగనున్న చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా అర్జున్ అడుగులు వేస్తున్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు అర్జున్ మాట్లాడుతూ... ‘ఎక్కువగా ఆలోచించడం లేదు. ప్రత్యర్థి ఎవరైనా సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకుంటా. క్లాసికల్ టోర్నమెంట్లో ప్లేయర్లు దీర్ఘాలోచనలో మునిగిపోతారు. దీంతో అభిమానులు విసుగు చెందుతారు. కానీ ఇ–స్పోర్ట్స్‌లో అలా జరగదు. వెంట వెంటనే ఎత్తులకు పైఎత్తులు వేయాల్సిన అవసరముంటుంది. అందుకే అభిమానులు ఈ తరహా ఆటలను ఆదరిస్తారు. సమయం అనేది చాలా కీలకం అవుతుంది. ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు. దీంతో చూసేవాళ్లకు బాగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఆటగాళ్లు, అభిమానులు దీని వైపే మొగ్గుచూపడం ఖాయమే’ అని అన్నాడు. క్యాండిడేట్స్ టోర్నీపై దృష్టి ఇక తాజాగా ఇ–స్పోర్ట్స్ వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఓటమి పాలవడం బాధించిందని వరంగల్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల అర్జున్ అన్నాడు. ‘ఇ–స్పోర్ట్స్ వరల్డ్‌కప్’లో సెమీఫైనల్‌కు చేరడం ఆనందంగానే ఉంది. కానీ ఆశించిన ఫలితం రాలేదనే అసంతృప్తి ఉంది. ఆఖరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యాను. ఇలాంటి చేదు అనుభవాల నుంచి బయటపడి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నా’ అని అర్జున్ వెల్లడించాడు. లాస్‌వేగస్‌లో జరిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నీ చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ అర్జున్ ఓటమి పాలయ్యాడు. ఫ్రీస్టయిల్ ఆడటం చాలా బాగుంటుందన్న అర్జున్... భవిష్యత్తులో గ్రాండ్‌స్లామ్‌కు టూర్ చెస్ క్యాలెండర్లో తప్పక చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ప్రపంచ ఆరో ర్యాంక్‌లో ఉన్న అర్జున్... అన్ని ఫార్మాట్లలో సత్తా చాటాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుండగా... 8 మంది ప్లేయర్లు టైటిల్ కోసం పోటీపడనున్నారు. ఇప్పటికే అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా ఈ టోర్నీకి అర్హత సాధించగా... మిగిలిన ఏడు స్థానాల కోసం ప్లేయర్లు పోటీపడుతున్నారు. ముఖ్యంగి వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన వారిలో ముగ్గురు, గ్రాండ్ స్విస్ టూర్లో మెరుగైన ప్రదర్శన చేసిన ఇద్దరు. ‘ఫిడే సర్క్యూట్’ నుంచి ఒకరు క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించనున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ మాట్లాడుతూ... ‘క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాలంటే నా ముందు రెండే దారులు ఉన్నాయి. గ్రాండ్‌స్విస్, వరల్డ్‌కప్ అ రెండింట్లో మెరుగైన ఆటతీరు కనబర్చాలని భావిస్తున్నా. రెండిట్లో కనీసం ఒక్క టోర్నీలో అయినా టైటిల్ సాధించాలి. రేటింగ్‌లో టాప్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొంటున్న 10 మంది ప్లేయర్లలో... అర్జున్ అత్యధిక రేటింగ్ (2,776 పాయింట్లు) కలిగి ఉన్నాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీశ్ గిరి (2748 పాయింట్లు) రెండో... స్థానంలో విన్సెంట్ కీమర్ (2730 పాయింట్లు; జర్మనీ) మూడో స్థానంలో ఉన్నారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనున్న ఈ టోర్నీలో 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. గత రెండు ఎడిషన్లలో అర్జున్ త్రుటిలో టైటిల్‌కు దూరమయ్యాడు. 2023లో గుకేశ్‌తో టైబ్రేకర్‌లో ఓడి రెండో స్థానానికి పరిమితం కాగా... గతేడాది కూడా టైటిల్ గెలవలేకపోయాడు. ‘గత రెండు పర్యాయాలు ఇక్కడ టైటిల్ గెలవకపోవడంతో నాపై ఎలాంటి అంచనాలు లేవు. అదే సమయంలో ఒత్తడి కూడా ఉండదు. దీంతో ప్రదర్శనపై మరింత దృష్టి పెడతా’ అని అర్జున్ అన్నాడు. అగ్ని ప్రమాదంతో...నేడు మొదలయ్యే ‘చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2025’ టోర్నమెంట్లో అర్జున్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. వాస్తవానికి ఈ టోర్నీ బుధవారమే ప్రారంభం కావాలి. కానీ టోర్నీ వేదికైన హయాత్ రీజెన్సీ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక షార్ట్ సర్క్యూట్‌తో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పొగ కమ్ముకోవడంతో హోటల్ సిబ్బంది అందరినీ బయటకు పంపించారు. టోర్నీ నిర్వాహకులు ఈ టోర్నీలో ఆడుతున్న 20 మంది క్రీడాకారులను వెంటనే సమీపంలో మరో హోటల్లో బస ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రానికల్లా అంతా సర్దుకోవడంతో గురువారం నుంచి ఈ టోర్నీని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో 11వ తేదీన విశ్రాంతి దినం కేటాయించారు. అయితే ఒకరోజు వృథా కావడంతో విశ్రాంతి దినం తొలగించి... వరుసగా తొమ్మిది రోజులపాటు టోర్నీని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. -
విజేత కార్ల్సన్... అర్జున్‌కు నాలుగో స్థానం
రియాద్: తొలిసారి నిర్వహించిన ఈ–స్పోర్ట్స్ వరల్డ్‌కప్ చెస్ టోర్నమెంట్లో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ చాంపియన్‌గా అవతరించాడు. అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన ఫైనల్లో కార్ల్సన్ 3–1, 3–1తో విజయం సాధించాడు.సెట్–1లో భాగంగా జరిగిన నాలుగు గేముల్లో కార్ల్సన్ రెండు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. సెట్–2లో భాగంగా జరిగిన నాలుగు గేముల్లో కార్ల్సన్ మూడు గేముల్లో నెగ్గి, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. హికారు నకముర (అమెరికా) మూడో స్థానం పొందగా... భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ స్టార్ ఇరిగేశి అర్జున్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.నకమురతో జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో అర్జున్ 2.5–3.5తో ఓడిపోయాడు. ఐదు గేముల్లో అర్జున్ రెండింటిలో గెలిచి, ఒక దానిని ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌కు 2,50,000 డాలర్లు (రూ. 2 కోట్ల 18 లక్షలు) లభిస్తాయి.రెండో స్థానం పొందిన అలీరెజాకు 1,90,000 డాలర్లు (రూ. 1 కోటీ 65 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన నకమురకు 1,45,000 డాలర్లు (రూ. 1 కోటీ 26 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన అర్జున్‌కు 1,15,000 డాలర్లు (రూ. 1 కోటీ 33 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సెమీస్‌లో అర్జున్ ఓటమి
లాస్ వేగస్: భారత చెస్ స్టార్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్ చెస్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. అప్రతిహత విజయాలతో దూసుకొచ్చిన అర్జున్... సెమీస్‌లో 0–2 పాయింట్ల తేడాతో లెవాన్ అరోనియన్ (అమెరికా) చేతిలో ఓడాడు. ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెమీస్‌కు చేరిన తొలి భారత చెస్ ప్లేయర్‌గా నిలిచిన అర్జున్ కీలక పోరులో ఆకట్టుకోలేకపోయాడు. తొలి గేమ్‌లో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్న అర్జున్... రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ పోటీలో నిలిచేందుకు రిస్క్ తీసుకొని పరాజయం పాలయ్యాడు. మరో సెమీస్‌లో హాన్స్ నీమన్ (అమెరికా) 2.5–1.5తో ఫాబియానో కరువానా (అమెరికా)పై విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. తుదిపోరులో నీమన్‌తో అరోనియన్ తలపడనున్నాడు. ‘వైట్ గ్రూప్’ లీగ్ దశలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి ‘టాపర్’గా నిలిచి ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద వర్గీకరణ మ్యాచ్‌లో 1.5–0.5తో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)పై గెలుపొందాడు. ఇతర క్లాసిఫికేషన్ మ్యాచ్‌ల్లో కార్ల్సన్ 1.5–0.5తో జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, హికారు నకముర (అమెరికా) 2–0తో లెనియర్ డొమింగెజ్ పెరెజ్ (అమెరికా)పై, వెస్లీ సో (అమెరికా) 3–1తో నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయాలు సాధించారు. -
సెమీస్‌లో అర్జున్
లాస్ వేగస్: ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పకడ్బందీ ఎత్తులతో అలరించిన భారత స్టార్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్ చెస్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్బెక్ అబ్దుసత్తారోవ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జున్ 1.5–0.5తో గెలుపొందాడు. నల్ల పావులతో ఆడిన తొలి గేమ్‌ను అర్జున్ 64 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అనంతరం తెల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌లో అర్జున్ 69 ఎత్తుల్లో గెలుపొంది సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. సెమీఫైనల్లో లెవాన్ అరోనియన్ (అమెరికా)తో అర్జున్ తలపడతాడు. ‘వైట్ గ్రూప్’ లీగ్ దశలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి ‘టాపర్’గా నిలిచిన ప్రజ్ఞానందకు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద 3–4 పాయింట్ల తేడాతో పోరాడి ఓడిపోయాడు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 29 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో కరువానా 60 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. ఆ తర్వాత మూడో గేమ్‌లో ప్రజ్ఞానంద 58 ఎత్తుల్లో... నాలుగో గేమ్‌లో కరువానా 34 ఎత్తుల్లో నెగ్గారు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ఐదో గేమ్‌లో కరువానా 64 ఎత్తుల్లో నెగ్గి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లగా... ఆరో గేమ్‌లో ప్రజ్ఞానంద 48 ఎత్తుల్లో గెలిచి స్కోరును 3–3తో సమం చేశాడు. నిర్ణాయక ఏడో గేమ్‌లో కరువానా 72 ఎత్తుల్లో గెలిచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. సెమీఫైనల్లో అమెరికాకే చెందిన హాన్స్ నీమన్‌తో కరువానా తలపడతాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో అరోనియన్ 2.5–1.5తో హికారు నకముర (అమెరికా)పై, హాన్స్ నీమన్ 4–2తో సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందారు. -
కరువానాపై అర్జున్ విజయం
స్టావెంజర్: నార్వే ఓపెన్ చెస్ టోర్నీలో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ జోరుకు బ్రేక్ పడగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత నంబర్‌వన్ ఇరిగేశి అర్జున్ అద్భుత విజయంతో టైటిల్ రేసులోకి వచ్చాడు. ఎనిమిదో రౌండ్లో తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల గుకేశ్ 50 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ అర్జున్ 71 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)ను బోల్తా కొట్టించాడు. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. క్లాసికల్ గేమ్‌లోనే విజయం సాధిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ క్లాసికల్ గేమ్ ‘డ్రా’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్‌ను నిర్వహిస్తారు. క్లాసికల్ గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్‌లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్ గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్‌లో ఓడిపోతే 1 పాయింట్ దక్కుతుంది. క్లాసికల్ గేమ్‌లో ఓడిపోతే ఎలాంటి పాయింట్లు లభించవు. ఎనిమిదో రౌండ్ ముగిశాక కరువానా 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 12 పాయింట్లతో కార్ల్సన్ రెండో స్థానంలో, 11.5 పాయింట్లతో నకముర, గుకేశ్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. 10.5 పాయింట్లతో అర్జున్ ఐదో స్థానంలో, వె యి (చైనా) 8 పాయింట్లతో చివరిదైన ఆరో స్థానంలో ఉన్నారు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 13.5 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఎనిమిదో రౌండ్ గేమ్‌లో హంపి 58 ఎత్తుల్లో సారా ఖాదెమ్ (స్పెయిన్)ను ఓడించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి 37 ఎత్తుల్లో ప్రపంచ చాంపియన్ జు వెన్జున్పై సంచలన విజయం సాధించింది. -
అర్జున్‌పై తొలిసారి నెగ్గిన గుకేశ్
స్టావెంజర్: గత ఏడాది ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించిన తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ పాల్గొన్న పలు టోర్నీలలో ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. అయితే నార్వే ఓపెన్ టోర్నీలో గుకేశ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతోన్న ఈ టోర్నీలో... గుకేశ్ ఆరో రౌండ్లో నార్వే దిగ్గజం, వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై క్లాసికల్ ఫార్మాట్లో తొలిసారి గెలిచాడు. కార్ల్‌సన్‌ను ఓడించిన ఉత్సాహంలో గుకేశ్ క్లాసికల్ ఫార్మాట్లో మరో ప్రత్యర్థిపై తొలిసారి విజయాన్ని అందుకున్నాడు. ఆ ప్రత్యర్థి ఎవరో కాదు భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్. గతంలో అర్జున్‌తో పోటీపడిన ఆరుసార్లు గుకేశ్‌కు విజయం దక్కలేదు. ఒక గేమ్‌లో ఓడిపోయి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఏడో ప్రయత్నంలో మాత్రం గుకేశ్ పైచేయి సాధించాడు. మూడున్నర గంటలకుపైగా జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో గుకేశ్ తెల్ల పావులతో ఆడుతూ 92 ఎత్తుల్లో అర్జున్ను ఓడించాడు. ఈ విజయంతో గుకేశ్ 11.5 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. 12.5 పాయింట్లతో ఫాబియానో కరువానా (అమెరికా) అగ్రస్థానంలో... 11 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ మూడో స్థానంలో ఉన్నారు. హికారు నకమురా (అమెరికా; 8.5 పాయింట్లు) నాలుగో స్థానంలో, అర్జున్ (7.5 పాయింట్లు) ఐదో స్థానంలో, వె యి (చైనా; 6.5 పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. -
ప్రపంచ రెండో ర్యాంకర్ నకమురాపై అర్జున్ గెలుపు
స్టావెంజర్: నార్వే చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ అద్భుత విజయం అందుకున్నాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా (అమెరికా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో అర్జున్ అర్మగెడాన్ టైబ్రేక్ గేమ్‌లో గెలుపొందాడు. వీరిద్దరి మధ్య జరిగిన క్లాసికల్ ఫార్మాట్ గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్‌ను నిర్వహించారు. ఈ గేమ్‌లో అర్జున్ 48 ఎత్తుల్లో నకమురాపై విజయం సాధించాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఐదో రౌండ్ గేమ్‌లో 56 ఎత్తుల్లో వె యి (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి చైనా గ్రాండ్‌మాస్టర్ లె టింగ్జీపై అర్మగెడాన్ టైబ్రేక్ గేమ్‌లో 38 ఎత్తుల్లో గెలిచింది. అంతకుముందు వీరిద్దరి మధ్య క్లాసికల్ ఫార్మాట్ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. భారత మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి 35 ఎత్తుల్లో స్పెయిన్‌కు చెందిన సారా ఖాడెమ్ను ఓడించింది. -
కార్ల్‌సన్‌కు అర్జున్ షాక్
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్‌వన్, నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌పై అర్జున్ విజయం సాధించాడు. ఎనిమిదో రౌండ్ గేమ్‌లో అర్జున్ ఎత్తులకు చిత్తయిన కార్ల్సన్ 20 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. ఓపెన్ విభాగంలో 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు బ్లిట్జ్ టోర్నీ జరుగుతోంది. తొలి రోజు శనివారం 9 రౌండ్ గేమ్‌లు జరిగాయి. తొమ్మిది రౌండ్ గేమ్‌లు ముగిశాక కార్ల్సన్ 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద 6 పాయింట్లతో రెండో స్థానంలో, అర్జున్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. తొలి రోజు అర్జున్ నాలుగు గేముల్లో గెలిచి (నొదిర్బెక్, నిహాల్ సరీన్, విదిత్, కార్ల్సన్లపై), మూడు గేమ్‌లను (విన్సెంట్, డానిల్ దుబోవ్, నారాయణన్‌లతో) ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో (సో వెస్లీ, ప్రజ్ఞానంద చేతుల్లో) ఓడిపోయాడు. ఇదే టోర్నీలోని మహిళల బ్లిట్జ్ విభాగంలో తొలి రోజు 9 రౌండ్ గేమ్‌లు ముగిశాక భారత ప్లేయర్లు దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, కోనేరు హంపి 4.5 పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక 4 పాయింట్లతో ఏడో స్థానంలో, వైశాలి 3.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. -
ఆరో రౌండ్లో అరవింద్ చేతిలో అర్జున్ ఓటమి
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్‌కు తొలి ఓటమి ఎదురైంది. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో అర్జున్ 48 ఎత్తుల్లో భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. అరవింద్ చేతిలో ఓటమితో అర్జున్ లైవ్ ర్యాంకింగ్స్‌లో 2801.8 పాయింట్లతో ప్రపంచ రెండో ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోవడం గమనార్హం. అమీన్–పర్హామ్ (ఇరాన్) మధ్య గేమ్ 37 ఎత్తుల్లో...మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)–అలెక్సీ సరానా (సెర్బియా) మధ్య గేమ్ 31 ఎత్తుల్లో... అరోనియన్ (అమెరికా)–విదిత్ (భారత్) మధ్య గేమ్ 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత అర్జున్, అరోనియన్ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలోఉన్నారు. అరవింద్, అమీన్ 3.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఈరోజు జరిగే చివరిదైన ఏడో రౌండ్ గేముల్లో లాగ్రెవ్‌తో అర్జున్; అరోనియన్‌తో అమీన్; విదిత్‌తో అలెక్సీ; పర్హామ్తో అరవింద్ తలపడతారు. -
అరోనియన్‌తో అర్జున్ గేమ్ ‘డ్రా’
చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ అరోనియన్‌తో చెన్నైలో బుధవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను అర్జున్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఇదే వేదికపై జరుగుతున్న చెన్నై చాలెంజర్స్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో ఓటమిని చవిచూసింది. లియోన్ మెండోకాతో జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో హారిక 43 ఎత్తుల్లో ఓడింది. -
అర్జున్‌ది అరుదైన ఘనత
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) లైవ్ ఎలో రేటింగ్స్‌లో తెలంగాణ స్టార్ చెస్ ప్లేయర్, గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 2800 పాయింట్ల మైలురాయిని అందుకోవడం అరుదైన ఘనత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘2800 ఎలో రేటింగ్ మైలురాయిని చేరుకున్న అర్జున్‌కు అభినందనలు. ఇది అసాధారణ ఘనత. మొక్కవోని పట్టుదల, నిలకడైన ప్రదర్శనతోనే ఇది సాధ్యమవుతుంది. జాతి గర్వపడే క్షణాలివి. వ్యక్తిగతంగానూ గొప్ప స్థాయికి చేరావు. మరెంతో మంది యువత చెస్ ఆడేందుకు, ఈ క్రీడను ఎంచుకొని ప్రపంచ వేదికలపై రాణించేందుకు స్ఫూర్తిగా నిలిచావు. భవిష్యత్తులోనూ ఇదేరకంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. సెర్బియాలో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో మూడు రోజుల క్రితం అర్జున్ 2800 ఎలో రేటింగ్స్‌ను అందుకున్నాడు. భారత్‌లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, ఓవరాల్‌గా 16వ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. ఆదివారం యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీ ముగిశాక అర్జున్ లైవ్ రేటింగ్ 2800 లోనికి వచ్చింది. ప్రస్తుతం అతని లైవ్ రేటింగ్ 2798కు చేరింది. యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో అర్జున్ ప్రాతినిధ్యం వహించిన అల్కాలాయిడ్ క్లబ్ ఓపెన్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. -
మాస్టర్స్ కప్ చెస్ టోర్నీ విజేత అర్జున్
లండన్: ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ డబ్ల్యూఆర్ చెస్ మాస్టర్స్ కప్ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. 16 మంది క్రీడాకారుల మధ్య నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరిగింది. ఫైనల్లో అర్జున్ ‘అర్మగెడాన్’ గేమ్‌లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమి లాషెర్ లగ్రేవ్పై విజయం సాధించాడు. అంతకుముందు వీరిద్దరి మధ్య జరిగిన రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. తొలి గేమ్ 30 ఎత్తుల్లో... రెండో గేమ్ 38 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్‌ను నిర్వహించారు. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం అర్మగెడాన్ గేమ్‌లో తెల్లపావులతో ఆడే ప్లేయర్‌కు పది నిమిషాలు, నల్లపావులతో ఆడే ప్లేయర్‌కు ఆరు నిమిషాలు కేటాయిస్తారు. తెల్లపావులతో ఆడే ప్లేయర్ కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. నల్లపావులతో ఆడే ప్లేయర్ కనీసం ‘డ్రా’ చేసుకున్నా విజేతగా ప్రకటిస్తారు. అర్మగెడాన్ గేమ్‌లో లగ్రేవ్ తెల్లపావులతో, అర్జున్ నల్లపావులతో ఆడారు. అయితే అర్జున్ ఈ గేమ్‌ను ‘డ్రా’ చేసుకోకుండా 69 ఎత్తుల్లో లగ్రేవ్ను ఓడించడం విశేషం. సెమీఫైనల్లో అర్జున్ 1.5–0.5తో భారత్‌కే చెందిన ప్రజ్ఞానందపై, క్వార్టర్ ఫైనల్లో 1.5–0.5తో విదిత్ సంతోష్ గుజరాతిపై, గెలిచాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు 20 వేల యూరోలు (రూ. 18 లక్షల 25 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీలో ప్రదర్శన ద్వారా అర్జున్ ఎలో రేటింగ్ 2796 పాయింట్లకు చేరుకుంది. -
Erigaisi Arjun: తడబాటు నుంచి తారాస్థాయికి...
స్వీయ అంచనాలతో పాటు... ఫలితాల ఒత్తిడితో సతమతమై కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... వాటిని పక్కన పెట్టడం వల్లే విజయవంతం అయ్యానని వెల్లడించాడు. ఇటీవల హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఈ ఓరుగల్లు కుర్రాడు ఇక మీదట కూడా ఇదే జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.వందేళ్ల చరిత్ర ఉన్న చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారి స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించగా... అందులో తన వంతు పాత్ర ఉండటం ఆనందంగా ఉందని 21 ఏళ్ల అర్జున్ అన్నాడు. ఒలింపియాడ్‌లో ఆడిన 11 గేమ్‌ల్లో తొమ్మిదింట నెగ్గిన అర్జున్... వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం సాధించడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్లో అత్యుత్తమంగా మూడో స్థానానికి దూసుకెళ్లాడు. చెస్ ఒలింపియాడ్ ప్రదర్శన, కెరీర్ లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై అర్జున్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... అతిగా ఆలోచించి... ఒత్తిడిని అధిగమించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఆందోళన చెందలేదు. అయితే 2021లో నా ఎలో రేటింగ్ పాయింట్లు 2500 ఉండేవి. కానీ నా సామర్థ్యం కచ్చితంగా అంతకన్నా ఎక్కువే అని నమ్మేవాడిని. ఇక రెండేళ్లు తిరిగేసరికి 2023లో ఎలో రేటింగ్ 2700కు చేరింది. కానీ ఆ సంవత్సరం చాలా కష్టంగా గడించింది. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అందులో ముఖ్యమైంది క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక కాకపోవడం. చాన్నాళ్లుగా ఆ టోర్నీలో ఆడాలని అనుకుంటూ వచ్చా. అయితే గత ఏడాది దానికి అర్హత సాధించలేకపోవడం బాధించింది. ఒకప్పుడు సొంత అంచనాలతో సతమతమయ్యేవాడిని. ఎక్కువ ఊహించేసుకొని గందరగోళానికి గురయ్యే వాడిని. ఫలితాల గురించి అతిగా ఆలోచించడం నా ఆటతీరుపై ప్రభావం చూపింది. దాన్ని మార్చుకోవడం అంత సులువుకాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా. ఫలితాలను పట్టించుకోవడం మానేశా. ఏదో సాధించాలని తీవ్రంగా కోరుకుంటూ నాపై నేనే ఒత్తిడి పెంచుకుంటున్నానని అర్థం చేసుకున్నా. వాటిపై దృష్టి పెట్టడం వదిలేశాక మెరుగైన పలితాలు రావడం ప్రారంభమైంది. అదే అతిపెద్ద లక్ష్యం! ప్రపంచ చాంపియన్‌గా నిలవడమే నా అతిపెద్ద లక్ష్యం. అయితే ఒకేసారి పెద్ద లక్ష్యాలను కాకుండా ఎప్పటికప్పుడు చిన్న చిన్న గమ్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకుంటూ ముందుకు సాగుతున్నా. ఒక టోర్నమెంట్లో బరిలోకి దిగితే దాని గురించే ఆలోచిస్తా. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి సానుకూల ఫలితం సాధించాలనుకుంటా. ప్రస్తుతం మన ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. దీన్ని చదరంగంలో మన ‘గోల్డెన్ ఎరా’గా చెప్పుకొవచ్చు. నాతో పాటు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. మేమంతా స్నేహితులం గుకేశ్, ప్రజ్ఞానందతో మంచి అనుబంధం ఉంది. చాన్నాళ్లుగా కలిసి ఆడుతుండటంతో మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఒకరి విజయాన్ని మరొకరం ఆస్వాదిస్తాం. వాటి నుంచి స్ఫూర్తి పొందుతాం. ఒకరికి ఒకరం అండగా నిలుస్తాం. మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఇది ఎంతగానో దోహద పడుతుంది. 2003 నుంచి 2006 మధ్య జన్మించిన వాళ్లమే జట్టులో ఎక్కువ మంది ఉన్నాం. అందులో నేనే పెద్దవాడిని. ప్రస్తుతం మన దశ నడుస్తోంది. స్వతహాగా నేను టీమ్ ఈవెంట్లు ఆడేందుకు ఎక్కువ ఇష్టపడతా. గ్లోబల్ చెస్ లీగ్ (జీఎస్ఎల్) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. చెస్ ఐపీఎల్ గ్లోబల్ చెస్ లీగ్‌ను చదరంగ ఐపీఎల్ అని భావిస్తా. సమష్టి ప్రదర్శనలు అంటే నాకు చాలా ఇష్టం. ర్యాపిడ్ ఫార్మాట్లో జరగనున్న గ్లోబల్ చెస్ లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నా. ఈ లీగ్‌లో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. నల్ల పావులతో ఆడి విజయం సాధిస్తే నాలుగు పాయింట్లు... తెల్ల పావులతో గెలిస్తే మూడు పాయింట్లు కేటాయిస్తారు. అంటే తెల్ల పావులతో ఆడిన సహచరుడు పరాజయం పాలైతే... ప్రత్యర్థి జట్టు పాయింట్లను అందుకునేందుకు ఇద్దరు ఆటగాళ్లు విజయాలు సాధించాల్సి ఉంటుంది. దీనివల్ల ‘డ్రా’ల సంఖ్య బాగా తగ్గుతుంది. అందుకే ఈ ఫార్మాట్ నన్ను బాగా ఆకర్షించింది. గత జీఎస్‌ఎల్‌లో ప్రపంచ నంబర్‌వన్ నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్తో కలిసి ఒకే జట్టు తరఫున బరిలోకి దిగడం చాలా సంతోషంగా అనిపించింది. కార్ల్సన్ సహచర్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ ఏడాది భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ జట్టు తరఫున ఆడనున్నా. నా ఆటపై ఎంతో ప్రభావం చూపిన గురువు లాంటి విశ్వనాథన్ ఆనంద్‌తో సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నా. మానసికంగా సిద్ధమయ్యా... ప్రయత్న లోపం లేకుండా చూసుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రశాంతంగా ఉన్నా. ఫలానా టోర్నీలో ఫలానా ఆటగాడిపై తప్పక గెలవాలని అనుకున్నప్పుడు ఆశించిన ఫలితాలు వచ్చేవి కావు. ఆ తర్వాత అత్యుత్తమ ఆటతీరు కనబరిస్తే ఫలితం కూడా అందుకు తగ్గట్లే ఉంటుందనే విషయం గ్రహించా. ఇది చెప్పినంత సులభం కాదు. ఒత్తిడి నుంచి బయటపడి మెరుగైన ప్రదర్శన చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. గత ఏడాది క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించలేకపోవడం చాలా బాధించింది. ఈ ఏడాది చాలా బాగా గడిచింది. ఇదే జోరు మున్ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నా. -
అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు..!
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ గేమ్‌లో అర్జున్ 45 ఎత్తుల్లో ఎల్తాజ్ సఫారిల్ (అజర్బైజాన్)పై గెలిచాడు.రెండో రౌండ్ గేమ్‌లో అర్జున్ 28 ఎత్తుల్లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ తొలి గేమ్‌లో 28 ఎత్తుల్లో అభినవ్ మిశ్రా (అమెరికా) చేతిలో ఓడిపోయి... లియోన్ మెండోకా (భారత్)తో జరిగిన రెండో గేమ్‌ను 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట! -
TePe Sigeman Chess Tournament: రన్నరప్ అర్జున్
మాల్మో (స్వీడన్): టెపె సెజెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా), అర్జున్, నొదిర్బెక్ అబ్దుసత్తొరోవ్ (ఉజ్బెకిస్తాన్) 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు.విజేతను నిర్ణయించడానికి ఈ ముగ్గురి మధ్య బ్లిట్జ్ గేమ్ టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్‌లో అర్జున్, నొదిర్బెక్ చేతిలో స్విద్లెర్ ఓడిపోయాడు. దాంతో అర్జున్, నొదిర్బెక్ టైటిల్ కోసం తలపడ్డారు. అర్జున్, నొదిర్బెక్ మధ్య రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌ను అర్జున్ ‘డ్రా’ చేసుకొని, రెండో గేమ్‌లో ఓడిపోవడంతో నొదిర్బెక్ చాంపియన్‌గా అవతరించాడు.ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ .. ఆరో ర్యాంకులో గుకేశ్ చెన్నై: గత నెలలో క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు టీనేజర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. గత నెలలో 16వ స్థానంలో ఉన్న గుకేశ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. క్యాండిడేట్స్ టోర్నీ ప్రదర్శనతో గుకేశ్ 21 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం గుకేశ్ ఖాతాలో 2764 రేటింగ్ పాయింట్లున్నాయి. తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 2761 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 2751 రేటింగ్ పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. భారత ఇతర గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద 14వ ర్యాంక్‌లో, విదిత్ 28వ ర్యాంక్‌లో, పెంటేల హరికృష్ణ 37వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల చెస్ ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి 5వ ర్యాంక్‌లో, ద్రోణవల్లి హారిక 11వ ర్యాంక్‌లో, వైశాలి 13వ ర్యాంక్‌లో ఉన్నారు. -
Chennai Grandmaster Tourney: ఛాంపియన్ గుకేశ్
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు. చెన్నై వేదికగా ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో గుకేశ్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా గుకేశ్‌కు టైటిల్ లభించింది. అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 4 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన ఏడో రౌండ్లో గుకేశ్–హరికృష్ణ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... అర్జున్ 57 ఎత్తుల్లో సనన్ జుగిరోవ్ (హంగేరి)పై గెలుపొందాడు. టాప్–3లో నిలిచిన గుకేశ్‌కు 18 వేల డాలర్లు (రూ. 14 లక్షల 98 వేలు), అర్జున్‌కు 12 వేల డాలర్లు (రూ. 9 లక్షల 98 వేలు), హరికృష్ణకు 10 వేల డాలర్లు (రూ. 8 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తా చాటుతున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్
టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ రెండో విజయం సాధించాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌తో ఆదివారం స్వీడన్లో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో అర్జున్ 38 ఎత్తుల్లో గెలుపొందాడు. నాలుగు రౌండ్ల తర్వాత అర్జున్ రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, గుకేశ్ 2.5 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉన్నారు. -
అర్జున్ పరాజయం... గుకేశ్‌కు రెండో విజయం
మాల్మో (స్వీడన్): టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ తొలి ఓటమి చవిచూశాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో వరంగల్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అర్జున్ తెల్ల పావులతో ఆడుతూ 57 ఎత్తుల్లో స్వీడన్ గ్రాండ్‌మాస్టర్ నిల్స్ గ్రాండెలియస్ చేతిలో పరాజయం పాలయ్యాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరుసగా రెండో విజయంతో రెండు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో రౌండ్లో తమిళనాడుకు చెందిన గుకేశ్ 35 ఎత్తుల్లో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)పై గెలుపొందాడు. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్‌మాస్టర్ అభిమన్యు మిశ్రా రెండో రౌండ్లో 43 ఎత్తుల్లో జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. -
Tata Steel Chess Masters 2023: ఆఖరి స్థానంలో అర్జున్
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ నిరాశపరిచాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ఆన్‌జీ పట్టణంలో ముగిసిన ఈ టోర్నీలో అర్జున్ నాలుగు పాయింట్లు సాధించి చివరిదైన 14వ స్థానంలో నిలిచాడు. మొత్తం 13 గేముల్లో అర్జున్ ఎనిమిదింటిని ‘డ్రా’ చేసుకొని, ఐదు గేముల్లో ఓడిపోయాడు. 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీశ్ గిరి (8.5 పాయింట్లు) విజేతగా నిలిచాడు. చదవండి: విషాదం: ప్రపంచ ఛాంపియన్.. మంచు కింద సజీవ సమాధి -
రన్నరప్ అర్జున్... హారికకు మూడో స్థానం
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ ర్యాపిడ్ టోర్నీలో ఓపెన్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలువగా... మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానాన్ని దక్కించుకుంది. అర్జున్‌కు ఐదు వేల డాలర్లు (రూ. 4 లక్షలు), హారికకు నాలుగు వేల డాలర్లు (రూ. 3 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గురువారం ముగిసిన ర్యాపిడ్ టోర్నీ లో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అర్జున్ 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఏడో రౌండ్లో మగ్సూద్లూ (ఇరాన్)తో 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న అర్జున్, ఎనిమిదో రౌండ్లో 56 ఎత్తుల్లో నకముర (అమెరికా)పై, తొమ్మిదో రౌండ్లో 59 ఎత్తుల్లో నిహాల్ సరీన్ (భారత్)పై గెలిచాడు. 6.5 పాయింట్లతో నిహాల్ విజేతగా నిలువగా, భారత్‌కే చెందిన విదిత్ 4.5 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో హారిక 5.5 పాయింట్లతో మూడో స్థానాన్ని సాధించింది. ఏడో రౌండ్ గేమ్‌ను అన్నా ముజిచుక్ (ఉక్రెయిన్) తో 22 ఎత్తుల్లో, ఎనిమిదో రౌండ్ గేమ్‌ను మరియా (ఉక్రెయిన్)తో 25 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హారిక తొమ్మిదో రౌండ్లో 30 ఎత్తుల్లో సవితాశ్రీ (భారత్)పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. అనా ఉషెనినా (ఉక్రె యిన్) 6.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. -
Julius Baer Generation Cup: రన్నరప్ ఇరిగేశి అర్జున్..
జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) 2.5–0.5; 2–0తో అర్జున్‌పై గెలిచి విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన రెండో ఫైనల్ రెండు గేముల్లోనూ కార్ల్సన్ గెలిచాడు. కార్ల్‌సన్‌కు 33,500 డాలర్లు (రూ. 27 లక్షల 21 వేలు), అర్జున్‌కు 21,250 డాలర్లు (రూ. 17 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. చదవండి: National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ -
జాతీయ చెస్ చాంపియన్‌షిప్ విజేతగా అర్జున్..
కాన్పూర్: టోర్నీలో పరాజయమెరుగని గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ సీనియర్ జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. సీనియర్ టైటిల్ సాధించిన తొలి తెలంగాణ ఆటగాడిగా ఘనత వహించాడు. ఆఖరి 11వ రౌండ్ గేమ్‌లో 18 ఏళ్ల అర్జున్ మాజీ చాంపియన్ సేతురామన్ (8)తో ‘డ్రా’ చేసుకున్నాడు. టైటిల్ రేసులో ఉన్న గుకేశ్‌కు గురువారం ఇనియన్ జతయ్యాడు. గుకేశ్ కూడా ఆర్యన్ చోప్రా (8)తో డ్రా చేసుకోగా, ఇనియన్... మిత్రభా గుహా (బెంగాల్)ను ఓడించాడు. దీంతో అర్జున్‌తో పాటు తమిళ గ్రాండ్ మాస్టర్లు గుకేశ్, ఇనియన్ ఉమ్మడిగా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... చివరకు టైబ్రేక్ స్కోరుతో అర్జున్ను విజేతగా ఖరారు చేశారు. గుకేశ్, ఇనియన్లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి. తెలంగాణ ఆటగాడికి ట్రోఫీతో పాటు రూ. 6 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. చదవండి: టీమ్ ఈవెంట్లో ఇషాకు స్వర్ణం -
తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్: అర్జున్ అదరహో...
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): మరో రౌండ్ మిగిలి ఉండగానే తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా అవతరించాడు. థాయ్ దాయ్ వాన్ ఎన్గుయెన్ (చెక్ రిపబ్లిక్)తో శనివారం జరిగిన 12వ రౌండ్ గేమ్‌ను అర్జున్ కేవలం 15 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది గ్రాండ్మాస్టర్లతో సహా మొత్తం 14 మంది 13 రౌండ్లపాటు పోటీపడుతున్న ఈ టోర్నీలో 12వ రౌండ్ తర్వాత అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతూ టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. ఎన్గుయెన్, జొనాస్ బుల్ బెరీ (డెన్మార్క్) ఇద్దరూ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆదివారం చివరిదైన 13వ రౌండ్ గేమ్‌లో అర్జున్ ఓడిపోయి, ఎన్గుయెన్, జొనాస్ తమ గేముల్లో నెగ్గినా అర్జున్ స్కోరును దాటలేకపోతారు. వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ చాలెంజర్స్ టోర్నీ విజేత హోదాలో వచ్చే ఏడాది జరిగే టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్ తర్వాత టాటా స్టీల్ చాలెంజర్స్ టోర్నీ టైటిల్ గెలిచిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. ‘క్లాసికల్ ఫార్మాట్లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఆదివారం జరిగే చివరి రౌండ్ గేమ్‌లో నెగ్గి గెలుపు సంబరాలు చేసుకోవాలనుకుంటున్నా. ఇటీవల కాలంలో దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, శ్రీనాథ్ నారాయణన్ అందించిన సూచనలతో నా ఆట మరింత మెరుగైంది. ఈ టోర్నీ తొలి గేమ్‌లో ఓడిపోయే పరిస్థితి నుంచి తేరుకొని ‘డ్రా’ చేసుకోవడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెండో గేమ్‌లో విజయం సాధించాక అదే జోరును కొనసాగించా’ అని అర్జున్ వ్యాఖ్యానించాడు. -
అర్జున్‌కు తొలి విజయం
టాటా స్టీల్ చాలెంజర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ తొలి విజయం నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్ 25 ఎత్తుల్లో మాక్స్ వార్మెర్డమ్ (నెదర్లాండ్స్)పై గెలిచాడు. లుకాస్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్)తో జరిగిన తొలి గేమ్‌ను అర్జున్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
Tata Steel Chess: రన్నరప్ ఎరిగైసి అర్జున్
కోల్‌కతా: భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ టాటా స్టీల్ ఇండియా బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్... ప్రపంచ మాజీ బ్లిట్జ్ చాంపియన్ లెవాన్ అరోనియన్ (అర్మేనియా) 11.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఒంటరి విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య రెండు గేమ్‌ల టైబ్రేక్‌ను నిర్వహించారు. ఈ రెండు గేమ్‌లు కూడా ‘డ్రా’గా ముగిశాయి. దాంతో అర్మగెడాన్ గేమ్‌ను నిర్వహించారు. అర్మగెడాన్ గేమ్‌లో అరోనియన్ 38 ఎత్తుల్లో అర్జున్ను ఓడించి విజేతగా అవతరించాడు. అర్జున్ రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాడు. ఇదే టోర్నీలో ర్యాపిడ్ విభాగంలో అర్జున్ విజేతగా నిలి చిన సంగతి తెలిసిందే. బ్లిట్జ్ టోర్నీ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగు పాయింట్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది. -
‘కింగ్’ అర్జున్
కోల్‌కతా: పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడ్డ టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ అద్భుతం చేశాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ చాంపియన్‌గా అవతరించాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరి రోజు జరిగిన మూడు గేమ్‌లను అర్జున్ ‘డ్రా’గా ముగించాడు. ఆధిబన్ (భారత్)తో జరిగిన ఏడో గేమ్‌ను అర్జున్ 45 ఎత్తుల్లో... విదిత్ (భారత్)తో జరిగిన ఎనిమిదో గేమ్‌ను 12 ఎత్తుల్లో... లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో గేమ్‌ను 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
రజతం నెగ్గిన అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుకున్నాడు. టర్కీలో ఆదివారం ముగిసిన ప్రపంచ యూత్ అండర్–16 చెస్ ఒలింపియాడ్‌లో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. అర్జున్, ఇనియన్ పనీర్‌సెల్వం, సంకల్ప్ గుప్తా, కౌస్తవ్ చటర్జీ, దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత బృందం ఈ మెగా ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత భారత జట్టు 14 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. భారత్ ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. స్లొవేనియా ‘ఎ’, టర్కీ, ఉక్రెయిన్, అర్మేనియా, రష్యా, అజర్బైజాన్, ఇరాన్‌లపై నెగ్గిన భారత బృందం... బెలారస్, ఉజ్బెకిస్తాన్ జట్ల చేతుల్లో ఓడిపోయింది. 16 పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకోగా... 13 పాయింట్లతో చైనా మూడో స్థానాన్ని పొందింది. వ్యక్తిగతంగా టాప్ బోర్డు–1లో ఆడిన 15 ఏళ్ల అర్జున్ తొమ్మిది గేమ్‌ల ద్వారా ఏడు పాయింట్లు సంపాదించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. వరంగల్‌కు చెందిన అర్జున్ ఆడిన తొమ్మిది గేముల్లో ఐదింటిలో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’గా ముగించాడు. అలీరెజా (ఇరాన్–8 పాయింట్లు) స్వర్ణం, నికోలజ్ (జార్జియా) కాంస్యం కైవసం చేసుకున్నారు.