
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్
చెన్నై: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ నిలకడైన ప్రదర్శనతో మూడో రౌండ్ గేమ్‌లో విజయం సాధించాడు. దీంతో చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ‘మాస్టర్స్’ కేటగిరీలో భారత ఆటగాడు రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శనివారం జరిగిన గేమ్‌లో అర్జున్... అమెరికా గ్రాండ్‌మాస్టర్ రే రాబ్సన్‌ను కంగుతినిపించాడు. ఆరంభం నుంచే దీటైన పైఎత్తులు వేస్తూ వచి్చన అర్జున్ గెలిచేదాకా పట్టుదల కనబరిచాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పావులు కదిపాడు. ఇదే జోరుతో అర్జున్ 46 ఎత్తుల్లో ప్రత్యర్థిపై విజయం సాధించాడు.
తొలిరౌండ్లో గెలిచిన తెలంగాణ ఆటగాడు రెండో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ప్రస్తుతం మూడు రౌండ్లు ముగిసేసరికి 2.5 పాయింట్లతో ఒక్కడే రెండో స్థానంలో ఉన్నాడు. ఆడిన మూడు రౌండ్లూ గెలిచిన జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్ (3) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో రౌండ్లో కీమర్... కార్తీకేయన్ మురళీపై గెలుపొందాడు. మిగతా భారత ఆటగాళ్లలో గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతి కీలకమైన విజయాన్ని సాధించాడు.
సహచరుడు నిహాల్ శరిన్ (0.5)పై విదిత్ (1.5) గెలుపొందాడు. అతనికిది మొదటి విజయం కాగా... భారత యువ ఆటగాడు వి.ప్రణవ్ మూడో రౌండ్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నీ టాప్ సీడ్, గ్రాండ్‌మాస్టర్ అనీశ్ గిరి
(నెదర్లాండ్స్)ను ఆద్యంతం నిలువరించాడు. దీంతో డచ్ ఆటగాడు డ్రా చేసుకోక తప్పలేదు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఇంకా ఆరు రౌండ్లు మిగిలున్నాయి.
హారిక గేమ్ డ్రా
ఇక్కడే జరుగుతున్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ ‘చాలెంజర్స్’ టోర్నీలో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. ఆధిబన్ భాస్కరన్‌తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను హారిక డ్రా చేసుకుంది. ఆర్. వైశాలికి లియోన్ ల్యూక్ (భారత్) చేతిలో చుక్కెదురైంది. అభిమన్యు పురాణిక్... హర్షవర్ధన్‌పై, ప్రాణేశ్... ఇనియన్‌పై గెలుపొందారు. ఆర్యన్ చోప్రా, దీప్తాయన్ ఘోష్‌ల మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది