అర్జున్‌ గేమ్‌ ‘డ్రా’ | Irigeshi Arjun scores first draw in Chennai Grandmasters International Chess Tournament | Sakshi
Sakshi News home page

అర్జున్‌ గేమ్‌ ‘డ్రా’

Aug 9 2025 3:56 AM | Updated on Aug 9 2025 3:56 AM

Irigeshi Arjun scores first draw in Chennai Grandmasters International Chess Tournament

చెన్నై: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ ‘మాస్టర్స్‌’ కేటగిరీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. జోర్డాన్‌ వాన్‌ ఫారీస్ట్‌ (నెదర్లాండ్స్‌)తో శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌ గేమ్‌ను అర్జున్‌ 42 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. జర్మనీ గ్రాండ్‌మాస్టర్‌ విన్సెంట్‌ కీమెర్‌ వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. 

భారత గ్రాండ్‌మాస్టర్‌ వి.ప్రణవ్‌తో జరిగిన రెండో రౌండ్‌ గేమ్‌లో కీమెర్‌ 46 ఎత్తుల్లో గెలిచాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ సంతోష్‌ గుజరాతితో జరిగిన గేమ్‌లో అమెరికా ప్లేయర్‌ రే రాబ్సన్‌ 54 ఎత్తుల్లో విజయం సాధించాడు. కార్తికేయన్‌ మురళీ (భారత్‌)–లియాంగ్‌ (అమెరికా) గేమ్‌ 42 ఎత్తుల్లో... అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌)–నిహాల్‌ సరీన్‌ (భారత్‌) గేమ్‌ 60 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. 

హారిక ఓటమి 
ఇదే వేదికపై జరుగుతున్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ ‘చాలెంజర్స్‌’ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్‌కు చెందిన ద్రోణవల్లి హారిక వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. భారత్‌కే చెందిన ఇనియన్‌తో జరిగిన రెండో రౌండ్‌ గేమ్‌లో హారిక 39 ఎత్తుల్లో ఓడిపోయింది. అభిమన్యు పురాణిక్‌ (భారత్‌) 48 ఎత్తుల్లో లియోన్‌ ల్యూక్‌ (భారత్‌)పై గెలిచాడు. వైశాలి (భారత్‌)–ఆధిబన్‌ (భారత్‌) గేమ్‌ 36 ఎత్తుల్లో... ప్రాణేశ్‌ (భారత్‌)–దీప్తాయన్‌ ఘోష్‌ (భారత్‌) గేమ్‌ 29 ఎత్తుల్లో... ఆర్యన్‌ చోప్రా (భారత్‌)–హర్షవర్ధన్‌ (భారత్‌) గేమ్‌ 21 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.   

Advertisement
 
Advertisement
Advertisement