అర్జున్‌పై తొలిసారి నెగ్గిన గుకేశ్‌ | Gukesh wins against Arjun for the first time | Sakshi
Sakshi News home page

అర్జున్‌పై తొలిసారి నెగ్గిన గుకేశ్‌

Jun 4 2025 3:40 AM | Updated on Jun 4 2025 8:48 AM

Gukesh wins against Arjun for the first time

స్టావెంజర్‌: గత ఏడాది ప్రపంచ చెస్‌ చాంపియన్‌గా అవతరించిన తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ పాల్గొన్న పలు టోర్నీలలో ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. అయితే నార్వే ఓపెన్‌ టోర్నీలో గుకేశ్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతోన్న ఈ టోర్నీలో... గుకేశ్‌ ఆరో రౌండ్‌లో నార్వే దిగ్గజం, వరల్డ్‌ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌పై క్లాసికల్‌ ఫార్మాట్‌లో తొలిసారి గెలిచాడు. కార్ల్‌సన్‌ను ఓడించిన ఉత్సాహంలో గుకేశ్‌ క్లాసికల్‌ ఫార్మాట్‌లో మరో ప్రత్యర్థిపై తొలిసారి విజయాన్ని అందుకున్నాడు. 

ఆ ప్రత్యర్థి ఎవరో కాదు భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌. గతంలో అర్జున్‌తో పోటీపడిన ఆరుసార్లు గుకేశ్‌కు విజయం దక్కలేదు. ఒక గేమ్‌లో ఓడిపోయి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఏడో ప్రయత్నంలో మాత్రం గుకేశ్‌ పైచేయి సాధించాడు. మూడున్నర గంటలకుపైగా జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌లో గుకేశ్‌ తెల్ల పావులతో ఆడుతూ 92 ఎత్తుల్లో అర్జున్‌ను ఓడించాడు. 

ఈ విజయంతో గుకేశ్‌ 11.5 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. 12.5 పాయింట్లతో ఫాబియానో కరువానా (అమెరికా) అగ్రస్థానంలో... 11 పాయింట్లతో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ మూడో స్థానంలో ఉన్నారు. హికారు నకమురా (అమెరికా; 8.5 పాయింట్లు) నాలుగో స్థానంలో, అర్జున్‌ (7.5 పాయింట్లు) ఐదో స్థానంలో, వె యి (చైనా; 6.5 పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement