బంగ్లా బ్యాటర్ల పైచేయి.. సెంచరీకి పరుగు దూరంలో షద్మాన్‌ | Shadman stranded on 99 as bad light cuts short opening day | Sakshi
Sakshi News home page

బంగ్లా బ్యాటర్ల పైచేయి.. సెంచరీకి పరుగు దూరంలో షద్మాన్‌

Oct 28 2026 6:29 PM | Updated on Oct 28 2026 6:31 PM

Shadman stranded on 99 as bad light cuts short opening day

source: X

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తొలి రోజు బంగ్లాదేశ్‌ బ్యాటర్లు పైచేయి సాధించారు. ఓపెనర్‌ షద్మాన్‌ ఇస్లాం (99 నాటౌట్‌) సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు. వెలుతురు లేమి కారణంగా ఆట ముందుగా ఆగిపోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 213 పరుగులు చేసింది. షద్మాన్‌కు జతగా లిట్టన్‌ దాస్‌ (10) క్రీజ్‌లో ఉన్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు వెస్టిండీస్ బౌలర్లు ఆరంభంలోనే షాక్ ఇచ్చారు. జేడెన్ సీల్స్ బౌలింగ్‌లో తంజిద్ హసన్ (7) వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం షద్మాన్, మొమినుల్ హక్ రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. అయితే జోమెల్ వారికన్ బౌలింగ్‌లో మొమినుల్ 28 పరుగుల వద్ద ఔటయ్యాడు.

కెప్టెన్ నజ్ముల్ హొసైన్ శాంటో (19) కూడా వారికన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో బంగ్లాదేశ్ 96 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

స్ట్రెచర్‌పై హృదయ్
ఆ తర్వాత షద్మాన్‌కు తోడైన తౌహిద్ హృదయ్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పరుగుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో హృదయ్ ఎడమ కాలికి గాయమైంది. దీంతో అతడిని స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. రెండో రోజు ఆటకు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

కాగా, వెస్టిండీస్‌ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్‌ ఢాకా వేదికగా జరుగుతుండగా.. రెండో టెస్ట్‌ సిల్హెట్‌లో నవంబర్‌ 5 నుంచి ప్రారంభమవుతుంది. 

ఇదీ చదవండి: ఓవరాక్షన్‌.. పాకిస్తాన్‌ క్రికెటర్‌ను శిక్షించిన ఐసీసీ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement