వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ | IND W vs ZIM W 3rd ODI: India Beat Zimbabwe Series Clean Sweep | Sakshi
Sakshi News home page

వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌

Oct 28 2026 6:10 PM | Updated on Oct 28 2026 6:59 PM

IND W vs ZIM W 3rd ODI: India Beat Zimbabwe Series Clean Sweep

PC: BCCI Women X

భారత మహిళా క్రికెట్‌ జట్టు జింబాబ్వేతో ఆఖరి వన్డేలోనూ అదరగొట్టింది. పర్యాటక జట్టు విధించిన 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 17 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. వన్డే సిరీస్‌నూ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు జింబాబ్వే జట్టు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో తొలుత టీ20 సిరీస్‌ జరగగా.. స్మృతి మంధాన తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌ను భారత్‌ 3-0తో వైట్‌వాష్‌ చేసింది.

అద్భుత విజయాలు
అనంతరం తొలి, రెండో వన్డేలోనూ భారత్‌ అద్భుత విజయాలు సాధించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది స్మృతి. గత రెండు మ్యాచ్‌లలో ఏమాత్రం పోటీ ఇవ్వలేని జింబాబ్వే.. తాజాగా వడోదర వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

భారత బౌలర్ల ధాటికి బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలగా.. 39.5 ఓవర్లలో కేవలం 131 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వైష్ణవి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి.. జింబాబ్వే బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేసింది. మరోవైపు..  క్రాంతి గౌడ్‌, సయాలీ సత్గరే చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.

జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్‌ మాడెస్టర్‌ ముపాచిక్వా (37), కెప్టెన్‌ జోసిఫైన్‌ ఎన్‌కోమో (35) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు.. 17 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. స్మృతి మంధానకు బదులు ఓపెనర్‌గా వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ యస్తికా భాటియా (0) విఫలమైంది.

ప్రతీకా అర్ధ శతకం.. షఫాలీ ధనాధన్‌
వన్‌డౌన్‌లో వచ్చిన హర్లీన్‌ డియోల్‌ (19) కూడా నిరాశపరిచింది. ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్‌ ప్రతీకా రావల్‌ (56 బంతుల్లో 59; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), నాలుగో స్థానంలో వచ్చిన షఫాలి వర్మ (26 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధ శతకాలతో అదరగొట్టారు. ముఖ్యంగా షఫాలీ ధనాధన్‌ దంచికొట్టి సిక్సర్‌తో భారత్‌ విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. 

తుదిజట్లు
భారత్‌
ప్రతీకా రావల్‌, స్మృతి మంధాన (కెప్టెన్‌), షఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, యస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), సయాలీ సత్గరే, జింతిమణి కలిత, క్రాంతి గౌడ్‌, వైష్ణవి శర్మ

జింబాబ్వే
మాడెస్టర్‌ ముపాచిక్వా (వికెట్‌ కీపర్‌), లోరిన్‌ ఫిరి, చిపో ముగెరి-టిరిపానో, బిలవ్డ్‌ బిజా, జోసెఫైన్‌ ఎన్‌కోమో (కెప్టెన్‌), నైయాశా గ్వాంజుర, చీజా ధురురు, మిచెల్లి మవుంగ, నోమ్‌వెలో సిబాండ, ఫ్రాన్సిస్కికా చిపారే, ఓలిండర్‌ చేర్‌.

ఇదీ చదవండి: అతడి కోసం త్యాగం చేశాడు.. సంజూ భయ్యా గొప్పోడు: అభిషేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement