source: X
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20కి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందుతోంది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చివరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇషాన్ కుడి తొడ కండరాల గాయం కారణంగా రెండు, మూడు టీ20లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వచ్చాడు.
ఇప్పుడు ఇషాన్ జట్టులోకి రీఎంట్రీ ఇస్తే వైభవ్ పరిస్థితి ఏంటన్నది పశ్నార్థకంగా మారింది. వైభవ్‌ను జట్టులో కొనసాగిస్తారా లేక మళ్లీ బెంచ్‌కే పరిమితం చేస్తారా అన్నది చూడాలి.
ఇషాన్ గైర్హాజరీలో వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రెండో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 8 బంతుల్లో నాలుగు పరుగులే చేసి ఔటయ్యాడు. మూడో టీ20లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొంది ఓ మోస్తరు ప్రదర్శనతో (19 బంతుల్లో 45) పర్వాలేదనిపించాడు.
ఈ పరిస్థితుల్లో వైభవ్‌కు మరిన్ని అవకాశాలు కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ వైభవ్‌ను జట్టులో కొనసాగించి, ఇషాన్‌కు అవకాశం కల్పిస్తే సంజూ శాంసన్‌పై వేటు తప్పకపోవచ్చు. ఇప్పటికే మూడో టీ20లో వైభవ్ కోసం సంజూ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు.
జట్టులో మిగతా బ్యాటర్ల స్థానాలను కదిలించే పరిస్థితి లేకపోవడంతో చివరి రెండు టీ20లకు సంజూకు విశ్రాంతి కల్పించవచ్చు. ఇప్పటికే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకోవడం వైభవ్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే, నిన్న జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో భారత్ న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకుంది.నాలుగో టీ20 ఆక్లాండ్ వేదికగా అక్టోబర్ 30న జరుగనుంది.
ఇదీ చదవండి: అభిషేక్ శర్మకు మరో జాక్‌పాట్


