వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌పై విదిత్ విశ్లేషణ
న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు అతి పిన్న వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి సంచలనం సృష్టించాడు. అతని ఘనతపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఆ తర్వాత గుకేశ్ అనూహ్యంగా వెనుకబడ్డాడు. ఈ రెండేళ్లలో అతని ఎత్తులు గతి తప్పడంతో చెప్పుకోదగ్గ విజయాలేవీ దక్కలేదు. ఈ నేపథ్యంలో 2026 చివర్లో తన వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు గుకేశ్ సిద్ధమవుతున్నాడు. ఈ పోరులో ఉజ్బెకిస్తాన్‌తో చెందిన సిందరోవ్‌తో గుకేశ్ తలపడతాడు.
అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గుకేశ్ సరైన సమయంలో సత్తా చాటగలడని అతని సహచరుడు, మరో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు గుకేశ్ విషయంలో అతని ఆటకంటే మానసిక స్థితి ఎక్కువ ప్రభావం చూపుతుందని అతను అన్నాడు. ‘ఫలితాలు రావడం లేదంటే ఆటగాడి సామర్థ్యం తగ్గినట్లు కాదు. 2024 సంవత్సరం గుకేశ్‌కు అద్భుతంగా సాగింది. ప్రతీ టోర్నీలో గెలుస్తూ పట్టిందల్లా బంగారంలా సాగింది. చెస్‌లో అత్యుత్తమ స్థాయి ఆటగాళ్ల ఫామ్ విషయంలో ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఆట మాత్రమే కాకుండా మానసిక అంశాలు కూడా ముడిపడి ఉంటాయి.
గేమ్ జరిగే ఉండే మానసిక స్థితి ప్లేయర్ ప్రదర్శనను ప్రభావితం చేస్తుంది’ అని విదిత్ విశ్లేషించాడు. గుకేశ్ ఇప్పుడు మరింత కష్టపడి సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని విదిత్ సూచించాడు. ‘సాధారణంగా అతను మంచి ఆరంభం లభిస్తే దానిని చివరి వరకు నిలబెట్టుకొని ఫలితం రాబట్టగలడు. కానీ ఇటీవల అది జరగడం లేదు. ఎక్కడో లోపం జరుగుతోంది. అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అతని గేమ్‌లు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది’ అని విదిత్ అన్నాడు.
అయితే తాజా ప్రదర్శనను పక్కన పెట్టి వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మళ్లీ తన స్థాయిని ప్రదర్శించగలడను అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘గుకేశ్ మరోసారి 2024 నాటి ఆటను చూపించగలడనే నమ్మకం నాకుంది. అయితే దీనికి చాలా శ్రమించాల్సి ఉంది. వరుసగా ఓటములు ఎదురవుతున్నప్పుడు ఆటగాళ్లు మానసికంగా బలహీనంగా తయారవుతారు. ఈ సమయంలోనే మరింత దృఢంగా ఉండాలి. ఇదే అతనికి పెద్ద పరీక్ష. తాను డిఫెండింగ్ చాంపియన్‌ను అనే విషయం మరచి ఒక చాలెంజర్‌లా కొత్తగా గుకేశ్ బరిలోకి దిగాలి’ అని విదిత్ సూచించాడు.
ప్రస్తుతం గుకేశ్‌తో పోలిస్తే సిందరోవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడనే విషయం మాత్రం వాస్తవమని అతను అంగీకరించాడు. మరో వైపు త్వరలో జరిగే చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత తమ టైటిల్‌ను నిలబెట్టుకోగలదని అభిప్రాయం వ్యక్తం చేసిన విదిత్... ఇటీవల తనకు అర్జున అవార్డు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.


