టీమిండియా టీ20 మాజీ కెప్టెన్, ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో ముంబై తరఫున ఆడనున్నట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల సూర్య, రాబోయే సీజన్‌కు తాను అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడు అజింక్య నాయక్‌కు తెలియజేసినట్లు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం పేర్కొంది.
సూర్య రీఎంట్రీ
ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత సూర్యకుమార్ ఎలాంటి పోటీ క్రికెట్ ఆడలేదు. ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉండటంతో దేశవాళీ టోర్నీల్లో రాణించి మళ్లీ సత్తాను నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం తర్వాత రంజీల్లో బరిలోకి దిగుతున్నాడు. భారత్ తరఫున వందకు పైగా టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్, టెస్టుల్లో మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు.
ఫిబ్రవరి 2023లో నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన సూర్య.. తన ఏకైక ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో సూర్యకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 86 మ్యాచ్‌ల్లో 42.34 సగటుతో 5,758 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 30 అర్ధశతకాలు ఉండగా, అత్యధిక స్కోరు 200 పరుగులుగా ఉంది.
సూర్య చివరగా గతేడాది ఫిబ్రవరిలో విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో ముంబై తరఫున ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. అక్టోబర్ 11న వాంఖడే స్టేడియంలో చండీగఢ్‌తో జరిగే 'ఎలైట్ గ్రూప్ డి' ప్రారంభ మ్యాచ్‌లో ముంబై తలపడనుంది. అయితే గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


