
క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి
ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టోర్నీ
లాస్ వేగస్: ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పకడ్బందీ ఎత్తులతో అలరించిన భారత స్టార్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్ చెస్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్‌బెక్ అబ్దుసత్తారోవ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జున్ 1.5–0.5తో గెలుపొందాడు. నల్ల పావులతో ఆడిన తొలి గేమ్‌ను అర్జున్ 64 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అనంతరం తెల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌లో అర్జున్ 69 ఎత్తుల్లో గెలుపొంది సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.
సెమీఫైనల్లో లెవాన్ అరోనియన్ (అమెరికా)తో అర్జున్ తలపడతాడు. ‘వైట్ గ్రూప్’ లీగ్ దశలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి ‘టాపర్’గా నిలిచిన ప్రజ్ఞానందకు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద 3–4 పాయింట్ల తేడాతో పోరాడి ఓడిపోయాడు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 29 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో కరువానా 60 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు.
ఆ తర్వాత మూడో గేమ్‌లో ప్రజ్ఞానంద 58 ఎత్తుల్లో... నాలుగో గేమ్‌లో కరువానా 34 ఎత్తుల్లో నెగ్గారు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ఐదో గేమ్‌లో కరువానా 64 ఎత్తుల్లో నెగ్గి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లగా... ఆరో గేమ్‌లో ప్రజ్ఞానంద 48 ఎత్తుల్లో గెలిచి స్కోరును 3–3తో సమం చేశాడు. నిర్ణాయక ఏడో గేమ్‌లో కరువానా 72 ఎత్తుల్లో గెలిచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. సెమీఫైనల్లో అమెరికాకే చెందిన హాన్స్ నీమన్‌తో కరువానా తలపడతాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో అరోనియన్ 2.5–1.5తో హికారు నకముర (అమెరికా)పై, హాన్స్ నీమన్ 4–2తో సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందారు.