తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్‌: అర్జున్‌ అదరహో... | Sakshi
Sakshi News home page

Telangana Grandmaster Arjun: అర్జున్‌ అదరహో...

Published Sun, Jan 30 2022 5:39 AM

Arjun Erigaisi wins Tata Steel Challengers - Sakshi

విక్‌ ఆన్‌ జీ (నెదర్లాండ్స్‌): మరో రౌండ్‌ మిగిలి ఉండగానే తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ చాలెంజర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో విజేతగా అవతరించాడు. థాయ్‌ దాయ్‌ వాన్‌ ఎన్గుయెన్‌ (చెక్‌ రిపబ్లిక్‌)తో శనివారం జరిగిన 12వ రౌండ్‌ గేమ్‌ను అర్జున్‌ కేవలం 15 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది గ్రాండ్‌మాస్టర్లతో సహా మొత్తం 14 మంది 13 రౌండ్లపాటు పోటీపడుతున్న ఈ టోర్నీలో 12వ రౌండ్‌ తర్వాత అర్జున్‌ 9.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతూ టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు.

ఎన్గుయెన్, జొనాస్‌ బుల్‌ బెరీ (డెన్మార్క్‌) ఇద్దరూ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆదివారం చివరిదైన 13వ రౌండ్‌ గేమ్‌లో అర్జున్‌ ఓడిపోయి, ఎన్గుయెన్, జొనాస్‌ తమ గేముల్లో నెగ్గినా అర్జున్‌ స్కోరును దాటలేకపోతారు. వరంగల్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్‌ చాలెంజర్స్‌ టోర్నీ విజేత హోదాలో వచ్చే ఏడాది జరిగే టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నీకి అర్హత సాధించాడు. పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్‌ తర్వాత టాటా స్టీల్‌ చాలెంజర్స్‌ టోర్నీ టైటిల్‌ గెలిచిన నాలుగో భారతీయ చెస్‌ ప్లేయర్‌గా అర్జున్‌ గుర్తింపు పొందాడు.

‘క్లాసికల్‌ ఫార్మాట్‌లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఆదివారం జరిగే చివరి రౌండ్‌ గేమ్‌లో నెగ్గి గెలుపు సంబరాలు చేసుకోవాలనుకుంటున్నా. ఇటీవల కాలంలో దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్, శ్రీనాథ్‌ నారాయణన్‌ అందించిన సూచనలతో నా ఆట మరింత మెరుగైంది. ఈ టోర్నీ తొలి గేమ్‌లో ఓడిపోయే పరిస్థితి నుంచి తేరుకొని ‘డ్రా’ చేసుకోవడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెండో గేమ్‌లో విజయం సాధించాక అదే జోరును కొనసాగించా’ అని అర్జున్‌ వ్యాఖ్యానించాడు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement