మార్పు... మంచి కోసమే! | Freestyle chess makes the game more popular | Sakshi
Sakshi News home page

మార్పు... మంచి కోసమే!

Aug 7 2025 4:21 AM | Updated on Aug 7 2025 4:21 AM

Freestyle chess makes the game more popular

ఫ్రీస్టయిల్‌ చెస్‌తో ఆటకు మరింత ఆదరణ

గత ఫలితాలపై ఎక్కువగా ఆలోచించను

తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ వ్యాఖ్య

చెస్‌... అందరికీ సుపరిచతమైన ఆట... ఏదో ఒకదశలో ఒక్కసారైనా ఆడిన వాళ్లు ఎందరో ఉన్నారు. అంతర్జాతీయంగానూ ఈ క్రీడకు ఎంతో పేరుంది. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం చెస్‌ ఇంకా అరంగేట్రం చేయలేదు. ఆ దిశగా అడుగులు వేయాలంటే ముందుగా ఆట అందరికీ మరింత చేరువయ్యేలా చేయాలి. ఒకప్పుడు క్లాసికల్‌ ఫార్మాట్‌లోనే ఎక్కువగా చెస్‌ టోర్నీలు జరిగేవి. కాలక్రమేనా చెస్‌ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. నార్వే దిగ్గజం, వరల్డ్‌ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకుంటున్నాడు. 

గ్రాండ్‌చెస్‌ టూర్‌... ఫ్రీస్టయిల్‌ చెస్‌... సూపర్‌బెట్‌ చెస్‌... ఇలా మేటి గ్రాండ్‌మాస్టర్లను భాగస్వామ్యం చేస్తూ నిలకడగా టోర్నీలు నిర్వహిస్తున్నాడు. ఈ తరహా మార్పులతో చెస్‌కు మరింత ఆదరణ పెరుగుతోందని... ఈ ఆట కొత్త శిఖరాలకు చేరుకోవడానికి దోహదం పడుతుందనిప్రపంచ ఆరో ర్యాంకర్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ అభిప్రాయపడుతున్నాడు. నేటి నుంచి జరగనున్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న అర్జున్‌ గత ఫలితాల గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్తాతని తెలిపాడు.  

చెన్నై: అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న భారత స్టార్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి స్వదేశంలో మెగా టోర్నీకి సిద్ధమయ్యాడు. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడనున్నారు. భారత్‌ నుంచి అర్జున్‌తో పాటు, విదిత్‌ గుజరాతీ, నిహాల్‌ సరీన్, కార్తికేయన్‌ మురళి, ప్రణవ్‌ బరిలో ఉన్నారు. ఇటీవల నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న అర్జున్‌... ఫ్రీస్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ టూర్‌తో పాటు ఇ–స్పోర్ట్స్‌ వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. 

స్వదేశంలో జరగనున్న చెన్నై గ్రాండ్‌ మాస్టర్స్‌ టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా అర్జున్‌ అడుగులు వేస్తున్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు అర్జున్‌ మాట్లాడుతూ...  ‘ఎక్కువగా ఆలోచించడం లేదు. ప్రత్యర్థి ఎవరైనా సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకుంటా. క్లాసికల్‌ టోర్నమెంట్‌లో ప్లేయర్లు దీర్ఘాలోచనలో మునిగిపోతారు. దీంతో అభిమానులు విసుగు చెందుతారు. 

కానీ ఇ–స్పోర్ట్స్‌లో అలా జరగదు. వెంట వెంటనే ఎత్తులకు పైఎత్తులు వేయాల్సిన అవసరముంటుంది. అందుకే అభిమానులు ఈ తరహా ఆటలను ఆదరిస్తారు. సమయం అనేది చాలా కీలకం అవుతుంది. ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు. దీంతో చూసేవాళ్లకు బాగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఆటగాళ్లు, అభిమానులు దీని వైపే మొగ్గుచూపడం ఖాయమే’ అని అన్నాడు.  

క్యాండిడేట్స్‌ టోర్నీపై దృష్టి 
ఇక తాజాగా ఇ–స్పోర్ట్స్‌ వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఓటమి పాలవడం బాధించిందని వరంగల్‌ జిల్లాకు చెందిన 21 ఏళ్ల అర్జున్‌ అన్నాడు. ‘ఇ–స్పోర్ట్స్‌ వరల్డ్‌కప్‌’లో సెమీఫైనల్‌కు చేరడం ఆనందంగానే ఉంది. కానీ ఆశించిన ఫలితం రాలేదనే అసంతృప్తి ఉంది. ఆఖరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యాను. ఇలాంటి చేదు అనుభవాల నుంచి బయటపడి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నా’ అని అర్జున్‌ వెల్లడించాడు. లాస్‌వేగస్‌లో జరిగిన గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ అర్జున్‌ ఓటమి పాలయ్యాడు. 

ఫ్రీస్టయిల్‌ ఆడటం చాలా బాగుంటుందన్న అర్జున్‌... భవిష్యత్తులో గ్రాండ్‌స్లామ్‌కు టూర్‌ చెస్‌ క్యాలెండర్‌లో తప్పక చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ప్రపంచ ఆరో ర్యాంక్‌లో ఉన్న అర్జున్‌... అన్ని ఫార్మాట్లలో సత్తా చాటాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుండగా... 8 మంది ప్లేయర్లు టైటిల్‌ కోసం పోటీపడనున్నారు. ఇప్పటికే అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ ఫాబియానో కరువానా ఈ టోర్నీకి అర్హత సాధించగా... మిగిలిన ఏడు స్థానాల కోసం ప్లేయర్లు పోటీపడుతున్నారు. 

ముఖ్యంగి వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన వారిలో ముగ్గురు, గ్రాండ్‌ స్విస్‌ టూర్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ఇద్దరు. ‘ఫిడే సర్క్యూట్‌’ నుంచి ఒకరు క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించనున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్‌ మాట్లాడుతూ... ‘క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించాలంటే నా ముందు రెండే దారులు ఉన్నాయి. గ్రాండ్‌స్విస్, వరల్డ్‌కప్‌ అ రెండింట్లో మెరుగైన ఆటతీరు కనబర్చాలని భావిస్తున్నా. రెండిట్లో కనీసం ఒక్క టోర్నీలో అయినా టైటిల్‌ సాధించాలి.  

రేటింగ్‌లో టాప్‌ 
చెన్నై గ్రాండ్‌ మాస్టర్స్‌ టోర్నీలో పాల్గొంటున్న 10 మంది ప్లేయర్లలో... అర్జున్‌ అత్యధిక రేటింగ్‌ (2,776 పాయింట్లు) కలిగి ఉన్నాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనీశ్‌ గిరి (2748 పాయింట్లు) రెండో... స్థానంలో విన్సెంట్‌ కీమర్‌ (2730 పాయింట్లు; జర్మనీ) మూడో స్థానంలో ఉన్నారు. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరగనున్న ఈ టోర్నీలో 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. 

గత రెండు ఎడిషన్‌లలో అర్జున్‌ త్రుటిలో టైటిల్‌కు దూరమయ్యాడు. 2023లో గుకేశ్‌తో టైబ్రేకర్‌లో ఓడి రెండో స్థానానికి పరిమితం కాగా... గతేడాది కూడా టైటిల్‌ గెలవలేకపోయాడు. ‘గత రెండు పర్యాయాలు ఇక్కడ టైటిల్‌ గెలవకపోవడంతో నాపై ఎలాంటి అంచనాలు లేవు. అదే సమయంలో ఒత్తడి కూడా ఉండదు. దీంతో ప్రదర్శనపై మరింత దృష్టి పెడతా’ అని అర్జున్‌ అన్నాడు. 

అగ్ని ప్రమాదంతో...
నేడు మొదలయ్యే ‘చెన్నై గ్రాండ్‌ మాస్టర్స్‌ 2025’ టోర్నమెంట్‌లో అర్జున్‌ టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. వాస్తవానికి ఈ టోర్నీ బుధవారమే ప్రారంభం కావాలి. కానీ టోర్నీ వేదికైన హయాత్‌ రీజెన్సీ హోటల్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటాక షార్ట్‌ సర్క్యూట్‌తో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పొగ కమ్ముకోవడంతో హోటల్‌ సిబ్బంది అందరినీ బయటకు పంపించారు. టోర్నీ నిర్వాహకులు ఈ టోర్నీలో ఆడుతున్న 20 మంది క్రీడాకారులను వెంటనే సమీపంలో మరో హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. 

బుధవారం సాయంత్రానికల్లా అంతా సర్దుకోవడంతో గురువారం నుంచి ఈ టోర్నీని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో 11వ తేదీన విశ్రాంతి దినం కేటాయించారు. అయితే ఒకరోజు వృథా కావడంతో విశ్రాంతి దినం తొలగించి... వరుసగా తొమ్మిది రోజులపాటు టోర్నీని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement