నాలుగో రౌండ్‌లో కార్తీక్, ప్రణవ్ నిష్క్రమణ
పనాజీ: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత్ నుంచి ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, పెంటేల హరికృష్ణ, ప్రజ్ఞానంద బరిలో మిగిలారు. ఈ ముగ్గురు తదుపరి దశకు అర్హత సాధిస్తారో లేదో నేడు టైబ్రేక్ రౌండ్ తర్వాత తేలుతుంది. క్లాసికల్ ఫార్మాట్‌లో నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత అర్జున్–పీటర్ లెకో (హంగేరి); హరికృష్ణ–నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్); ప్రజ్ఞానంద–డానిల్ దుబోవ్ (రష్యా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతలను నిర్ణయించేందుకు నేడు ర్యాపిడ్ ఫార్మాట్‌లో టైబ్రేక్ గేమ్‌లను నిర్వహిస్తారు.
అర్జున్–పీటర్ లెకో రెండో గేమ్ 36 ఎత్తుల్లో... హరికృష్ణ–గ్రాండెలియస్ రెండో గేమ్ 38 ఎత్తుల్లో... ప్రజ్ఞానంద–దుబోవ్ రెండో గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మరోవైపు మరో ఇద్దరు భారత గ్రాండ్‌మాస్టర్లు కార్తీక్ వెంకటరామన్, ప్రణవ్ నాలుగో రౌండ్‌ను దాటలేకపోయారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండుసార్లు జాతీయ చాంపియన్ కార్తీక్ 0.5–1.5తో లె క్వాంగ్ లియెమ్ (వియత్నాం) చేతిలో... ప్రణవ్ 0.5–1.5తో నొదిర్‌బెక్ యాకు»ొయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు. రెండో గేమ్‌లో కార్తీక్ 68 ఎత్తుల్లో... ప్రణవ్ 38 ఎత్తుల్లో ఓడిపోయారు.
నొదిర్‌బెక్ యాకుబొయెవ్, లె క్వాంగ్ లియెమ్‌లతోపాటు లెవోన్ అరోనియన్ (అమెరికా), అల్కంటారా మార్టినెజ్ (మెక్సికో), అలెగ్జాండర్ డాన్‌షేoకో (జర్మనీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. నాలుగో రౌండ్‌లో అరోనియన్ 1.5–0.5తో రాడోస్లా (పోలాండ్)పై, అల్కంటారా 1.5–0.5తో సరానా అలెక్సీ (సెర్బియా)పై, డాన్‌షేoకో 1.5–0.5తో బ్లూబామ్ మథియాస్ (జర్మనీ)పై విజయం సాధించారు.


