పనాజీ: తాడో పేడో తేల్చుకోవాల్సిన టైబ్రేక్ గేముల్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మెరిశారు. తద్వారా సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో అర్జున్, హరికృష్ణ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
గురువారం జరిగిన నాలుగో రౌండ్ టైబ్రేక్‌లో ప్రపంచ 6వ ర్యాంకర్, 22 ఏళ్ల అర్జున్ 2–0తో ప్రపంచ 55వ ర్యాంకర్, 46 ఏళ్ల పీటర్ లెకో (హంగేరి)పై... ప్రపంచ 46వ ర్యాంకర్ హరికృష్ణ 1.5–0.5తో ప్రపంచ 52వ ర్యాంకర్ నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్)పై గెలుపొందారు.
పీటర్ లెకోతో జరిగిన తొలి టైబ్రేక్ గేమ్‌లో అర్జున్ 40 ఎత్తుల్లో... రెండో టైబ్రేక్ గేమ్‌లో 57 ఎత్తుల్లో నెగ్గాడు. గ్రాండెలియస్‌తో జరిగిన తొలి టైబ్రేక్ గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... రెండో టైబ్రేక్ గేమ్‌లో 34 ఎత్తుల్లో విజయం సాధించాడు.
ప్రజ్ఞానందకు నిరాశ
భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. తమిళనాడుకు చెందిన ప్రపంచ 7వ ర్యాంకర్ ప్రజ్ఞానంద ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ప్రపంచ 45వ ర్యాంకర్ డానిల్ డుబోవ్ (రష్యా)తో జరిగిన టైబ్రేక్‌లో ప్రజ్ఞానంద 0.5–1.5తో ఓడిపోయాడు.


