కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్‌లో జరుగుతున్న 12వ మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో భాగంగా బెస్ట్ మాస్టర్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మేడ్చల్ జిల్లాకు చెందిన మాస్టర్ అథ్లెట్, సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డి అందుకున్నారు. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్ పోటీల్లో 45ఏళ్ల విభాగంలో 800 మీటర్ల రన్నింగ్‌ను 3.33 నిమిషాల్లో చేరుకుని దివ్యారెడ్డి బంగారు పతకాన్ని సాధించారు.
కొన్నేళ్లుగా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 100, 400, 800 మీటర్ల రన్నింగ్ ఈవెంట్లలో పాల్గొంటూ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో పతకాలను కైవసం చేసుకొని జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నారు. ఆమెకు జ్ఞాపికతోపాటు బంగారు పతకం, సర్టిఫికెట్‌ను రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి అందించారు. తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చాట్ల శ్రీధర్, నీలం లక్ష్మణ్, శాట్స్ రిటైర్డ్ ఏడీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


