అండర్-19 ప్రపంచకప్ 2026కు భారత జట్టును బీసీసీఐ శనివారం రాత్రి ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు ఆయుశ్ మాత్రే సారథ్యం వహించనుండగా... విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు భారత యువ జట్టు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ మాత్రే, మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యాడు. దీంతో మాత్రే స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టు బాధ్యతలను చేపట్టనున్నాడు.
కాగా వరల్డ్‌కప్ జట్టులో హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్‌కు చోటు దక్కింది. ఆసియాకప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ప్రపంచకప్ జట్టులోనూ సెలక్టర్లు కొనసాగించారు. సౌతాఫ్రికా పర్యటనలో సూర్యవంశీకి డిప్యూటీగా జార్జ్ వ్యవహరించాడు. దీంతో జార్జ్ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.
ఎవరీ ఆరోన్ జార్జ్..?
19 ఏళ్ల ఆరోన్ జార్జ్ పుట్టింది కేరళలో అయినప్పటికీ.. జానియర్ స్దాయి క్రికెట్‌లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జార్జ్‌కు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మిడిలార్డర్ ఆటగాడికి పరిస్థితులకు తగ్గట్టు ఆడే సత్తా ఉంది. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉందంటే అందరి చూపు జార్జ్‌పైనే ఉంటుంది.
అతడి బ్యాటింగ్ శైలి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను పోలి ఉంటుంది. అదేవిధంగా అతడికి మంచి కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా హైదరాబాద్‌కు వినూ మాన్కడ్ ట్రోఫీని ఆరోన్ అందించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ( 2022-23)లో బీహార్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించి తొలిసారిగా అందరి దృష్టిని జార్జ్ ఆకర్షించాడు.
గత రెండు సీజన్లలో కలిపి 700 పైగా పరుగులు చేసి హైదబాద్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అంతేకాకుండా గత నెలలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన అండర్-19 ట్రై-సిరీస్‌లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్‌గా కూడా అతడు వ్యవహరించాడు.
ఆసియాకప్ 2025లోనూ పాకిస్తాన్‌పై 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం జార్జ్ అమ్ముడుపోలేదు. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఎవరైనా గాయపడితే జార్జ్‌ను ప్రత్నమ్నాయంగా తీసుకునే అవకాశముంది. సీఎస్‌కే తరపున దుమ్ములేపుతున్న మాత్రే కూడా అలా వచ్చినవాడే.
అండర్–19 వరల్డ్‌కప్‌నకు భారత జట్టు: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హర్‌వర్దన్ సింగ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్.
దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత అండర్–19 జట్టు: వైభవ్ సూర్యవంశీ (కెపె్టన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెపె్టన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండు, హర్‌వర్దన్ సింగ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, యువరాజ్ గోహిల్, రాహుల్ కుమార్.


