
చెన్నై: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో అనీశ్ గిరి (నెదర్లాండ్స్), అర్జున్, కార్తికేయన్ మురళీ (భారత్) 5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. దాంతో అనీశ్‌కు రెండో స్థానం, అర్జున్‌కు మూడో స్థానం, కార్తికేయన్‌కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. 7 పాయింట్లతో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్ చాంపియన్‌గా నిలిచాడు.
భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు నిహాల్ సరీన్ 4.5 పాయింట్లతో ఐదో స్థానంలో, విదిత్ 4 పాయింట్లతో ఏడో స్థానంలో, ప్రణవ్ 3 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహించారు. శుక్రవారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేముల్లో కీమెర్ 41 ఎత్తుల్లో రే రాబ్సన్ (అమెరికా)పై, అనీశ్ గిరి 33 ఎత్తుల్లో జోర్డెన్ (నెదర్లాండ్స్)పై గెలిచారు.
అర్జున్–కార్తికేయన్ గేమ్ 49 ఎత్తుల్లో... విదిత్ (భారత్)–లియాంగ్ (అమెరికా) గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. విజేత కీమెర్‌కు రూ. 25 లక్షలు... అనీశ్‌కు రూ. 15 లక్షలు... అర్జున్‌కు రూ. 10 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదే వేదికపై జరిగిన చాలెంజర్స్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రాణేశ్ 6.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. తద్వారా వచ్చే ఏడాది చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. హైదరాబాద్ ప్లేయర్ హారిక 1.5 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది.