పనాజీ: ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... చెక్ రిపబ్లిక్‌లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ... తమిళనాడుకు చెందిన ప్రణవ్ శుభారంభం చేశారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ అర్జున్ 30 ఎత్తుల్లోషమ్సిదిన్ వొఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, ప్రపంచ 36వ ర్యాంకర్ హరికృష్ణ 25 ఎత్తుల్లో డేనియల్ దర్ధా (బెల్జియం)పై... ప్రపంచ 86వ ర్యాంకర్ ప్రణవ్ 102 ఎత్తుల్లో టిటాస్ స్ట్రెమావిసియస్ (లిథువేనియా)పై విజయం సాధించారు.
నేడు జరిగే రెండో గేమ్‌ను అర్జున్, హరికృష్ణ, ప్రణవ్‘డ్రా’ చేసుకుంటే నాలుగో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. మరోవైపు భారత్‌కే చెందిన క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద, ప్రాణేశ్, దీప్తాయన్ ఘోష్, ఎస్‌ఎల్ నారాయణన్, విదిత్ సంతోష్ గుజరాతి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ మూడో రౌండ్‌లో తమ తొలి గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు.
గుకేశ్–ఫ్రెడరిక్ స్వెన్ (జర్మనీ) గేమ్ 34 ఎత్తుల్లో... ప్రజ్ఞానంద–రాబర్ట్ హోవ్‌నిసియాన్ (అర్మేనియా) గేమ్ 30 ఎత్తుల్లో... ప్రాణేశ్–విన్సెంట్ కీమర్ (జర్మనీ) గేమ్ 85 ఎత్తుల్లో... దీప్తాయన్–గాబ్రియేల్ సర్గాసియన్ (అర్మేనియా) గేమ్ 60 ఎత్తుల్లో... నారాయణన్–యు యాంగీ (చైనా) గేమ్ 117 ఎత్తుల్లో... విదిత్–స్యామ్ షాంక్‌లాండ్ (అమెరికా) గేమ్ 32 ఎత్తుల్లో... కార్తీక్ వెంకటరామన్–డేనియల్ బొగ్డాన్ (రొమేనియా) గేమ్ 65 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. నేడు వీరి మధ్య జరిగే గేమ్‌లో గెలిచిన వారు నాలుగో రౌండ్‌కు చేరుకుంటారు. గేమ్‌లు ‘డ్రా’ అయితే ఆదివారం టైబ్రేక్ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.


