
ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్ చెస్ టోర్నీ
లాస్ వేగస్: భారత చెస్ స్టార్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్ చెస్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. అప్రతిహత విజయాలతో దూసుకొచ్చిన అర్జున్... సెమీస్‌లో 0–2 పాయింట్ల తేడాతో లెవాన్ అరోనియన్ (అమెరికా) చేతిలో ఓడాడు. ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరిన తొలి భారత చెస్ ప్లేయర్‌గా నిలిచిన అర్జున్ కీలక పోరులో ఆకట్టుకోలేకపోయాడు.
తొలి గేమ్‌లో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్న అర్జున్... రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ పోటీలో నిలిచేందుకు రిస్క్ తీసుకొని పరాజయం పాలయ్యాడు. మరో సెమీస్‌లో హాన్స్ నీమన్ (అమెరికా) 2.5–1.5తో ఫాబియానో కరువానా (అమెరికా)పై విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. తుదిపోరులో నీమన్‌తో అరోనియన్ తలపడనున్నాడు.
‘వైట్ గ్రూప్’ లీగ్ దశలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి ‘టాపర్’గా నిలిచి ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద వర్గీకరణ మ్యాచ్‌లో 1.5–0.5తో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)పై గెలుపొందాడు. ఇతర క్లాసిఫికేషన్ మ్యాచ్‌ల్లో కార్ల్‌సన్ 1.5–0.5తో జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, హికారు నకముర (అమెరికా) 2–0తో లెనియర్ డొమింగెజ్ పెరెజ్ (అమెరికా)పై, వెస్లీ సో (అమెరికా) 3–1తో నొదిర్‌బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయాలు సాధించారు.