కొన్ని కంపెనీలు డీలా.. ఇంకొన్ని భళా | Corporate companies quarterly results, Check details | Sakshi
Sakshi News home page

కొన్ని కంపెనీలు డీలా.. ఇంకొన్ని భళా

Jan 20 2026 8:54 AM | Updated on Jan 20 2026 10:56 AM

Corporate companies quarterly results, Check details

సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీ ఎల్‌టీఐమైండ్‌ట్రీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం వార్షికంగా 11 శాతం క్షీణించి రూ. 971 కోట్లకు పరిమితమైంది. కొత్త కార్మిక చట్టాల అమలుకు రూ. 590 కోట్లమేర చేపట్టిన వన్‌టైమ్‌ కేటాయింపులు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,085 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 12 శాతం ఎగసి రూ. 10,781 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 9,661 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఈ ఏడాది క్యూ2(జూలై–సెపె్టంబర్‌)తో పోలిస్తే నికర లాభం 31 శాతం క్షీణించగా.. ఆదాయం 4 శాతం పుంజుకుంది. కాగా.. 1,511 మంది ఉద్యో గులు కొత్తగా జత కలవడంతో 2025 డిసెంబర్‌31కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 87,958కు చేరింది.


పీఎన్‌బీ లాభం పటిష్టం

ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 13 శాతం ఎగసి రూ. 5,100 కోట్లను తాకింది. ఇది బ్యాంక్‌ చరిత్రలోనే అత్యధికంకాగా.. మొండి రుణాలు తగ్గడం ఇందుకు  సహకరించింది. ఇకపై ప్రతి క్వార్టర్‌లోనూ ఇదేస్థాయిలో లాభాలు ఆర్జించడంపై దృష్టి పెట్టనున్నట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈవో అశోక్‌ చంద్ర పేర్కొన్నారు. కాగా.. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 4,508 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 34,752 కోట్ల నుంచి రూ. 37,253 కోట్లకు బలపడింది. అయితే నికర వడ్డీ ఆదాయం రూ. 11,032 కోట్ల నుంచి రూ. 10,503 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.09 శాతం నుంచి 3.19 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.41 శాతం నుంచి 0.32 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 318 కోట్ల నుంచి రూ. 1,341 కోట్లకు భారీగా పెరిగాయి. ఈసీఎల్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా రూ. 955 కోట్ల అదనపు కేటాయింపులు చేపట్టినట్లు చంద్ర వెల్లడించారు. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 16.77 శాతంగా నమోదైంది. ఒక భారీ మొండి రుణ ఖాతా నుంచి రికవరీ కారణంగా రికవరీలు రూ. 823 కోట్ల నుంచి రూ. 1,956 కోట్లకు ఎగశాయి.


టాటా క్యాపిటల్‌ లాభం జూమ్‌

ప్రయివేట్‌ రంగ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం టాటా క్యాపిటల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 39 శాతం జంప్‌చేసి రూ. 1,285 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 922 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 33 శాతం ఎగసి రూ. 3,594 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 2,711 కోట్ల టర్నోవర్‌ సాధించింది. నికర వడ్డీ ఆదాయం 26 శాతం మెరుగుపడి రూ. 2,936 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 2,323 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 26 శాతం వృద్ధితో రూ. 2,34,114 కోట్లకు చేరాయి. గత క్యూ3లో ఏయూఎం రూ. 1,86,404 కోట్లుగా నమోదైంది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.6 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.6 శాతానికి చేరాయి. కంపెనీ 2025 అక్టోబర్‌లో లిస్టయ్యాక రెండోసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది.


బీహెచ్‌ఈఎల్‌ లాభం దూకుడు

విద్యుత్‌ పరికరాల ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(బీహెచ్‌ఈఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం మూడు రెట్లు దూసుకెళ్లి రూ. 390 కోట్లను అధిగమించింది. కీలక విభాగాల నుంచి ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 135 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18 శాతం వృద్ధితో రూ. 8,692 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 7,385 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ప్రధానంగా విద్యుత్‌ విభాగం ఆదాయం రూ. 5,585 కోట్ల నుంచి రూ. 6,322 కోట్లకు ఎగసింది. ఇండస్ట్రీ విభాగం ఆదాయం రూ. 1,689 కోట్ల నుంచి రూ. 2,151 కోట్లకు జంప్‌చేసింది.


హావెల్స్‌ లాభం ప్లస్‌

కన్జూమర్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ దిగ్గజం హావెల్స్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 300 కోట్లను అధిగమించింది. ఇందుకు కేబుళ్లు, వైర్ల బిజినెస్‌ పురోభివృద్ధి దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 278 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 14 శాతం ఎగసి రూ. 5,588 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 4,889 కోట్ల టర్నోవర్‌ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 13 శాతం పెరిగి రూ. 5,189 కోట్లను దాటాయి.  ఇతర ఆదాయంతో కలసి మొత్తం టర్నోవర్‌ 13 శాతం ఎగసి రూ. 5,631 కోట్లకు చేరింది. కాగా.. కొత్త కార్మిక చట్టాల అమలు నేపథ్యంలో రూ. 45 కోట్లు అనూహ్య కేటాయింపులుగా నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. విభాగాలవారీగా స్విచ్‌గేర్ల ఆదాయం 8 శాతం వృద్ధితో 624 కోట్లను తాకగా.. కేబుళ్ల బిజినెస్‌ 33 శాతం జంప్‌చేసి రూ. 2,241 కోట్లకు చేరింది. లైటింగ్‌ తదితరాల నుంచి 4 శాతం తక్కువగా రూ. 423 కోట్లు సాధించింది. ఎలక్ట్రికల్‌ కన్జూమర్‌ ఉత్పత్తుల బిజినెస్‌ 4 శాతం పుంజుకుని రూ. 1,151 కోట్లయ్యింది. లాయిడ్‌ కన్జూమర్‌ ఆదాయం 7 శాతం నీరసించి రూ. 694 కోట్లకు పరిమితంకాగా.. ఇతర ఆదాయం 22 శాతం ఎగసి రూ. 310 కోట్లుగా నమోదైంది.

ఇదీ చదవండి: ట్రంప్‌ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement