
చెన్నై: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ మాస్టర్స్ కేటగిరీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ చేరింది. విన్సెంట్ కీమెర్ (జర్మనీ)తో మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను అర్జున్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇతర గేముల్లో జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) 51 ఎత్తుల్లో నిహాల్ సరీన్ (భారత్)పై, అవండర్ లియాంగ్ (అమెరికా) 61 ఎత్తుల్లో ప్రణవ్ (భారత్)పై గెలిచారు.
రే రాబ్సన్ (అమెరికా)–కార్తికేయన్ మురళీ (భారత్) గేమ్ 123 ఎత్తుల్లో... విదిత్ గుజరాతి (భారత్)–అనీశ్ గిరి (నెదర్లాండ్స్) గేమ్ 109 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఆరో రౌండ్ తర్వాత కీమెర్ 4.5 అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 3.5 పాయింట్లతో అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఇదే టోర్నమెంట్ చాలెంజర్స్ కేటగిరీలో భారత గ్రాండ్‌మాస్టర్,హైదరాబాద్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక తొలి విజయం అందుకుంది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలితో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హారిక 80 ఎత్తుల్లో గెలిచింది.