కరువానాపై అర్జున్‌ విజయం | Mixed results for Indian star grandmasters at Norway Open chess tournament | Sakshi
Sakshi News home page

కరువానాపై అర్జున్‌ విజయం

Jun 5 2025 2:24 AM | Updated on Jun 5 2025 2:24 AM

Mixed results for Indian star grandmasters at Norway Open chess tournament

నకముర చేతిలో గుకేశ్‌ ఓటమి

ఆధిక్యంలో కోనేరు హంపి  

స్టావెంజర్‌: నార్వే ఓపెన్‌ చెస్‌ టోర్నీలో భారత స్టార్‌ గ్రాండ్‌మాస్టర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. క్లాసికల్‌ ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ జోరుకు బ్రేక్‌ పడగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత నంబర్‌వన్‌ ఇరిగేశి అర్జున్‌ అద్భుత విజయంతో టైటిల్‌ రేసులోకి వచ్చాడు. ఎనిమిదో రౌండ్‌లో తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల గుకేశ్‌ 50 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ హికారు నకముర (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. 

మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్‌ అర్జున్‌ 71 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఫాబియానో కరువానా (అమెరికా)ను బోల్తా కొట్టించాడు. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో మరో రెండు రౌండ్‌లు మిగిలి ఉన్నాయి. క్లాసికల్‌ గేమ్‌లోనే విజయం సాధిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ క్లాసికల్‌ గేమ్‌ ‘డ్రా’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్‌ గేమ్‌ను నిర్వహిస్తారు. 

క్లాసికల్‌ గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్‌ గేమ్‌లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్‌ గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్‌ గేమ్‌లో ఓడిపోతే 1 పాయింట్‌ దక్కుతుంది. క్లాసికల్‌ గేమ్‌లో ఓడిపోతే ఎలాంటి పాయింట్లు లభించవు. ఎనిమిదో రౌండ్‌ ముగిశాక కరువానా 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 12 పాయింట్లతో కార్ల్‌సన్‌ రెండో స్థానంలో, 11.5 పాయింట్లతో నకముర, గుకేశ్‌ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. 10.5 పాయింట్లతో అర్జున్‌ ఐదో స్థానంలో, వె యి (చైనా) 8 పాయింట్లతో చివరిదైన ఆరో స్థానంలో ఉన్నారు.  

ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత  గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి 13.5 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఎనిమిదో రౌండ్‌ గేమ్‌లో హంపి 58 ఎత్తుల్లో సారా ఖాదెమ్‌ (స్పెయిన్‌)ను ఓడించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి 37 ఎత్తుల్లో ప్రపంచ చాంపియన్‌ జు వెన్‌జున్‌పై సంచలన విజయం సాధించింది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement