టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం అసన్నమైందా? అంటే అవునానే సమాధనం ఎక్కువగా వినిపిస్తోంది. జడేజా టెస్టు క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ అతడి ఆట తీరు ఏ మాత్రం మారలేదు. తొలి వన్డేలో కూడా ఘోరంగా విఫలమైన జడేజా బుధవారం జరిగిన రెండో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో జడేజా 8 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 44 పరుగులు సమర్పించుకున్నాడు.
బ్యాటింగ్‌లోనూ కేవలం 27 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలిగడంతో జడేజా ఒక్కడే సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్‌ను ఎందుకు వన్డే జట్టులోకి తీసుకోవడం లేదని సెలెక్టర్లను శ్రీకాంత్ ప్రశ్నించాడు. జడేజా పేలవ ఫామ్ గురుంచి కూడా అతడు మాట్లాడాడు.
"నాకు ఇష్టమైన ఆటగాళ్లలో జడేజా ఒకరు. కానీ అతడు ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించలేకపోతున్నాడు. బంతిని అటాకింగ్‌గా వేయాలా లేక ఫ్లైట్ ఇచ్చి బ్యాటర్‌ను ట్రాప్ చేయాలా అనే విషయంలో అతడు కాస్త గందరగోళంగా ఉన్నాడు.
ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఎందుకు ఆడకూడదు? ఆల్‌రౌండర్ అంటే మీడియం పేసరే ఉండాలనే రూల్ ఏమైనా ఉందా? రాజ్‌కోట్ వన్డేలో భారత్‌కు అదనపు స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. అక్షర్ పటేల్ ఉండి ఉంటే బాగుండేది. అక్షర్‌ను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదు? అతడొక అద్భుతమైన ఆల్‌రౌండర్. చాలా మ్యాచ్‌లలో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు.
హార్దిక్ పాండ్యాకు సాటి వచ్చే ఆటగాడు దొరకడం కష్టం. కాబట్టి అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవడం బెటర్" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా వాషీ స్దానంలో తుది జట్టులోకి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
దీంతో మరోసారి భారత జట్టులో ఆల్‌రౌండర్ల కొరత కన్పిస్తోంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా.. ఇదే ఫామ్ కొనసాగితే వన్డేల నుంచి కూడా తప్పుకొనే అవకాశముంది. ఈ క్రమంలో జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్ పేరును చాలా మంది మాజీలు సూచిస్తున్నారు.
చదవండి: ఇరగదీసిన అరంగేట్రం ఆటగాడు.. ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్
జడేజా తరహాలోనే ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అక్షర్‌కు ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, సెలక్టర్లు అక్షర్ పటేల్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అక్షర్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లోనూ సత్తాచాటాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులోనూ అతడు భాగంగా ఉన్నాడు.


