గ్యాస్ట్రోనమీ కేటగిరీలో చేర్చిన యునెస్కో
లక్నో: నవాబ్‌ల నగరం లక్నో కీర్తికిరీటంలోకి మరో కలికితురాయి వచ్చి చేరింది. దూది పింజంలాంటి సుత్తి మెత్తని గలౌటీ కబాబ్‌లు, ఘుమఘుమల అవధ్ బిర్యానీ, మఖన్ మలాయ్ దాకా ఎన్నెన్నో నోరూరించే వంటకాలకు పేరెన్నికగన్న లక్నోకు యునెస్కో తన ‘పాకశాస్త్ర ప్రవీణ’ కంకణాన్ని కట్టబెట్టింది. ప్రాచీన సంప్రదాయ వంటకాలకు వారసత్వంగా కాపాడుకుంటూ భావి తరాలకు వాటిలోని కమ్మదనం, రుచి, ఘుమఘుమలను అందిస్తూ లక్నో తన ఆహార, ఆతిథ్య ప్రతిభను చాటిందని యునెస్కో శ్లాఘించింది.
ఈ మేరకు ‘క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’ హోదాతో గౌరవించింది. ఆహార సంస్కృతి సంప్రదాయాలకు తోడు మేలైన దినుసుల మేళవింపుగా అద్భుతమైన రుచితో పలు రకాల వంటకాలకు లక్నో కేంద్రస్థానంగా మారిందని యునెస్కో పొగిడింది. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) తాజాగా 58 నగరాలను తమ క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్(సీసీఎన్)లో చేర్చగా అందులో లక్నో స్థానం సంపాదించుకుంది. దీంతో మొత్తం 100 దేశాల్లో ఇప్పటిదాకా ఈ జాబితాలో చేరిన నగరాల సంఖ్య 408కి పెరిగింది.
వంటల రాజధాని
లక్నోకు విచ్చేసే స్వదేశీ, విదేశీ పర్యాటకులకు ఏ మూలన చూసిన విశిష్టమైన ఆహారపదార్థాలు ఆహ్వానం పలుకుతాయి. చూడగానే నోట్లో లాలాజలం ఊరేలా చేస్తాయి. గలౌటీ కబాబ్, అవధ్ బిర్యానీ, ఎన్నో దినుసుల ఛాట్, గోల్‌గప్పాతోపాటు మఖన్ మలాయ్ వంటి తీపి పదార్థాలను రుచి చూసిన వాళ్లకే తెలుస్తుంది ఆ వంటకాల్లోని గొప్పదనం. భోజనప్రియులకు లక్నో ఒక స్వర్గం. అక్కడ స్థానిక వంటకాలకు కొదువే లేదు. శతాబ్దాలనాటి సంప్రదాయక వంటకాలకు ఎప్పట్నుంచో అంతర్జాతీయ పేరున్నా యునెస్కో వంటి ఐరాస అనుబంధ సంస్థ జాబితాలో స్థానం దక్కించుకోవడం ఇదే తొలిసారి.
‘‘భారత ఘన వారసత్వాల్లో ఆహార పదార్థాలూ ప్రధానమే. పాక నైపుణ్యంలో విలక్షణ భారతీయ శైలిని లక్నో శతాబ్దాలుగా అలాగే కొనసాగిస్తోంది’’ అని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆనందం వ్యక్తంచేశారు. తిండిప్రియులకు లక్నో స్వర్గధామం. ‘‘ మెత్తని చికెన్, మటన్‌తో చేసే గలౌటీ(గలావతి) కబాబ్ నోట్లో వేయగానే కరిగిపోతుంది. సాధారణ స్థాయి మసాలా దట్టించిన ఈ కబాబ్ రుచి అసాధారణం. నగర చిరునామాగా ఎన్నో వంటకాలున్నాయి’’ అని లక్నోలోని అమీనాబాద్‌లోని ప్రఖ్యాత ఠండే కబాబ్ దుకాణం యజమాని మొహమ్మద్ ఉస్మాన్ చెప్పారు. ‘‘మలాయ్ గిలౌరీ లక్నోలో ఎంతో ఫేమస్. బంగాళాదుంపకు బదులు ఉడికించిన తెల్ల బఠానీల మసాలాతో పానీ కీ బతాషే రుచి చూస్తే అంతే ఇక. షీర్మల్, దవళవర్ణ బటర్ కుల్చా, నిహారీ, దాల్–గోష్త్, పత్థర్ కీ కబాబ్‌ల దాకా ఎన్నో వెరైటీ వంటకాలను ఇక్కడ రుచి చూడొచ్చు.


