breaking news
Shiva and Parvati
-
అత్రీశ్వర మహాత్మ్యం
చిత్రకూట పర్వతానికి సమీపంలో కామదారణ్యం ఉంది. అపారమైన వృక్షసంపదతో, వనచరాలతో, పక్షుల కిలకిలరావాలతో అలరారే కామదారణ్యం పరమ పవిత్రమైన తపోభూమి. తపోధనులకు పెన్నిధిలాంటి కామదారణ్యంలో బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షి తన భార్య అనసూయతో కలసి ఆశ్రమం ఏర్పరచుకుని, తపోనిష్ఠతో ఉండేవాడు.కొంతకాలానికి కామదారణ్యంలో అనావృష్టి ఏర్పడింది. చెట్లు చేమలు ఎండిపోయాయి. మహావృక్షాలు సైతం మోడువారిపోయాయి. అరణ్యంలోని వాపీ కూప తటాకాది జలవనరులన్నీ ఎండిపోయాయి. ఆహారం దొరకక పశు పక్ష్యాదులు అల్లాడిపోయాయి. మోడువారిన వృక్షాలను ఆశ్రయించుకుని ఉన్న పక్షులు ఎండుటాకుల్లా నేలరాలాయి. కనుచూపు మేరలో పచ్చదనం కనిపించని పరిస్థితులు దాపురించాయి. నేల బిరుసెక్కి బీటలువారింది. పచ్చని అరణ్యం ఎండిపోవడంతో పశుపక్ష్యాదులు కళ్ల ముందే నశించిపోతుండటం చూసి, భూతదయ గల అనసూయ అమితంగా కలత చెందింది.‘స్వామీ! అనావృష్టి వల్ల పచ్చని అడవి ఎండిపోయింది. ఆకలి దప్పికలను తీర్చుకోలేక వన్యప్రాణులన్నీ కళ్లముందే నశిస్తున్నాయి. ఈ ప్రాణి వినాశనాన్ని చూడలేకున్నాను. ప్రాణులను రక్షించడానికి వర్షాగమనం కోసం వరుణదేవుడిని ప్రార్థించండి’ అని భర్తను కోరింది.అనావృష్టి కారణంగా జరుగుతున్న ప్రాణినష్టానికి అత్రి మహర్షి కూడా ఆవేదన చెంది, గంగాధరుడైన పరమశివుడిని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించాడు. రోజుల తరబడి ఆయన తపస్సు కొనసాగుతున్నా, కామదారణ్యంలో చినుకు జాడ లేదు. అనసూయ తపోనిష్ఠలో ఉన్న భర్తను సేవించుకుంటూనే, ఆశ్రమంలో మట్టితో ఒక పార్థివ శివలింగాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజించసాగింది. అనసూయ నియమనిష్ఠలకు, అత్రి మహర్షి తపస్సుకు పరవశుడైన పరమశివుడు గంగా పార్వతీ సమేతంగా కామ్యదారణ్యానికి అరుదెంచాడు. తగిన తరుణం కోసం అక్కడే వేచి ఉండసాగాడు.ఒకనాడు అత్రిమహర్షి ధ్యానసమాధి నుంచి బయటకు వచ్చాడు.‘దాహంగా ఉంది. మంచినీళ్లు తీసుకురా’ అని భార్యను కోరాడు.ఆ సమయానికి ఆశ్రమంలో చుక్కనీరైనా లేకపోవడంతో అనసూయ కలశాన్ని తీసుకుని, అడవిలోకి వెళ్లింది. ఎక్కడైనా నీటిజాడ కనిపిస్తుందేమోనని వెదుకుతూ ముందుకు సాగింది. ఎంత దూరం వెళ్లినా ఆమెకు ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. అనసూయ నీటి కోసం వెదుకుతూ అలా ముందుకు వెళుతుండగా, ఒకచోట గంగాదేవి ఒక గిరిజన వనిత రూపంలో కనిపించింది. ‘ఎవరమ్మా నువ్వు! ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?’ అని ఆమె అనసూయను ప్రశ్నించింది.‘చిరకాలం తపస్సమాధిలో ఉన్న నా భర్త ఇందాకే తపో విరమణ చేశాడు. ఆయన దాహార్తితో నీళ్లు తెమ్మన్నాడు. అందుకే నీటి కోసం వెదుకుతున్నాను. దగ్గరలో నీరు దొరికే చోటు నీకేమైనా తెలిస్తే చెప్పవా?’ అభ్యర్థించింది అనసూయ.‘ఇక్కడే నువ్వు నిలుచున్న తావునే చేయిలోతు గోతిని తవ్వు. నీళ్లు దొరుకుతాయి’ అని చెప్పిందామె.అనసూయ ఆమె చెప్పినట్లే అక్కడ గొయ్యి తవ్వింది. చేయిలోతు తవ్వగానే స్వచ్ఛమైన నీరు ఉబికి వచ్చింది. ఆ నీటితో అనసూయ కలశాన్ని నింపుకుంది. చూస్తుండగానే అక్కడ స్వచ్ఛజలంతో నిండిన చక్కని తటాకం ఏర్పడింది. ‘కరుణామయీ! నువ్వు దేవతాస్త్రీలా ఉన్నావు. దయచేసి నేను నా భర్తతో కలసి తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉండవూ! ఇప్పుడే మేమిద్దరం వచ్చి నీ దర్శనం చేసుకుంటాము’ అని అభ్యర్థించింది అనసూయ.ఆమె సరేనని పలికింది.అనసూయ ఆశ్రమానికి చేరుకుని, భర్తకు మంచినీరు ఇచ్చింది. ఆయన తృప్తిగా నీరుతాగి, ‘ఎక్కడా చినుకు జాడ లేకున్నా, ఇంత స్వచ్ఛమైన నీరు ఎక్కడ దొరికింది?’ అని ఆశ్చర్యంగా అడిగాడు.అనసూయ భర్తకు జరిగినదంతా చెప్పింది. వెంటనే ఇద్దరూ కలసి అడవిలో జలతటాకం ఏర్పడిన చోటుకు వెళ్లారు. అప్పటి వరకు గిరిజన వనిత రూపంలో ఉన్న గంగాదేవి వారికి నిజరూపంలో దర్శనమిచ్చింది. ‘ఏ వరం కావాలో కోరుకోండి’ అని ఆ దంపతులను అడిగింది.‘తల్లీ! ఈ తపోవనంలో నువ్వు నిత్యనివాసం ఉండాలి’ అని వారు ప్రార్థించారు.‘మీ దంపతులు ఏడాదికాలం శివార్చన ఫలాన్ని ధారపోస్తే ఇక్కడే శాశ్వతంగా ఉంటాను’ అని పలికింది గంగ.వెంటనే అత్రి మహర్షి, అనసూయ దంపతులు తమ శివార్చన ఫలాన్ని ధారపోశారు. వారి దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీసమేతంగా ప్రత్యక్షమయ్యాడు. ముని దంపతుల కోరికపై అనసూయ అర్చిస్తూ వచ్చిన పార్థివలింగంలోకి తేజోరూపంలో లీనమయ్యాడు. అనసూయ అర్చించిన ఆ శివలింగమే అత్రీశ్వర లింగంగా పురాణ ప్రసిద్ధి పొందింది.∙సాంఖ్యాయన -
శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం (ఫొటోలు)
-
కొండలలో కోటి జ్ఞానకాంతుల స్వామి పళని మురుగన్
శివపార్వతుల గారాల తనయుడు, దేవసేనాధిపతి, తారకాసురుడనే రాక్షస సంహారానికి ఉద్భవించిన కారణజన్ముడు కార్తికేయుడు. సకల విద్యాపారంగతుడిగా, జ్ఞానప్రదాతగా, దండాయుధపాణిగా, నిత్యయవ్వనుడుగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పేరుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలకు, ఆయనను అర్చించే భక్తులకు తెలుగునాట కొదవలేనప్పటికీ తమిళనాడు, కర్ణాటకలలో మనకన్నా అధికంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి అడుగడుగునా గుడులు కట్టి పూజించడం సర్వసాధారణంగా కనబడుతుంటుంది. తమిళనాట గల ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యక్షేత్రం పళని. దండాయుధపాణిగా, బాలమురుగన్‌గా, పళని మురుగన్‌గా తమిళులు కొలిచే ఈ స్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనదిగా, మహిమాన్వితమైనదిగా వాసికెక్కింది. స్థలపురాణం: వినాయకచవితినాడు మనందరం చెప్పుకునే కథ ఒకటుంది. అదేమంటే గణాధిపత్యం కోసం పోటీపడుతున్న కుమారులతో భూమండల ంలోని అన్ని పుణ్యతీర్థాలలోనూ స్నానం చేసి, ఎవరు ముందుగా తమ వద్దకు వస్తారో, వారికే గణాధిపత్యమిస్తానని శివుడు చెప్పడం, ఆ మాట వినడంతోటే తన మయూరవాహనాన్ని అధిరోహించి, కుమారస్వామి వాయువేగంతో వెళ్లిపోవడం, వినాయకుడు తెలివి తేటలను ఉపయోగించి, నారాయణ మంత్రాన్ని పఠిస్తూ, మూడుమార్లు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఆ ప్రదక్షిణ మహిమతో కుమారస్వామి ఏ పుణ్యతీర్థానికేగినా అన్నగారే తనకన్నా ముందుగా వచ్చి పుణ్యతీర్థాలలో స్నానం చేసి వె ళ్లిన ఆనవాళ్లు కనిపించి ఖిన్నుడై, కైలాసం వచ్చేసరికి, ఈ పరీక్షలో గణేశుడే నెగ్గాడంటూ గణాధిపత్యాన్ని వినాయకుడికే కట్టబెట్టడం.. ఆ ఆనందోత్సాహాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం... ఇంతవరకూ కథ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగిందో, వినాయకచవితిరోజున తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. అది ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పుడు జరిగిన పరిణామానికి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో బాధపడతాడు. తలిదండ్రుల మీద అలిగి, అన్నగారిలాగా తనకు కూడా పరిపక్వమైన జ్ఞానం లభించాలనే కాంక్షతో తన అలంకారాలన్నింటినీ వదిలేసి, భూలోకం వెళ్లి అక్కడ తనకు నచ్చిన ఒక కొండమీద గల ప్రశాంతమైన వాతావరణంలో తపస్సులో మునిగిపోయాడు. కైలాసంలో కుమారుని జాడ తెలియక పార్వతీదేవి బెంగపడుతుంది. పరమేశ్వరుడు పత్నిని ఊరడించి, ఆమెను వెంటబెట్టుకుని కొడుకుని వెతుకుతూ భూలోకానికి పయనమవుతాడు. ఇద్దరూ కలసి వెతుకుతుండగా, తమిళనాడులోని తిరు ఆవినంకుడి అనే ప్రదేశంవద్దకు రాగానే కొండశిఖరం బంగారు కాంతులతో మెరుస్తూ కనపడటంతో తమ కుమారుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుంటారు. తపోదీక్షలో ఉన్న పుత్రుని చేరదీసి, ముద్దాడుతూ, ‘నువ్వే నా జ్ఞానఫలానివిరా బంగారుకొండా’ అంటూ పార్వతీ పరమేశ్వరులు కుమారుని అనుగ్ర హిస్తారు. తల్లిదండ్రుల ఊరడింపుతో కుమారస్వామి అలకమానతాడు కానీ, ఆ ప్రదేశం తనకు ఎంతో నచ్చడంతో తన అంశను అక్కడే వదిలి, తలిదండ్రులతో తిరిగి కైలాసం చేరతాడు. ఇదీ పళని సుబ్రహ్మణ్యేశ్వరుని పురాగాథ. ఆ ప్రదేశమే ప్రస్తుతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు అర్చించే పళని ఆలయం. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురైకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ ప్రకృతి రమణీయకతకు పెట్టింది పేరు. అన్ని విగ్రహాల్లాంటిది కాదు: పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అన్ని విగ్రహాలలా రాతితో మలిచింది కాదు. నవపాషాణాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దినది. ఈ నవ పాషాణాలనే తొమ్మిది విధాలైన మూలికలు అని కొందరంటారు, తొమ్మిది భయంకరమైన విషాలనూ ప్రత్యేకమైన పాళ్లలో కలిపితే అమృతం వంటి ఔషధం తయారవుతుందని, అందుకే దీనిని భోగార్ అనే ముని ఈ విగ్రహాన్ని ప్రత్యేకశ్రద్ధతో మలచాడని క్షేత్రపురాణం చెబుతోంది. ఈ ఆలయం దాదాపు పదహారు గంటలసేపు తెరిచే ఉంటుంది. అందరూ స్వామిని దర్శనం చేసుకునేందుకు వీలుగా గర్భాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ మందిరం క్రీస్తుశకం 7వ శతాబ్దంలో కేరళ రాజు చీమన్ పెరుమాళ్ కట్టించగా, దానిని పాండ్యరాజులు పునరుద్ధరించారు. అద్భుతమైన శిల్పసంపదతో, కేవలం కౌపీనం మాత్రమే కట్టుకుని, చేతిలో శూలాయుధం పట్టుకుని, చూడగానే ఆకట్టుకునే అందమైన విగ్రహంతో కనువిందు చేస్తాడు ఈ దేవసేనాని, దండాయుధ పాణి. కావడి మొక్కులంటే ఇష్టమట ఈస్వామికి. అంటే ఏదయినా ఆపద కలిగినప్పుడు తాము సమర్పించగలిగినదానిని కావిళ్లకొద్దీ సమర్పించుకుంటామని మొక్కుకుని, ఆపద తీరగానే, నియమ నిష్ఠలతో స్వామికి కావిళ్లలో కానుకలు మోసుకుంటూ నృత్యగానాలతో స్వయంగా సమర్పించుకుంటారు భక్తులు. తండ్రి అయిన శివునిలాగే ఈయన కూడా అభిషేక ప్రియుడు. కార్తికమాసంలో అయితే రోజుకు కనీసం 700 మార్లు భ క్తుల అభిషేకాలందుకుంటాడు ఈ స్వామి. వల్లీ, దేవసేన ఆయన భార్యలు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠిరోజున స్వామివారికి కన్నులపండువగా కల్యాణోత్సవం జరుగుతుంది. పర్యాటక స్థలాల పళని పళని చుట్టూ బోలెడన్ని పర్యాటక స్థలాలున్నాయి. తిరునావినంకుడి ఆలయం, ఇదుంబన్ ఆలయం, పదగణపతి ఆలయం, తిరు అవినాకుడి ఆలయం, పెరియ నాయకి అమ్మన్ ఆలయం, పెరియన్ అవుడైయర్ ఆలయం, కన్నడి పెరుమాల్ ఆలయం, పళని కొండలు, పార్వతీదేవికి తల్లిగా పేర్కొనే మరియమ్మన్ ఆలయం, మురుగన్ విగ్రహ శిల్పి భోగర్ సమాధి ఆలయం, కురుంజి అందవార్ ఆలయం, లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఆలయం ముఖ్యమైనవి. అసలు పళని కొండలే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రకృతి అందాలను వీక్షిస్తూ పళని ఆలయాన్ని చేరుకోవాలంటే మెట్లమార్గంలో వెళ్లడం ఉత్తమం. ఎప్పుడు వెళ్లాలి? వాతావరణ పరిస్థితుల రీత్యా పళని వెళ్లేందుకు చలికాలమే అనకూలమని చెప్పాలి. ఎందుకంటే ఎండాకాలంలో విపరీతమైన వేడి ఉంటుంది. వర్షాకాలంలో కొండ ఎక్కడం కొంచెం కష్టమే. అదే చలికాలంలో అయితే హాయిగా వెళ్లవచ్చు. ప్రకృతి అందాలను తనివితీరా తిలకింవచ్చు. పళనిలో ప్రత్యేకమైన కొంగలు బారులు తీరుతాయి. నారాయణ పక్షులు, గోల్డెన్ వడ్రంగి పిట్టలు కనువిందు చేస్తాయి. వాటి కిలకిలరావాలతో మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. చలికాలంలోనే పళనిలో అనేక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో కావడి ఉత్సవం, మార్గశిరశుద్ధ షష్ఠికి జరిగే కల్యాణోత్సవం ఒకటి. వివాహం కానివారు, సంతానం లేనివారు, కుజదోషం ఉన్నవారు, రాహు, కేతు, కుజగ్రహదోషాలు ఉన్నవారు, కాలసర్పదోషం, నాగదోషం వగైరాలతో బాధపడేవారు పళని సుబ్రహ్మణ్యేశ్వరుని సందర్శించుకుని స్వాంతన పొందుతారు. అంతేకాదు, జ్ఞానప్రదాతగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యేశ్వరుని బుద్ధిమాంద్యంతో బాధపడేవారు కన్నులారా సందర్శించుకుని ఆయా బాధలనుంచి విముక్తి పొందుతుంటారు. ఎలా వెళ్లాలంటే..? పళని సుబ్రహ్మణ్యేశ్వరాలయానికి వెళ్లడం సులువే. రైలు, బస్సు, విమాన మార్గాలున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి పళనికి నేరుగా బస్సులు, రైళ్లు ఉన్నాయి. రైలు మార్గం: పొల్లాచ్చి మీదుగా మధురై నుంచి కోయంబత్తూరు వెళ్లే రైలుంది. అలాగే తిరుచెందూరు నుంచి మధురై మీదుగా పళని వెళ్లేందుకు రైలుంది. చెన్నై సెంట్రల్ నుంచి పళని వెళ్లేందుకు ప్రత్యేకంగా రైలుంది. ఎలాగైనా పళని చేరుకుంటే అక్కడి నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గల ఆలయాన్ని చేరుకోవడానికి ఆటోరిక్షాలు, బస్సులు విరివిగా ఉన్నాయి. వాయుమార్గం: పీలమేడు లేదా కోయంబత్తూరు, మధురై వరకు విమానంలో వెళ్తే అక్కడినుంచి పళనికి బస్సులు, రైళ్లు ఉన్నాయి. - డి.వి.ఆర్. భాస్కర్


