ముళ్లున్న చోటే పూలు | Success Story Of Women Farmer Karra Sashikala | Sakshi
Sakshi News home page

ముళ్లున్న చోటే పూలు

Mar 5 2026 5:34 AM | Updated on Mar 5 2026 5:34 AM

Success Story Of Women Farmer Karra Sashikala

కుటుంబం సవ్యంగా సాగుతున్నప్పుడు మధ్యలో అనుకోకుండా ఎదురయ్యే కుదుపులు సమస్యలను సృష్టిస్తాయి. వాటినుంచి బయటపడడంలోనే మన జీవన పోరాటం దాగి ఉంటుంది. నల్గొండ జిల్లా దుగ్గపల్లికి చెందిన కర్ర శశికళ జీవితంలోనూ ఇదే జరిగింది.  రెండు దశాబ్దాల క్రితం భర్త ఆకస్మిక మరణంతో ఆమెను శూన్యం ఆవరించింది. కానీ, సమస్యకు ఎదురొడ్డి తను కష్టాల నుంచి బయటపడటమే కాదు, తన చుట్టూ ఉన్నవారికి ఉపాధి అవకాశాలనూ కల్పించింది. ఈ సందర్భంగా శశికళతో మాట్లాడినప్పుడు ఆమె పంచుకున్న విశేషాలు ఇవి.

‘‘మనం ఒకటి అనుకుంటాం. కానీ, విధి మరొకటి తలుస్తుంది అంటారు. అందుకు నా జీవితమే ఉదాహరణ అనిపిస్తుంది. నాకు పల్లెటూరు, పొలాలు కన్నా పట్టణ జీవితం అంటేనే ఇష్టం ఉండేది. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా పెళ్లయ్యింది. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఇద్దరం మిర్యాలగూడ టౌన్‌లో ఉండేవాళ్లం. మాకు ఒక బాబు. పెళ్లయ్యాక పీజీ, తర్వాత బీఇడీ చేశాను. గవర్నమెంట్‌ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి సమయంలో మా వారు వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో ఊరికి వెళ్లిపోదాం అన్నారు. 

కానీ, పల్లెటూరుకు వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు. దీంతో కొంతమంది స్నేహితులతో కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. అందులో పెద్ద నష్టం. అప్పుల్లో కూరుకుపోయాం. ఇది చాలదన్నట్టు ఆయన ఆరోగ్యం క్షీణించింది. పరీక్షలు చేయిస్తే గుండె సంబంధిత వ్యాధి అని తేలింది. ఆసుపత్రులు, చెకప్‌లు అంటూ తిరుగుతుండగానే ఆయన వెళ్లిపోయారు. పూర్తిగా డిప్రెషన్‌ ఆవరించింది. ఆరునెలలైనా మామూలు మనిషిని కాలేకపోయాను. చనిపోదాం అనుకున్నాను. అలాంటి సమయంలో అమ్మనాన్నలు, తోడబుట్టినవాళ్లు అండగా నిలిచారు.

నచ్చని వ్యవసాయాన్నే ఎంచుకున్నాను..
నా భర్త కల వ్యవసాయం చేయాలని. కానీ, అప్పటికి మాకు ఆస్తి ఎంత ఉందో, అంతకుమించి అప్పు ఉంది. ఏం చేయాలా అనుకుంటున్న సమయంలో గవర్నమెంట్‌ ఉద్యోగం వచ్చింది. ‘ఉన్న ఆస్తులు అమ్మేసి అప్పు తీర్చేసి, ఉద్యోగం చేసుకుంటూ బతుకుదామా..’ అని ఆలోచించాను. కానీ, ఉద్యోగాన్నే వదులుకున్నాను. నా భర్త కల నెరవేరాలంటే వ్యవసాయమే సరైనది అనుకున్నాను. ఆ రంగంలో ఓనమాలు కూడా తెలియవు.

 ప్రతీది నేర్చుకుంటూ, రాణిస్తున్నాను. అగ్రికల్చర్‌ లోను తీసుకొని, వ్యవసాయం మొదలుపెట్టాను. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చడం ఎలా.. అని చాలా ఆలోచించేదాన్ని. మూడు వేల రూపాయలతో వర్మీ కంపోస్ట్‌ ఎరువు తయారుచేసి, బత్తాయి తోటను కాపాడే ప్రయత్నం చేశాను. మంచి రిజల్ట్‌ వచ్చింది. కొద్ది కొద్దిగా అప్పులు తీరుస్తూ వచ్చాను. ఈ రంగంలో ఇంకా ఏమైనా చేయవచ్చా అనే ఆలోచనలు చేసినప్పుడు నర్సరీ నాకు సరైన ఎంపిక అనిపించింది.

నర్సరీ ఆలోచన మేలు చేసింది.. 
నర్సరీలలో మొక్కల పెంపకానికి చేపడుతున్న చాలా మంది ఉత్తమమైన దిగుబడులు సాధిస్తున్నారు. ఆ వైపుగా ఆలోచించాను. నర్సరీ ఏర్పాటు చేసి, చుట్టుపక్కల ఊళ్లలో రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ఉన్న పొలంలోనే నర్సరీ ఏర్పాటు చేశాను. ఈ నర్సరీలో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అన్ని రకాల డెకార్‌కు సంబంధించిన మొక్కలను పెంచుతున్నాను. 

దీంతో పాటు తోటలకు సంబంధించిన మామిడి, బత్తాయి, జామ, నిమ్మ మొక్కలు సైతం ఆర్డర్లపై అందిస్తున్నాను. వీటికి తోడు గోవులను పెంచుతూ, వాటి ఉత్పత్తులను పంటలకు వాడుతున్నాను. కొన్నాళ్లకు మా వారి పేరు మీదుగా శ్రీ సాయి మాధవ గో సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఈ పని నాకు చాలా మెరుగైన ఫలితాలను ఇచ్చింది. మొదట్లో ఊళ్లో అందరూ నా వెనక మాట్లాడుకున్నవారే ఇప్పుడు వ్యవసాయంలో సలహాలు, సూచనలు అడుగుతుంటారు. 

హార్టీ కల్చర్‌ షోలలోనూ పాల్గొంటుంటాను. నర్సరీ, వ్యవసాయానికి ఉపయోగించే ఆర్గానిక్‌ ఉత్పత్తులనూ సప్లై చేస్తుంటాను. ఈ రంగంలో ఉత్తమ మహిళా రైతు అవార్డులూ అందుకున్నాను. మా అబ్బాయిని పై చదువులకోసం విదేశాలకు పంపగలిగాను. మహిళ శక్తి ఆమెకు మొదట తెలియదు. కానీ, తలుచుకుందంటే చేసి చూపగలదు. ఆ ధైర్యం, తెగువ ఆమెలో స్వాభావికంగానే ఉంటాయి’ అని వివరించింది శశికళ. 


ఇన్నేళ్లుగా వ్యవసాయం రంగంలో ఉన్నాను. కానీ, ఇప్పటికీ ప్రతిరోజూ ప్రకృతితో పోరాటమే.  ఎప్పుడే సమస్య వస్తుందో తెలియదు. తెల్లవారకముందే నా పనులు మొదలవుతాయి. ఒకప్పుడు ఎంతమాత్రం ఇష్టం లేని పనే ఇప్పుడు నాకు ప్రాణమైంది. పచ్చని మొక్కలు, గోవులు నా ఆత్మీయ నేస్తాలు అయ్యాయి. ప్రకృతికి ఎంత ఎక్కువగా దగ్గరవ్వగలను.. అనేదే ప్రతీక్షణం ఆలోచిస్తాను. అదే ఈ రోజు నన్ను ఇలా మార్చింది అనుకుంటాను. 
– కర్ర శశికళ, సేంద్రియ వ్యవసాయ రైతు

– నాతి రమేష్, సాక్షి, త్రిపురారం, నల్లగొండ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement