
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా మెప్పించిన బ్యూటీ ఇలియానా. దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు హీరోగా వచ్చిన పోకిరి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతేడాది హిందీ చిత్రాల్లో కనిపించిన ఇలియానా.. ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. అయితే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన పోకిరి భామ.. రెండో బిడ్డ పుట్టాక ఎదురైన అనుభవాలను పంచుకుంది.
అంతకుముందే అమెరికా నటుడు మైఖేల్ డోలన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఇలియానా.. 2023లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది జూలైలో రెండో బిడ్డకు వెల్‌కమ్ చెప్పింది. రెండోసారి ప్రసవం తర్వాత తనకు ఎదురైన ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వివరించింది. మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఆ సమయంలో చాలా కష్టంగా అనిపించిందని వెల్లడించింది.
ఇలియానా మాట్లాడుతూ..' మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒంటరి మహిళగా బిడ్డను ఆరోగ్యంగా కాపాడుకోవాలి. అయితే రెండోసారి కేవలం బిడ్డ కాదు..నాతో పాటు మరో ఇద్దరు చిన్నపిల్లల బాధ్యత నాదే. ఇలాంటి సందర్భాల్లో మనం శారీరకంగా.. మన బలాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో మానసికంగా పూర్తి గందరగోళంగా అనిపించింది. అది చాలా కష్టంగా ఫీలయ్యాను. ఏమి జరగబోతోందో నాకు తెలిసినప్పటికీ.. మానసికంగా ఇది చాలా ఇబ్బందిగా భావించా. అదే సమయంలో ముంబయిని మిస్సయిన బాధ కూడా ఉంది. అక్కడైతే నాకు సాయం చేసేందుకు ఫ్రెండ్స్ ఉండేవారని" తెలిపింది.
కాగా.. ఇలియానా, మైఖేల్ 2023 ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఆమె చివరిసారిగా 2024 చిత్రం దో ఔర్ దో ప్యార్‌లో కనిపించింది. తెలుగులో 2006లో దేవదాస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. చివరిగా 2018లో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కనిపించింది .