ఆనియన్‌ క్వీన్‌ | Woman agripreneur Kalyani Shinde revolutionizes onion storage with IoT | Sakshi
Sakshi News home page

ఆనియన్‌ క్వీన్‌

Dec 23 2025 4:20 AM | Updated on Dec 23 2025 4:20 AM

Woman agripreneur Kalyani Shinde revolutionizes onion storage with IoT

నేడు కిసాన్‌ దివస్‌

వ్యవసాయంలో స్త్రీలు సాధిస్తున్న విజయాలు అందరూ చూస్తున్నవే. అయితే పంట నిల్వలో, వ్యవసాయ పనిముట్లలో ఆవిష్కరణలు చేస్తున్న మహిళలు తక్కువ.
నాసిక్‌లో తండ్రి పండిస్తున్న ఉల్లిపాయ నిల్వ చేస్తే పాడవుతోందని గమనించిన కుమార్తె సొంతగా పరికరాన్ని కనిపెట్టి నిల్వలను కాపాడింది. అంతే కాదు నాసిక్, మహారాష్ట్రల్లో ఉల్లిపాయ గోదాముల నిర్వహణను పూర్తిగా మార్చేసింది. కిసాన్‌ దివస్‌ సందర్భంగా ఈనాటి రైతుబిడ్డ కల్యాణి షిండే పరిచయం.

‘ఉల్లిపాయలు పాడయ్యాయన్న సంగతి చాలా నష్టపోయాకే తెలుస్తుంది’ అంటుంది కల్యాణి షిండే. 26 ఏళ్ల ఈ రైతుబిడ్డ నాసిక్, మహారాష్ట్రలలో ఉల్లిపాయల నిల్వకు విశేషమైన సహకారం అందించే పరికరాన్ని తయారు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చింది. 

‘నాసిక్‌ దగ్గర ఉన్న లాసన్‌గావ్‌ మా ఊరు. అది ఆసియాలోనే అతి పెద్ద ఉల్లిపాయల కేంద్రం. మా తాత తండ్రులు, బంధువులు రైతులే. ఉల్లిపాయలు ప్రధానంగా పండిస్తారు. చిన్నప్పటి నుంచి ఆ పంట చేతికి రావడం మార్కెట్‌ అయ్యేలోపు పాడైతే నష్టం రావడం వింటూనే పెరిగాను. మా ఇళ్లలో నేనే మొదటిసారి బి.టెక్‌కు వచ్చాను. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ చదువుతూ ఇంటికి ఫోన్‌ చేస్తే ఉల్లిపాయలు కుళ్లిపోయి నష్టం వచ్చిందని చెప్పేవారు. దీనిని ఆపలేమా... అని రీసెర్చ్‌లో దిగాను’ అని తెలిపింది ఆమె.

కల్యాణి షిండే రీసెర్చ్‌లో మహారాష్ట్రలోనే కాదు... దేశంలోనే ఉల్లిపాయలకు సరైన గిడ్డంగులు లేవని తెలిసింది. చాలా కేంద్రాల్లో ఓపెన్‌ గోదాముల్లోనే ఉల్లిపాయలను నిల్వ ఉంచుతారు. ఆధునిక గోదాములు ఉన్నవి తక్కువ. ‘ఉల్లిపాయలు పాడయ్యాయని ఎలా తెలుసుకుంటారని రైతులను అడిగితే దుర్వాసన ద్వారా అని చెబుతారు. కాని దుర్వాసన మొదలయ్యే సమయానికి క్వింటాల్‌కు 20 శాతం పాడైపోయి ఉంటాయి. ఉల్లిపాయలకు ఆరడుగుల ఎత్తు అరలో నిల్వ చేస్తే ఎత్తు తగ్గి ఐదు అడుగులకు చేరినా ఉల్లిపాయలు పాడయ్యాయని అర్థం.

 ఈ దశలో 40 శాతం పాడైపోయి ఉంటాయి. మనుషులు దృష్టి, వాసన ద్వారా మాత్రమే ఉల్లిపాయల నిల్వలో నష్టాన్ని తెలుసుకుంటున్నారని నాకు అర్థమైంది. అప్పుడే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇన్నోవేటర్‌లుగా తర్ఫీదు ఇచ్చే ఒక సంస్థ గురించి తెలిసింది. అందులో చేరాను. అలా గాలిలోని ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా గిడ్డంగిలో ఏ వైపున పంట నష్టం మొదలయ్యిందో తెలుసుకునే పరికరం కనిపెట్టాను. దీనివల్ల ఒక శాతం నష్టం ఉండగానే నిల్వను కాపాడుకోవచ్చు’ అని చెప్తుంది కల్యాణి షింగ్‌.

ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్‌ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్‌ మెసేజెస్‌ పంపుతుంది.

 ఈ పరికరాన్ని పదివేల రూపాయలకే తయారు చేసి రైతులకు చేరవేస్తోంది కల్యాణి. అంతేకాదు ఆధునిక గిడ్డంగుల ఏర్పాటులో ప్రయివేటు సంస్థలకు సూచనలు సలహాలు ఇస్తోంది. అందుకే అందురూ ఆమెను ‘ఆనియన్‌ క్వీన్‌’ అని పిలుస్తూ ఉన్నారు. రైతు కోసం రైతు బిడ్డలే కాదు ప్రతి విద్యార్థి, సాంకేతిక నిపుణుడు ఆలోచిస్తే మన దేశం మరింత సస్యశ్యామలం అవుతుంది.


ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్‌ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్‌ మెసేజెస్‌ పంపుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement