
కపస్ కిసాన్ యాప్‌ను తెచ్చిన సీసీఐ
పత్తి అమ్మాలంటే రైతు అందులో స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే
కనీసం వారం ముందే బుక్ చేసుకోవాలంటున్న సీసీఐ
ఈ సీజన్ నుంచే ఈ నిబంధన అమలు
చదువురాని రైతుల పరిస్థితి ఏంటి అనే సందేహాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పత్తి రైతులకు కొత్త చిక్కు వచ్చి పడింది. పండించిన పత్తిని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే ఇకపై ఆన్‌లైన్‌లో ముందుగా స్లాట్ బుక్ చేసు కోవాల్సి ఉంటుంది. అందుకోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ) ‘కపస్ కిసాన్’అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చింది. రైతు తన పత్తి పంటను విక్రయించాలంటే ఈ యాప్‌లో వారం రోజుల ముందే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సీసీఐ అధి కారులు తెలిపారు. స్లాట్‌లో నిర్దేశించిన సమయానికి రైతులు పత్తిని కొనుగోలు కేంద్రానికి తమ పంటను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
రైతులకు ఇబ్బందే..
రాష్ట్రంలో చాలామంది రైతులు ఇప్పటికీ నిరక్షరాస్యులే. అలాంటివారికి యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఇబ్బందే. స్మార్ట్‌ఫోన్లు అందరికీ ఉండవు. పైగా వారం రోజుల ముందు స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన మరింత ఇక్కట్లకు గురి చేయనుంది. స్లాట్‌లో నిర్దేశించిన రోజు ఏ కారణం చేత పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లకపోయినా స్లాట్ రద్దవుతుంది. దీంతో మరో వారం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.
సాధారణంగా రైతులు తమ సమీపంలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకుంటారు. ఈ స్లాట్ విధానంతో దూరప్రాంతాల్లోని కేంద్రాలకు కూడా స్చ్లాట్ కేటాయించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. దీంతో రైతులకు దూరం పెరిగి రవాణా ఖర్చులు కూడా భారంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఈసారి 45.85 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. గతేడాది సుమారు 210.19 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఈ సీజను నుంచి పత్తి కొనుగోలుకు స్లాట్ విధానాన్ని అమలు చేయాలని సీసీఐ నిర్దేశించింది. ఈ విధానంపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ నిబంధనలను తొలగించాలని కోరాం. – రియాజ్, జిల్లా మార్కెటింగ్ అధికారి