breaking news
Onion Store
-
ఆనియన్ క్వీన్
వ్యవసాయంలో స్త్రీలు సాధిస్తున్న విజయాలు అందరూ చూస్తున్నవే. అయితే పంట నిల్వలో, వ్యవసాయ పనిముట్లలో ఆవిష్కరణలు చేస్తున్న మహిళలు తక్కువ.నాసిక్‌లో తండ్రి పండిస్తున్న ఉల్లిపాయ నిల్వ చేస్తే పాడవుతోందని గమనించిన కుమార్తె సొంతగా పరికరాన్ని కనిపెట్టి నిల్వలను కాపాడింది. అంతే కాదు నాసిక్, మహారాష్ట్రల్లో ఉల్లిపాయ గోదాముల నిర్వహణను పూర్తిగా మార్చేసింది. కిసాన్ దివస్ సందర్భంగా ఈనాటి రైతుబిడ్డ కల్యాణి షిండే పరిచయం.‘ఉల్లిపాయలు పాడయ్యాయన్న సంగతి చాలా నష్టపోయాకే తెలుస్తుంది’ అంటుంది కల్యాణి షిండే. 26 ఏళ్ల ఈ రైతుబిడ్డ నాసిక్, మహారాష్ట్రలలో ఉల్లిపాయల నిల్వకు విశేషమైన సహకారం అందించే పరికరాన్ని తయారు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ‘నాసిక్ దగ్గర ఉన్న లాసన్‌గావ్ మా ఊరు. అది ఆసియాలోనే అతి పెద్ద ఉల్లిపాయల కేంద్రం. మా తాత తండ్రులు, బంధువులు రైతులే. ఉల్లిపాయలు ప్రధానంగా పండిస్తారు. చిన్నప్పటి నుంచి ఆ పంట చేతికి రావడం మార్కెట్ అయ్యేలోపు పాడైతే నష్టం రావడం వింటూనే పెరిగాను. మా ఇళ్లలో నేనే మొదటిసారి బి.టెక్కు వచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతూ ఇంటికి ఫోన్ చేస్తే ఉల్లిపాయలు కుళ్లిపోయి నష్టం వచ్చిందని చెప్పేవారు. దీనిని ఆపలేమా... అని రీసెర్చ్‌లో దిగాను’ అని తెలిపింది ఆమె.కల్యాణి షిండే రీసెర్చ్‌లో మహారాష్ట్రలోనే కాదు... దేశంలోనే ఉల్లిపాయలకు సరైన గిడ్డంగులు లేవని తెలిసింది. చాలా కేంద్రాల్లో ఓపెన్ గోదాముల్లోనే ఉల్లిపాయలను నిల్వ ఉంచుతారు. ఆధునిక గోదాములు ఉన్నవి తక్కువ. ‘ఉల్లిపాయలు పాడయ్యాయని ఎలా తెలుసుకుంటారని రైతులను అడిగితే దుర్వాసన ద్వారా అని చెబుతారు. కాని దుర్వాసన మొదలయ్యే సమయానికి క్వింటాల్‌కు 20 శాతం పాడైపోయి ఉంటాయి. ఉల్లిపాయలకు ఆరడుగుల ఎత్తు అరలో నిల్వ చేస్తే ఎత్తు తగ్గి ఐదు అడుగులకు చేరినా ఉల్లిపాయలు పాడయ్యాయని అర్థం. ఈ దశలో 40 శాతం పాడైపోయి ఉంటాయి. మనుషులు దృష్టి, వాసన ద్వారా మాత్రమే ఉల్లిపాయల నిల్వలో నష్టాన్ని తెలుసుకుంటున్నారని నాకు అర్థమైంది. అప్పుడే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్నోవేటర్లుగా తర్ఫీదు ఇచ్చే ఒక సంస్థ గురించి తెలిసింది. అందులో చేరాను. అలా గాలిలోని ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా గిడ్డంగిలో ఏ వైపున పంట నష్టం మొదలయ్యిందో తెలుసుకునే పరికరం కనిపెట్టాను. దీనివల్ల ఒక శాతం నష్టం ఉండగానే నిల్వను కాపాడుకోవచ్చు’ అని చెప్తుంది కల్యాణి షింగ్.ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్ మెసేజెస్ పంపుతుంది. ఈ పరికరాన్ని పదివేల రూపాయలకే తయారు చేసి రైతులకు చేరవేస్తోంది కల్యాణి. అంతేకాదు ఆధునిక గిడ్డంగుల ఏర్పాటులో ప్రయివేటు సంస్థలకు సూచనలు సలహాలు ఇస్తోంది. అందుకే అందురూ ఆమెను ‘ఆనియన్ క్వీన్’ అని పిలుస్తూ ఉన్నారు. రైతు కోసం రైతు బిడ్డలే కాదు ప్రతి విద్యార్థి, సాంకేతిక నిపుణుడు ఆలోచిస్తే మన దేశం మరింత సస్యశ్యామలం అవుతుంది.ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్ మెసేజెస్ పంపుతుంది. -
విజిలెన్స్ దాడులు
గొల్లప్రోలు, న్యూస్‌లైన్ :హోల్‌సేల్ ఉల్లి వ్యాపారులపై విజిలెన్స్, ఎన్ఫోర్సమెంట్ అధికారులు మంగళవారం కొరడా ఝళిపించారు. గొల్లప్రోలులోని ఆరుగురు ఉల్లి ట్రేడర్లపై ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బి.నరసింహులు ఆధ్వర్యంలో రెండు బృందాలు దాడులు చేశాయి. గొల్లప్రోలులోని తాటిపర్తి రోడ్డు, మెయిన్ రోడ్డు, రాయవరం రోడ్డు వద్ద ఉన్న గోడౌన్లలో ఉల్లి నిల్వలను తనిఖీలు చేశారు. స్టాకు రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. క్రయ, విక్రయాలు, పన్ను చెల్లింపు పత్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 42 టన్నులు ఉల్లి నిల్వలను గుర్తించినట్టు ఎస్పీ నరసింహులు తెలిపారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం, లెసైన్స్ లేకుండా వ్యాపారం చేస్తుండడం, మార్కెట్ సెస్ సక్రమంగా చెల్లించకపోవడంతో రూ.8.37 లక్షల విలువైన ఉల్లి అమ్మకాలు తక్షణం నిలిపివేయాలని ఆదేశించామన్నారు. మార్కెట్లో ఉల్లి ధరలను అరికట్టడమే లక్ష్యంగా తొలిసారిగా ఈ దాడులు చేశామన్నారు. ధరలు పెరగడాన్ని అవకాశంగా తీసుకుని హోల్‌సేల్ వ్యాపారులు బహిరంగ మార్కెట్లో ఉల్లిని అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. అక్రమ నిల్వలను గుర్తించేందుకు, అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఈ దాడులు చేశామన్నారు. వ్యాపారులు ఉల్లి కొనుగోలు, విక్రయ ధరల మధ్య తేడాను తగ్గించేందుకు ఈ తనిఖీలు దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ సెస్ రూ.10 వేలు వసూలు చేశారు. తనిఖీల్లో సీఐ చవాన్, ఏఓ జి.శ్రీనివాస్, ఏఎస్సై రాఘవ, మార్కెట్ కమిటీ సూపర్వైజర్లు భాస్కరరావు, జాన్‌బాషా పాల్గొన్నారు. రాజమండ్రిలో.. ఆల్కాట్‌తోట(రాజమండ్రి) : రాజమండ్రిలోని 19 హోల్‌సేల్ ఉల్లి దుకాణాలపై విజిలెన్స అధికారులు దాడి చేశారు. మార్కెటింగ్ శాఖకు ప్రతి నెలా కొనుగోలు రిటర్న్స్ ఇస్తున్నదీ లేనిదీ ఆరా తీశారు. స్టాకు రిజిస్టర్‌కు మించి ఉల్లిపాయలను అదనంగా ఉంచారా అన్న దానిపై సమాచారం సేకరించారు. వ్యాపారులు అదనంగా ఉల్లిపాయలను బ్లాక్ చేయలేదని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో డీసీటీఓ రత్నకుమార్, అటవీ అధికారి వల్లి, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.


