రంగుల లోకపు రాణులు | M Annapurna Journey from Artist to Curator, Sakshi Special Story | Sakshi
Sakshi News home page

రంగుల లోకపు రాణులు

Mar 5 2026 6:14 AM | Updated on Mar 5 2026 6:14 AM

M Annapurna Journey from Artist to Curator, Sakshi Special Story

భారతీయ కళా ప్రపంచంలో ప్రత్యేకంగా కనిపించే, విస్తృతంగా గుర్తింపు పొందిన లక్షణం ఏమిటంటే అత్యంత ప్రభావవంతమైన గ్యాలరీ నిర్వాహకులు, క్యురేటర్లు, కళా పరిరక్షకులలో అనేకమంది మహిళలే కావడం! 

భారతదేశంలోని అనేక రంగాలు ఇప్పటికీ పురుషాధిక్యంగా ఉన్నప్పటికీ, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాల్లోని సమకాలీన కళా వేదికలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నా సమానత్వానికి ప్రతీకలుగా నిలుస్తూ ఈ వేదికలను మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. 

కళకు నా పరిచయం అమృతా షేర్‌–గిల్‌ చిత్రాలతో చిన్నప్పుడే మొదలైంది. కాలక్రమేణా ఆమె గురించి నా అవగాహన మారింది. విద్యార్థిగా ఆమెను ఆధునిక భారతీయ చిత్రకళలో మార్గదర్శిగా చూశాను. కానీ క్యురేటర్‌గా చూస్తే, ఆమె మన దృక్కోణాన్ని మార్చిన వ్యక్తి. భారతీయ మహిళలకు ఒక అంతరంగాన్ని, సజీవమైన ఉనికిని ఇచ్చిన కళాకారిణి. ఆ మార్పు నేను చిత్రకళను అర్థం చేసుకునే విధానాన్ని ప్రభావితం చేసింది. అక్కడి నుంచి ఈ పరంపర విస్తరిస్తోంది.

స్త్రీ వాదం... జీవన పోరాటం
మాటలకందని భావాలను, సమాజంలో జరుగుతున్న విషయాలను, రాజకీయ పరిణామాలను తనదైన శైలిలో చిత్రీకరిస్తారు అర్పితాసింగ్‌. నళిని మలాని పౌరాణిక కథలను, చరిత్రను, హింసను, స్త్రీవాద సమస్యలను, జీవన పోరాటాలను ‘న్యూ–మీడియా‘ ద్వారా చూపిన తొలి కళాకారిణి. మృణాలిని ముఖర్జీ సాధారణమైన అల్లిక పద్ధతికి కొత్త కోణాన్ని జోడించి వాటితో ఫైబర్‌ శిల్పాలను సృష్టించి, తన కళాఖండాలకు విభిన్నమైన స్థాయిని కల్పించారు. 
ఛాయాచిత్రాల ద్వారా గత స్మృతులు కవితాత్మకంగా ఉండవచ్చని, సేకరణ పద్ధతి కూడా స్వయంగా ఒక కళారూపమని షీబా ఛాచ్ఛి మనకు తెలియజేశారు.

కళాసేవకులు
నేను క్యురేటోరియల్‌ విభాగంలోకి అడుగుపెట్టిన తరువాతే మహిళలు కేవలం కళాఖండాలను మాత్రమే కాదు, కళా వ్యవస్థలనే మలిచారని నాకు అర్థమైంది. ‘ఖోజ్‌’ అనే ఒక కళా–సేవా సంస్థను, వస్తువులు అమ్మే అంగడిలా కాక – సంభాషణ, ప్రయోగాల వేదికగా, వర్ధమాన కళాకారుల మేలు కోసం పూజ సూద్‌ మరికొంతమందితో కలిసి స్థాపించారు. వస్త్రాలు, వస్తుసంస్కృతిపై అన్నపూర్ణ గరిమెళ్ల చేసిన పరిశోధన చిత్రకళకూ హస్తకళలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, హెచ్చుతగ్గులనూ తొలగించడంలో కీలకంగా మారింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళా కళాకారులు, కేవలం కళా సృష్టిలోలోనే కాదు, బోధనలో, సంస్థల నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు, స్వాతంత్య్ర సమరంతో పాటు సాంస్కృతిక రంగంలో కృషి చేసిన సంగం లక్ష్మీబాయి నుంచి ఆంధ్ర ఆధునిక చిత్రకళలో తనదైన శైలి చాటుకున్న దామెర్ల సత్యవాణి వరకు తరతరాల కళాకారులను తీర్చిదిద్దిన కవితా దేవుస్కర్, అంజని రెడ్డివంటి వారి నుంచి నిశ్శబ్దంగా ‘సంస్కృతి స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌’ను లాభాపేక్షలేని వేదికగా నిలబెడుతున్న ‘ప్రింట్‌ మేకర్‌’ పద్మారెడ్డి వరకు, జేఎన్‌ ఏఎఫ్‌ఏయూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడిన నిర్మల బిలుకా నుంచి, విద్యావేత్తగా నిబద్ధతతో పనిచేస్తున్న ప్రీతి సంయుక్త వరకు, వీరందరి కృషి ఎంతోమంది చిత్రకళా విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దారు. అలాగే, గౌరి వేముల, ప్రియాంక ఏలే వంటి కళాకారిణులు హైదరాబాద్‌ చిత్రకళా స్వరాన్ని జాతీయ వేదికలపై వినిపించారు.

మహిళగా ఎన్నో సవాళ్లు
ఎదుగుతున్న మహిళా గ్యాలరిస్ట్‌గా నాకు సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నమ్మకాన్ని కాపాడుకోవడం, నిధులు సమకూర్చడం, సారూప్య భావనలు కలవారితో చర్చలు జరపడం,  అందరికీ పరస్పరం ఉపయోగపడే వ్యవస్థను అలుపెరుగక నిర్మించడం లాంటివి. భారతీయ చిత్రకళలో మహిళలు చూపిన దారులు మనకెంతో ధైర్యాన్నిస్తాయి. వసతులపై ఆధారపడకుండానే వారు సంస్థలను నిర్మించారు. అంగడి లేకుండానే వ్యవస్థను సృష్టించారు. సాంస్కృతిక వేదికలు పట్టుదలతో, సహకారంతో నిర్మితమవుతాయని తెలుసుకున్నాను. 

్రపాంతీయతతో ముడిపడిన దళిత, ఆదివాసీ మహిళల స్వరాల వైవిధ్యం నన్ను ఎప్పటికీ ఉత్తేజ పరుస్తుంది. ఈ మహిళా కళాకారులు ప్రకృతి, జ్ఞాపకాలు, శ్రమ  ఆధారంగా సమకాలీన భారతీయ చిత్ర–హస్తకళలను పునర్నిర్మిస్తున్నారు. వారి శైలికి తగ్గట్టు, నిదానంగానూ, సహకారాత్మకంగానూ పనిచేసే క్యురేటోరియల్‌ విధానాలను కోరుకుంటారు; జ్ఞానమనేది కేవలం సంస్థలకే పరిమితం కాదని, వాటి బయట కూడా ఎంతో విజ్ఞానం ఉందని గుర్తుచేస్తున్నారు.

ఆ పునాది పైనే!
శాంతి స్వరూపిణి (శిల్పి) వరుణికా సరాఫ్‌ వంటి కళాకారులెందరో జాతీయ కళా వేదికపై తమదైన ముద్ర వేశారు. వీరందరి సమష్టికృషి, ఓర్పుతో, నిర్మితమైన పునాది పైనే మనమందరం నిలబడ్డాం. వీరు ‘బోధన, సృజన, సంస్థ నిర్మాణం’ అనే మూడు రంగాలపై దృష్టి సారించారు. తాత ముత్తాతల నుండి వచ్చిన స్మృతులు, కథల ద్వారా తెలుసుకున్న విషయాలను కళా రంగంలోకి వీరు తీసుకువచ్చారు. వారు పాటించిన పద్ధతులను పరిశోధించడం వలన నా ఆలోచనా విధానం కూడా ప్రభావితమయ్యింది. ప్రదర్శనలు కేవలం యాంత్రికంగా జరిగేవి కావు! అవి పరిశోధనతోనూ, బోధనతోనూ, ప్రజలతోనూ అనుసంధానాన్ని కలిగిన ప్రక్రియలు. ఆ ప్రదేశంలోకి ఎవరు వస్తున్నారు? మనం ఏ భాషలో మాట్లాడుతున్నాం? మొదటిసారి చూసే వారికి ఇది ‘తమదే’ అన్న భావన ఎలా కలిగించాలి? ఈ ప్రశ్నలే మహిళల నేతృత్వంలోని సాంస్కృతిక కృషిలో ముఖ్యమైనవి. 
– అన్నపూర్ణ ఎం.ఇండిపెండెంట్‌ ఆర్ట్‌ క్యూరేటర్, ఆర్టిస్ట్, 
ఫౌండర్, డైరెక్టర్‌– ఏక్‌చిత్రా ఆర్ట్‌గ్యాలరీ, హైదరాబాద్‌ ఆర్ట్‌ షో, కో–ఫౌండర్‌

ఆ సంభాషణలే నా తొలి జ్ఞాపకం
గ్యాలరీలోకి అడుగుపెట్టక ముందే చిత్రకళ గురించిన కథలు వింటూ పెరిగాను. మా నాన్నగారు ఎర్రమిల్లి రోహిణీ కుమార్‌ గారు చిత్రకారులవటం చేత, ఆయనకు తెలిసిన చిత్రకారుల గురించి మాట్లాడినప్పుడు, దగ్గరి బంధువుల గురించి చెప్తున్నారేమో అని అనిపించేది. రావాల్సినంత గుర్తింపు రాకపోయినా, సృజనాత్మక వేదికలను నిలబెట్టిన మహిళల గురించి నేను విన్న ఆ సంభాషణలే నా తొలి జ్ఞాపకం. వారు కేవలం చిత్రాలను గీయడంతో ఆగలేదు, శిల్పాలు మాత్రమే చెక్కి ఊరుకోలేదు. కళను ఎలా పరిశీలించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నలకు కార్యరూపం ఇచ్చారు. 

ఇప్పుడు నేనొక క్యురేటర్‌గా, ఎదుగుతున్న గ్యాలరిస్ట్‌గా వాటి గురించి ఆలోచిస్తుంటాను. భారతీయ కళలలో మహిళల పాత్ర అనేది కొత్తగా చేర్చాల్సిన విషయం కాదు, అది ఎప్పటినుంచో అంతర్లీనంగా ఉన్నదే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement