గౌతమ్‌ గంభీర్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పిచ్‌ క్యూరేటర్‌.. తనదైన శైలిలో ఫైరైన టీమిండియా హెడ్‌ కోచ్‌ | ENG VS IND 5TH TEST: HEATED ARGUMENT BETWEEN GAUTAM GAMBHIR AND OVAL STADIUM PITCH CURATOR | Sakshi
Sakshi News home page

ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో.. ఓవల్‌ పిచ్‌ క్యూరేటర్‌పై ఫైరైన గంభీర్‌

Jul 29 2025 4:19 PM | Updated on Jul 29 2025 5:30 PM

ENG VS IND 5TH TEST: HEATED ARGUMENT BETWEEN GAUTAM GAMBHIR AND OVAL STADIUM PITCH CURATOR

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్ట్‌కు వేదికైన కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో ఇవాళ (జులై 29) ఘర్షనాత్మక వాతావరణం​ చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పిచ్‌ క్యూరేటర్‌ లీ ఫోర్టిస్‌పై టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు సమాచారం. 

ఫోర్టిస్‌పై గంభీర్‌ ఫైరవడానికి గల అసలు కారణాలు తెలియనప్పటికీ.. పిచ్‌ ప్రిపరేషన్‌ విషయంలో వాగ్వాదం తలెత్తినట్లు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్న వీడియోల ద్వారా తెలుస్తుంది.

పిచ్‌పై అతిగా పచ్చిక అమర్చడాన్ని గంభీర్‌ వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ విషయమై గంభీర్‌ ఫోర్టిస్‌ను సంప్రదించగా తలబిరుసుగా సమాధానం చెప్పాడట. 

దీంతో చిర్రెత్తిపోయిన గంభీర్‌ ఫోర్టిస్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడని సమాచారం. ఓ దశలో ఫోర్టిస్‌ గంభీర్‌పై ఫిర్యాదుకు ధమ్కీ ఇచ్చాడని.. ఇందుకు ప్రతిగా గంభీర్‌ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అని అన్నాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.

గంభీర్‌ ఫోర్టిస్‌పై ఫైరవుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. వీడెవడో పోయి పోయి గంభీర్‌తో పెట్టుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

గంభీర్‌ ముక్కోపి అన్న విషయం తెలిసిందే. అతనికి కోపం వస్తే తనా మనా అని చూడడు. ఇది గతంలో చాలా సందర్భాల్లో చూశాం. 2024 ఐపీఎల్‌ సందర్భంగా గంభీర్‌ విరాట్‌ కోహ్లి లాంటి దిగ్గజ ఆటగాడిని కూడా వదిలిపెట్టలేదు.

కాగా, భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్ట్‌ కోసం ఓవల్‌ మైదానంలో దట్టమైన పచ్చికతో పిచ్‌ను తయారు చేసినట్లు తెలుస్తుంది. దీని వల్ల ఇంగ్లండ్‌ పేసర్లకు అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఇందుకే గంభీర్‌ క్యూరేటర్‌తో గొడవ పడి ఉండవచ్చు.

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో మొదటి, మూడు టెస్ట్‌లు ఇంగ్లండ్‌ గెలువగా.. భారత్‌ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది. తాజాగా జరిగిన నాలుగో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. 

ఆ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్‌ గెలుపును అడ్డుకున్నారు. జులై 31 నుంచి ఐదో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే సిరీస్‌ సమం అవుతుంది. ఇంగ్లండ్‌ గెలిచినా లేదా డ్రా అయినా సిరీస్‌ వారి వశమే అవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement