టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఏకీపారేస్తుంటే.. కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు, తిరువనతంపురం ఎంపీ శశిథరూర్ మాత్రం ప్రశంసలు కురిపించారు. దేశంలో రెండో కష్టతర కొలువు చేస్తూ కూడా గంభీర్ ఎంతో నిబ్బరంగా ఉన్నారంటూ కితాబిచ్చారు. నాగ్‌పూర్‌లో బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టి20 మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతకుముందుకు గంభీర్‌తో ఆయన భేటీ అయ్యారు. దీని గురించి 'ఎక్స్'లో పోస్ట్ చేసి, తమ ఫొటోను షేర్ చేశారు.
''నాగ్‌పూర్‌లో నా పాత స్నేహితుడు గౌతమ్ గంభీర్‌తో జరిగిన చర్చను ఆస్వాదించాను. ప్రధానమంత్రి తర్వాత భారతదేశంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆయనే! ప్రతిరోజూ లక్షలాది మంది తనను విమర్శిస్తున్నా ప్రశాంతంగా పనిచేసుకుపోతూ, ధైర్యంగా ముందుకెళుతున్నారు. గంభీర్ నిశ్శబ్ద సంకల్పం, సమర్థ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాను. ఈరోజు నుండి ఆయనకు అన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నాన''ని ఎక్స్‌లో రాసుకొచ్చారు. శశిథరూర్ ట్వీట్‌కు ధన్యవాదాలు అంటూ గంభీర్ సమాధానం ఇచ్చారు.
కివీస్ రన్స్ కంటే నా సెల్పీలే ఎక్కువ
తన నాగ్‌పూర్‌లో పర్యటనలో భాగంగా ఆంత్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్(ఈవో) నిర్వహించిన కార్యక్రమంలో శశిథరూర్ పాల్గొన్నారు. బుధవారం రాత్రి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ టి20 మ్యాచ్‌ను ఆయన వీక్షించారు. క్రికెట్ ప్రేమికుల కోలాహలం నడుమ మ్యాచ్ చూడడం ఎంతో బాగుందని పేర్కొంటూ.. తన ఫొటోలను 'ఎక్స్'లో షేర్ చేశారు. టీమిండియా-కివీస్ మ్యాచ్ చూడడంతో తన నాగ్‌పూర్ పర్యటన పూర్తయిందన్నారు. న్యూజిలాండ్ చేసిన పరుగుల కంటే తాను ఎక్కువ సెల్ఫీలు ఇచ్చానని చమత్కరించారు. టీమిండియా (Team India) విజయాన్ని పూర్తిగా ఆస్వాదించానని పేర్కొన్నారు.
చదవండి: బెంగళూరు ఎన్నికలు.. రంగంలోకి బీజేపీ కీలక నేత
కాగా, శశిథరూర్ కొంతకాలంగా సొంత పార్టీతో అంటిముట్టన్నట్టుగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించి హస్తం పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టారు. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ అయిన గంభీర్‌ను కలవడంతో పాటు ఆయనను పొడగ్తలతో ముంచెత్తారు. గంభీర్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాతే టీమిండియా ఎన్నడూ చవిచూడని పరాజయాలు పొందిందని అందరూ విమర్శిస్తుంటే.. థరూర్ మాత్రం ఆయనను వెనుకేసుకురావడం గమనార్హం. వీరిద్దరి భేటీపై కాంగ్రెస్ నాయకులు ఇంకా స్పందించలేదు.
In Nagpur, enjoyed a good &frank discussion with my old friend @GautamGambhir, the man with the hardest job in India after the PM’s! He is being second-guessed by millions daily but stays calm &walks on undaunted. A word of appreciation for his quiet determination and able… pic.twitter.com/LOHPygVV0E
— Shashi Tharoor (@ShashiTharoor) January 21, 2026


