మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కాషాయ పార్టీ ఇప్పుడు కర్ణాటకపై గురి పెట్టింది. దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో 28 ఏళ్ల శివసేన ఆధిపత్యానికి ముగింపు పలికిన కమలం పార్టీ బెంగళూరులోనూ పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. మరో నాలుగైదు నెలల్లో జరగనున్న స్థానిక ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు కీలక నేతలకు బెంగళూరు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది.
బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జిగా నియమించింది. రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీశ్ పూనియా, (Satish Poonia) మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయ్‌లను సహ-ఇంచార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తూ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటనను జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యాలయం ఇంచార్జి అర్జున్ సింగ్ మంగళవారం విడుదల చేశారు.
అసెంబ్లీ సమరం లాంటిదే..
గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జిగా తనను నియమించినందుకు నితిన్ నబీన్‌కు 'ఎక్స్'లో రాంమాధవ్ ధన్యవాదాలు తెలిపారు. మే నెలలో జరగనున్న బృహద్ బెంగళూరు మహానగర్ పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. 90 లక్షల ఓటర్లు, 369 వార్డులు ఉన్న బీబీఎంపీ ఎన్నికలు.. అసెంబ్లీ సమరం కంటే తక్కువేమీ కాదన్నారు. కర్ణాటక బీజేపీ నాయకులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, బెంగళూరు నగర నేతలు, కార్యకర్తలతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు.
ఎన్నికలకు సిద్ధం: సీఎం
బెంగళూరు కార్పొరేషన్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంతకుముందే ప్రకటించారు. జూన్ 30లోపు బీబీఎంపీ ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తమదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ-జేడీఎస్ పొత్తు గురించి తమకు బెంగలేదని సిద్ధరామయ్య, శివకుమార్ అన్నారు.


