సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళపతిగా బాధ్యతలు చేపట్టిన నలభై ఐదేళ్ల నితిన్ నిబీన్‌కు తొలి అడుగులే అగ్నిపరీక్షగా నిలవనున్నాయి. కొద్ది నెలల్లో జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల రూపంలో ఆయన తక్షణ సవాలు ఎదురుకానుంది. ముఖ్యంగా బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగాల్‌లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణముల్‌కు ఎదురొడ్డి పార్టీని అధికారంలోకి తేవడం కత్తిమీద సామే కానుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించే ప్రణాళిక ఏ మేరకు ఫలించేదీ తమిళనాడు, కేరళ ఎన్నికలు తేల్చనున్నాయి. వీటికి తోడు పార్టీపరమైన సమన్వయం, ఎన్డీఏ భాగస్వాములు, ఇతర మిత్రపక్షాలతో సమన్వయం, పంచాయతీ నుంచి పార్లమెంట్ స్థాయి దాకా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది.
ఆ మూడు రాష్ట్రాలే అసలు సవాలు
కొద్ది నెలల్లో జరగనున్న బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు నబీన్‌కు అత్యంత కీలకం కానున్నాయి. వాటిలో బెంగాల్‌ను బీజేపీ అత్యంత సీరియస్‌గా తీసుకుంటోంది. పదిహేనేళ్లుగా అప్రతిహాతంగా సాగుతున్న తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అధికారానికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లకు గాను మమత పార్టీకి 223, బీజేపీకి కేవలం 65 సీట్లున్నాయి. ఈ పరిస్థితుల్లో 150 సీట్ల మెజారిటీ మార్కును చేరుకోవడం బీజేపీకి గట్టి సవాలేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బెంగాల్లో బీజేపీ గ్రాఫ్ దిగజారింది. 2019లో 18 సీట్లు నెగ్గగా పోయినసారి ఆరింటిని కోల్పోయి 12 స్థానాలతో సరిపెట్టుకుంది. తృణముల్ ఎంపీ స్థానాలు 22 నుంచి 27 స్థానాలకు పెరిగాయి. కోల్‌కతాతో పాటు చాలా నగర ప్రాంతాల్లో బిహారీ వలసదారులు ఎక్కువ. కనుక అటు నుంచే నరుక్కు రావాలన్నది నబిన్ యోచన. జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు తదితరాలపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు తృణమూల్‌కు బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచే, గ్రామీణ ఓటర్లతో బీజేపీకి అనుబంధం పెంచే చర్యలపై కొత్త అధ్యక్షుడు దృష్టి పెట్టే అవకాశముంది. ప్రజల్లో గుర్తింపున్న నేతలకే టికెట్లని నబీన్ ఇప్పటికే శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.
తమిళనాట...
ఇక దక్షిణాదిలో కీలకమైన తమిళనాడులో ఈసారైనా పట్టు సాధించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. డీఎంకే ప్రభుత్వ అవినీతి, విద్య, ఉద్యోగ రంగాల్లో వైఫల్యాలు, వాగ్దానాల అమలులో వైఫల్యాల వంటి అంశాల్లో ప్రజల్లోకి వెళ్లేలా కొత్త అధ్యక్షుడు ప్రణాళిక రచించారు. రాష్ట్రంలో సొంతంగా విజయం సాధించే పరిస్థితులు లేనందున అన్నాడీఎంకేతో (AIDMK) పొత్తు, ఇతర చిన్న పార్టీల మద్దతు ద్వారా ఓటు బ్యాంకును విస్తరించాలని భావిస్తున్నారు. ఓబీసీ, దళిత వర్గాలతో పాటు యువత, మహిళలను ఆకర్షించేలా కార్యక్రమాల నిర్వహణ, బూత్ స్థాయిలో బలహీనంగా ఉన్న కేడర్‌ను బలోపేతం చేయడం, స్థానిక భాషలో సోషల్ మీడియా ప్రచారానికి ప్రాధాన్యతపై నబీన్ ఫోకస్ చేసే అవకాశముంది.
234 అసెంబ్లీ స్థానాలకు గాను పార్టీ గెలవగలిగే అవకాశామున్న 65 స్థానాలను ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తోంది. ఎన్నికల పొత్తు దిశగా అన్నాడీఎంకేతో వారంలో చర్చలు మొదలవనున్నాయి. కేరళలో బీజేపీ ఇప్పటికే ‘మిషన్–2026’పేరుతో భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లకు దీటుగా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా దూకుడు పెంచింది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో సాధించిన చరిత్రాత్మక విజయం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అక్కడ 45 ఏళ్ల తర్వాత ఎల్‌ల్‌డీఎఫ్‌కు కమలం పార్టీ చెక్ పెట్టడం తెలిసిందే. ఈ విజయాన్ని అసెంబ్లీ ఎన్నికలకు పునాదిగా మార్చుకోవాలని చూస్తోంది.
చదవండి: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, కార్యకర్తల శిక్షణ, ముందస్తుగా అభ్యర్థుల ఎంపిక వంటివి మొదలయ్యాయి. గ్రామాల నుంచి నగరాల దాకా ఓటర్లను నేరుగా కలిసే ప్రచారానికి ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర నేతలకు కొత్త అధ్యక్షుడు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అయితే కేరళలో దశాబ్దాలుగా బలంగా ఉన్న వామపక్ష రాజకీయాలు, జాతీయ పార్టీల పట్ల సంప్రదాయ వ్యతిరేకత బీజేపీకి పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో తొలిసారి ఓటేసే నవ యువతను తమ వైపు తిప్పుకోవడంతో పాటు కీలకమైన విద్య, ఉద్యోగాలపై ప్రచారం చేయాలన్నది కొత్త అధ్యక్షుని వ్యూహమని బీజేపీ నేతలు చెబుతున్నారు.


