నీ లక్ష్యం ఏమిటి?.. హార్దిక్‌తో గంభీర్‌.. వీడియో వైరల్‌ | Power, Punchlines And Sixes, Gautam Gambhir And Hardik Pandya Conversation At Practice Session Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

నీ లక్ష్యం ఏమిటి?.. హార్దిక్‌తో గంభీర్‌.. వీడియో వైరల్‌

Jan 20 2026 3:59 PM | Updated on Jan 20 2026 4:13 PM

Kahan Aim Kar Rahe Ho: Gambhir Asks Hardik Pandya Video Viral

సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. టీ20లలోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు సన్నాహకంగా కివీస్‌తో జరిగే ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే సూర్యకుమార్‌ సేన ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టేసింది.

హార్దిక్‌ పాండ్యా రీఎంట్రీ
హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) మార్గదర్శనంలో టీమిండియా స్టార్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఇక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా చాన్నాళ్ల తర్వాత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) పునరాగమనం చేయనున్నాడు. ఆసియా టీ20 కప్‌-2025 మ్యాచ్‌లో గాయపడ్డ అతడు అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.

అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో సొంత జట్టు బరోడా తరఫున బరిలోకి దిగిన హార్దిక్‌.. మంచి ఫామ్‌లో ఉన్నాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌, ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ ఇదే జోరు కనబరచాలని భావిస్తున్నాడు.

 ఎక్కడికి ఎక్కుపెట్టావు?
ఇందుకు తగ్గట్లుగానే ప్రాక్టీస్‌ సెషన్‌లో బంతితో, బ్యాట్‌తో హార్దిక్‌ పాండ్యా చెలరేగిపోయాడు. ముఖ్యంగా గంభీర్‌ చూస్తుండగా భారీ షాట్లతో దుమ్ములేపిన ఈ ఆల్‌రౌండర్‌.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా గంభీర్‌- హార్దిక్‌ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.

పవర్‌ఫుల్‌ హిట్టింగ్‌తో షాట్లు బాదే క్రమంలో హార్దిక్‌ పాండ్యా తనకు ఎదురుగా ఉన్న వారిని పక్కకు జరగమని చెప్పాడు. ఇందుకు నవ్వుతూ బదులిచ్చిన గంభీర్‌.. ‘‘నువ్వు ఎక్కడికి బంతిని తరలించబోతున్నావు.. నీ లక్ష్యం ఏమిటి?’’ అని అడిగాడు. 

ఇందుకు హార్దిక్‌.. ‘‘మొదటి టైర్‌లోకి’’ అని బదులిచ్చాడు. ఇంతలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘‘అన్నీ సెకండ్‌ టైర్‌లోకే కొడుతున్నాడు’’ అంటూ నవ్వులు చిందించాడు.

 బుమ్రా కూడా
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యాతో పాటు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా కివీస్‌తో టీ20 సిరీస్‌తో తిరిగి టీమిండియాతో చేరాడు. 

కాగా జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. అనంతరం ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్‌-2026 జరుగనుంది. ఇందుకు భారత్‌- శ్రీలంక వేదికలు.

చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement