చాన్నాళ్లుగా టీమిండియా తరఫున వన్డేలకే పరిమితమయ్యాడు శ్రేయస్ అయ్యర్. దేశవాళీ టీ20 టోర్నీలో పరుగుల వరద పారించినా.. జట్టులో ఇప్పటికే పాతుకుపోయిన ఆటగాళ్ల కారణంగా అతడికి భారత టీ20 జట్టులో స్థానం కరువైంది.
అయితే, తిలక్ వర్మ గాయం కారణంగా అనూహ్య రీతిలో ఇటీవలే శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో పునరాగమనం చేసే అవకాశం దక్కించుకున్నాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma)గాయపడిన విషయం తెలిసిందే.
శస్త్రచికిత్స విజయవంతం
పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడికి టెస్టిక్యులర్ టార్షన్ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం ధ్రువీకరించింది.
వేగంగా కోలుకుంటున్న తిలక్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్ వర్మ దూరమయ్యాడని బోర్డు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ హైదరాబాదీ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం తిలక్ వర్మ వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం.
బరిలోకి దిగేందుకు సై
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. తిలక్ వర్మకు నొప్పి నుంచి విముక్తి లభించింది. ఇప్పటికే అతడు ఫిజికల్ ట్రెయినింగ్ మొదలుపెట్టాడు. ఫిట్‌నెస్ పరీక్ష కోసం అతడు మంగళవారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కి చేరుకుంటాడు.
ఒకవేళ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే కివీస్‌తో నాలుగో టీ20 (జనవరి 28)కి తిలక్ వర్మ అందుబాటులోకి వస్తాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ స్థానం గల్లంతు కావడం ఖాయం. అదే విధంగా.. తిలక్ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్-2026లో ఆడాలన్న ఈ ముంబైకర్ ఆశలపై కూడా నీళ్లు చల్లినట్లు అవుతుంది.
కాగా గత రెండేళ్లుగా భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన తిలక్ వర్మ.. ఆసియా కప్-2025 ఫైనల్లో జట్టును గెలిపించి ప్రశంసలు అందుకున్నాడు.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (తొలి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయి.


