భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలనాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల విషయంలో పెను మార్పులు చేయాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్టులో నాలుగు కేటగిరీలు ఉన్న విషయం తెలిసిందే. A+, A, B, C అనే గ్రేడ్‌లు ఉన్నాయి. చివరగా గతేడాదికి గానూ ఏప్రిల్‌లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. దీని ప్రకారం..
రూ. 7 కోట్ల వార్షిక వేతనం
A+ గ్రేడ్‌లో బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ప్రధాన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఉన్నారు. వీరికి రూ. 7 కోట్ల వార్షిక వేతనం లభిస్తుంది.
వీరికి ఐదు.. వారికి మూడు
ఇక A గ్రేడ్‌లో ఉన్న రిషభ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాలు రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నారు. అదే విధంగా.. B గ్రేడ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్‌లకు రూ. 3 కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది.
వీళ్లందరికి కోటి
ఇక C గ్రేడ్‌లో ఉన్న రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలకు రూ. కోటి వేతనం అందుతోంది.
A+ గ్రేడ్‌ను ఎత్తివేసే యోచన
తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది వార్షిక క్రాంటాక్టుల విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. A+ గ్రేడ్‌ను ఎత్తివేసి.. A, B, C అనే మూడు గ్రేడ్‌లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, వార్షిక వేతనం విషయంలోనూ ఈ మార్పులు వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.
రో-కోకు భారీ షాక్
తదుపరి అపెక్స్ మీటింగ్‌లో ఈ విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అగార్కర్ అండ్ కో ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపితే.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు భారీ షాక్ తప్పదు. ప్రస్తుతం వీరిద్దరు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి ఈసారి వీరిని B గ్రేడ్‌లోకి వేసే అవకాశం ఉంది.
ఈ నలుగురు అంతే
కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత రో-కోలతో పాటు జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇక గతేడాది రో-కో టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. ప్రధాన పేసర్ బుమ్రా పనిభారం తగ్గించుకునే క్రమంలో పలు కీలక సిరీస్‌లకు దూరమవుతున్నాడు. ఇలా A+ గ్రేడ్‌లో ఉన్న నలుగురు ఆటగాళ్లు గత కొంతకాలంగా జాతీయ విధుల్లో ఏదో ఒక ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.


