న్యూజిలాండ్ చేతిలో మరోసారి టీమిండియాకు భంగపాటు ఎదురైంది. సొంతగడ్డపై కివీస్‌కు తొలిసారి భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా ఓటమికి కారణం అదే
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లలో సరైన ఆరంభాలు లేకపోవమే భారత్ సిరీస్ కోల్పోయేందుకు కారణమని గావస్కర్ అభిప్రాయ పడ్డారు. భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో ఇన్నింగ్స్‌లు ఎలా నిర్మించాలో విరాట్ కోహ్లి (Virat Kohli)ని చూసి సహచరులు నేర్చుకోవాలని సూచించాడు.
‘కోహ్లికి సరైన సహకారం లభించకపోతే లక్ష్య ఛేదన చాలా కష్టమని అర్థమైపోయింది. చివరకు అదే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సిరీస్‌లో మనకు సరైన ఆరంభాలు లభించలేదు. అదే జరిగితే సగం పని సులువయ్యేది.
రాహుల్‌లాంటి బ్యాటర్ అవుటైన తర్వాత నితీశ్ (Nitish Kumar Reddy), హర్షిత్ (Harshit Rana)లాంటి ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శన వస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకే పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది’ అని గావస్కర్ విశ్లేషించారు. సెంచరీతో చివరి వరకు పోరాడిన కోహ్లిపై సన్నీ ప్రశంసలు కురిపించారు.
ఓటమిని అంగీకరించకుండా
‘కోహ్లి ఆలోచనధోరణి, అతని నిలకడను అందరూ అందిపుచ్చుకోవాలి. ఒకే శైలికి కట్టుబడకుండా పరిస్థితులకు తగినట్లుగా కోహ్లి తన ఆటను మార్చుకున్నాడు. చివరి వరకు ఓటమిని అంగీకరించకుండా అతను ప్రయత్నించాడు. ఇది యువ ఆటగాళ్లకు మంచి పాఠం అవుతుంది’ అని దిగ్గజ క్రికెటర్ పేర్కొన్నారు.
చదవండి: భారత్ నెత్తిన మిచెల్ పిడుగు


