టీమిండియాపై చెలరేగిన న్యూజిలాండ్ బ్యాటర్
కీలక ప్రదర్శనతో వన్డే సిరీస్‌ను గెలిపించిన ఘనత
130, 134, 17, 63, 84, 131 నాటౌట్, 137... భారత్‌పై గత 7 వన్డేల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డరైల్ మిచెల్ స్కోర్లు ఇవి. టీమిండియాపై మ్యాచ్ అనగానే చెలరేగిపోయే అతి తక్కువ మంది ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు అతను కూడా చేరాడు. మొత్తంగా భారత్‌పై ఆడిన 11 వన్డే ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా ఏకంగా 74.10 సగటుతో అతను 741 పరుగులు సాధించాడు. ఏబీ డివిలియర్స్ ఒక్కడే భారత్‌లో భారత్‌పై ఇంతకంటే ఎక్కువ (5) సెంచరీలు నమోదు చేయగలిగాడంటే మిచెల్ ప్రదర్శన విలువను చెప్పవచ్చు. ఒంటిచేత్తో అతను తన టీమ్‌కు తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ అందించి కివీస్ హీరోగా మారాడు.
భారత్‌లో భారత్‌పై మిచెల్ చెలరేగిపోవడం వెనక తీవ్ర సాధన, పట్టుదల ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ లీగ్ మ్యాచ్, సెమీఫైనల్‌లలో రెండుసార్లూ వందకు పైగా స్ట్రయిక్ రేట్‌తో అతను శతకాలు బాదాడు. కానీ ఈ రెండు మ్యాచుల్లోనూ టీమిండియా అలవోక విజయాలు సాధించింది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో కూడా లీగ్ మ్యాచ్‌లో విఫలమైన తర్వాత ఫైనల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి అతను హాఫ్ సెంచరీ చేశాడు. అయితే పరిస్థితిని బట్టి బాగా నెమ్మదిగా ఆడిన మిచెల్ మన స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడ్డాడు. తన ఇన్నింగ్స్‌లోని 101 బంతుల్లో అతను 96 బంతులు స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఆడాడు! అయితే నలుగురు భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక 52 పరుగులే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో కూడా కివీస్ ఓడింది.
సిరీస్‌కు సిద్ధమై...
భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు మిచెల్ అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు. ఈసారి తాను వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన కనబర్చడమే కాదు. టీమ్‌ను కూడా గెలిపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. భారత్ తరహాలో నెమ్మదైన పిచ్‌లు ఉండే లింకన్, మౌంట్ మాంగనీలలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురుదాడికి చాలా మంది స్టార్ బ్యాటర్లు వాడే ఆయుధం ‘స్వీప్ షాట్’ను గంటలకొద్దీ ఆడాడు. రివర్స్ స్వీప్‌ల సాధన దీనికి అదనం.
స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే మరో పద్ధతి ముందుకు దూసుకొచ్చి బౌలర్ మీదుగా లాఫ్టెడ్ షాట్ ఆడటం. రాజ్‌కోట్ వన్డేలో ఇది చాలా బాగా కనిపించింది. జడేజా, కుల్దీప్‌లను అతను అలవోకగా ఎదుర్కోవడంతో భారత్ సమస్య పెరిగింది. కుల్దీప్ తొలి ఓవర్లోనే సిక్స్‌తో మొదలు పెట్టిన మిచెల్ ...అతని బౌలింగ్‌లో ఆడిన 32 బంతుల్లో 50 పరుగులు రాబట్టడం విశేషం. కివీస్ ఇంత అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడం దిగ్గజం సునీల్ గావస్కర్‌ను కూడా ఆశ్చర్యపర్చింది. వన్డేల్లో కుల్దీప్ ఒక సిరీస్‌లో ఇంత చెత్త ప్రదర్శన (60.66 సగటు) తొలిసారి నమోదు చేశాడంటే అందుకు మిచెల్ కారణం.
అన్ని ఫార్మాట్‌లలో...
న్యూజిలాండ్ జట్టులో మూడు ఫార్మాట్‌లలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న ఆటగాళ్లలో మిచెల్ కూడా ఒకడు. ఏడాదిన్నర క్రితం భారత్‌పై 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన టెస్టు టీమ్‌లో అతను కూడా ఉన్నాడు. అదే స్ఫూర్తితో తాము వన్డే సిరీస్ కూడా గెలవడం సంతోషానిచి్చందని మిచెల్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్ ఆరంభంలో స్పిన్ ప్రదర్శనను అతను గుర్తు చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో పాటు జూనియర్ స్థాయిలో పెర్త్‌లో ఎక్కువగా క్రికెట్ ఆడిన మిచెల్‌కు స్పిన్ అంటే మొదటి నుంచీ సమస్యే.
ఎప్పుడో 2013లో అండర్–19 జట్టు సభ్యుడిగా భారత్, శ్రీలంక పర్యటలకు వచ్చి ఘోరంగా విఫలమైన అనంతరం అతను మళ్లీ పోటీలోకి వచ్చేందుకు చాలా సమయం పట్టింది. దాదాపు ఏడేళ్ల కెరీర్‌లో ఇప్పటికి 184 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్‌లో ప్రస్తుతం కీలక సభ్యుడిగా ఎదిగిన మిచెల్... ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు, మరో ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక్కడ ఆడటం మాత్రమే కాదు, భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్యలో ఆడిన అనుభవం తన ఆటను రాటుదేలి్చందని చెప్పాడు.
– సాక్షి క్రీడా విభాగం


