నేపాల్ ఎన్నికల ఫలితాలు భారత్‌కు ఎందుకింత కీలకం? | Why India is keeping a close eye on Nepal election results? | Sakshi
Sakshi News home page

నేపాల్ ఎన్నికల ఫలితాలు భారత్‌కు ఎందుకింత కీలకం?

Mar 6 2026 1:50 PM | Updated on Mar 6 2026 2:12 PM

Why India is keeping a close eye on Nepal election results?

న్యూఢిల్లీ: ‘జెన్-జీ’ ఉద్యమంతో గత సంవత్సరం నేపాల్‌లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ తరువాత సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జెన్‌-జీ ఉద్యమం తర్వాత.. నేపాల్‌లో గురువారం జరిగిన ఎన్నికలు ఆ దేశ భవిష్యత్తుకు ఎంతో కీలకం. అలాగే, ఈ ఎన్నికలు భారత్‌కు కూడా కీలకంగా మారాయి. ఎన్నికల ఫలితాలను భారత్‌ నిశితంగా పరిశీలిస్తోంది. భౌగోళికంగా, చరిత్ర, సంస్కృతి, ఆర్థిక పరంగా నేపాల్‌తో భారత్‌కు సత్సంబంధాలు చాలా ముఖ్యం.

జాగ్రత్తగా వ్యవహరించిన భారత్‌
భారత్-నేపాల్ సంబంధాల‍్లో కొన్ని సంవత్సరాలుగా అనేక సంక్లిష్ట పరిస్థితులను చూస్తున్నాం. ముఖ్యంగా 2025లో రాజకీయ పరంగా అశాంతి నెలకొంది. కొన్ని నెలల ముందు నేపాల్‌లో తీవ్ర అస్థిరత చోటుచేసుకుంది. అవినీతి, నిరుద్యోగం, సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నియంత్రణలకు వ్యతిరేకంగా 2025 సెప్టెంబర్‌లో నేపాల్‌ వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది.

నేపాల్‌ ఆర్థికంగా కుదేలవుతుండడం, రాజకీయ వర్గాల్లో బంధుప్రీతి ఉందనే  అంశం యువతలో ఆగ్రహాన్ని పెంచాయి. ఆ అసంతృప్తిని జెన్‌ జీ నిరసనలు ప్రతిబింబించాయి. ఈ ఎన్నికల ముందు నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా నేపాల్‌ పట్ల భారత్ జాగ్రత్తగా దౌత్య విధానాన్ని అనుసరించింది. స్థిర ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాన కార్యక్రమాలను నిలిపివేసింది.

భారత్-నేపాల్ ఉద్రిక్తతలకు కారణాలు 
భారత్-నేపాల్ సంబంధాల్లో పెద్ద సమస్యల్లో ఒకటి కలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలపై సరిహద్దు వివాదం. ఇవి భారత్‌లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగంగా పరిపాలనలో ఉన్నాయి. 2020లో నేపాల్ విడుదల చేసిన రాజకీయ పటంలో ఈ ప్రాంతాలను తన భూభాగంగా చూపింది.

తాజాగా 2025 నవంబర్‌లో లిపులేఖ్, లింపియాధురా, కలాపాని ప్రాంతాలను తన పటంలో చూపించిన కొత్త ఎన్‌పీఆర్‌ 100 నోటును విడుదల చేయాలని నేపాల్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా విమర్శించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో ఈ తీరును ఏకపక్ష చర్యగా పేర్కొంది. భూమి గురించిన వాస్తవాలను ఇది మార్చదని తెలిపింది.

‘బిగ్ బ్రదర్ ధోరణి’ ఆరోపణ 
నేపాల్‌లో అంతర్గతంగా రాజకీయాల్లో పోటీ నెలకొంటే జాతీయవాద వాదనలు తరచూ వినిపిస్తాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీలలో ఈ ధోరణి బలంగా ఉంటుంది. కొంతమంది నేతలు నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు కొంతమంది ఓటర్లలో మద్దతు ఉంది. మరోవైపు, నేపాల్ రాజకీయ వర్గాల్లో చాలా మంది భారత్ “బిగ్ బ్రదర్” ధోరణి చూపుతుందని భావిస్తున్నారు.

లిపులేఖ్: చైనాతో వాణిజ్యం వేళ
భారత్‌-చైనా వాణిజ్యం ‘లిపులేఖ్’ మార్గం ద్వారా పునఃప్రారంభమైనప్పుడు ( 2025 ఆగస్టులో) నేపాల్‌ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నేపాల్‌ ఈ ప్రాంతాన్ని తన భూభాగమని ప్రకటించి, భారత్‌-చైనా ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. లిపులేఖ్, లింపియాధురా, కలాపాని ప్రాంతాలను తన సార్వభౌమ భూభాగమని  నేపాల్‌ ప్రకటించింది.
 
లిపులేఖ్ మార్గం ద్వారా భారత్-చైనా మధ్య వాణిజ్యం పునఃప్రారంభం కావడంపై నేపాల్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. నేపాల్ రాజ్యాంగంలో ఉన్న అధికారిక పటంలో లింపియాధురా, లిపులేఖ్, కలాపాని ప్రాంతాలు నేపాల్ అంతర్భాగంగా చూపించడం సరికాదని చెప్పింది.

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక? 
నేపాల్‌లో జెన్‌-జీ ఉద్యమానికి ముందు భారత్‌-నేపాల్‌ మధ్య సత్సబంధాలు దెబ్బతిన్నాయి. నేపాల్‌ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ తమ ప్రధాని అభ్యర్థిగా బాలేంద్ర షాను నిలిపింది. ఆయన జెన్‌-జీ ఉద్యమంలో పనిచేసిన నేత. ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ద్వారా తెలుస్తోంది. నేపాల్‌ కొత్త ప్రభుత్వం భారత్‌లో మళ్లీ సత్సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement