టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ భవితవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా అతడి మార్గదర్శకంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్‌ను (1-2) కోల్పోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఈ సిరీస్‌కు ముందు వరకు గంభీర్‌ను టెస్ట్‌ల నుంచి మాత్రమే తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే తాజా పరాభవం తర్వాత గంభీర్‌పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. అతన్ని మొత్తానికే టీమిండియా నుంచి తప్పించాలని ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. స్వదేశంలో, అందులో సి-టీమ్ (న్యూజిలాండ్) చేతిలో పరాభవాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
వాస్తవానికి గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్‌లకు మాత్రమే పరిమితం అని అంతా అనుకుంటారు. కానీ, వన్డేల్లోనూ అతనికి చెత్త ట్రాక్ రికార్డే ఉంది. అతని జమానాలో టీమిండియా చిన్న జట్టైన శ్రీలంక చేతిలో కూడా వన్డే సిరీస్ కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత్‌కు భంగపాటే ఎదురైంది.
అతడి పుణ్యమా అని భారత్ తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. మొత్తంగా అతని పదవీకాలంలో భారత జట్టు వన్డేల్లో 11 విజయాలు సాధించి, 6 పరాజయాలు ఎదుర్కొంది. వన్డేల్లో గంభీర్ చెప్పుకోదగ్గ విజయం ఏదైనా ఉందంటే అది ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటే.
గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్‌ల నుంచి చిన్నగా వన్డేలకు కూడా పాకడంతో, ఇక భరించేది లేదని అభిమానులు కరాఖండిగా చెబుతున్నారు. కేవలం టీ20ల కోసమే అతన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గంభీర్ స్థానంలో రాజకీయాలు చేయని ఎవరికైనా అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరుతున్నారు.
గంభీర్ కోచ్‌గా తన ప్రదర్శన కంటే రాజకీయాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో ఉంటాడు. అతని జమానాలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రచారం జరుగుతుంది.
గంభీర్ కారణంగానే వారిద్దరు అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారని టాక్. రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంలోనూ గంభీర్‌దే కీలకపాత్ర అని అంతా అంటుంటారు. అంతగా అర్హం కాని శుభ్‌మన్ గిల్‌కు టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్సీ కట్టబెట్టడంలోనూ గంభీర్‌దే కీలకపాత్ర అని ప్రచారం జరిగింది.
సంజూ శాంసన్‌కు అన్యాయం చేసి గిల్‌ను టీ20ల్లోనూ ప్రమోట్ చేయాలని గంభీర్ ప్రణాళికలు రచించాడని సమాచారం.
మహ్మద్ షమీ లాంటి సీనియర్‌ను అకారణంగా తప్పించి, హర్షిత్ రాణాకు ఎవరికీ ఇవ్వని అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ సిరాజ్ గంభీర్ రాజకీయాలకు బలైయ్యారనే టాక్ కూడా నడుస్తుంది. కోచ్‌గా తన పనితనంపై ఫోకస్ పెట్టకుండా గంభీర్ ఇలాంటి రాజకీయాలు కోకొల్లలు చేశాడని చాలామంది టీమిండియా మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీసీసీఐ వెంటనే గంభీర్‌పై వేటు వేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
గురువు ఎంతో శిష్యుడూ అంతే..!
గంభీర్ ప్రమోట్ చేసిన శుభ్‌మన్ గిల్ సైతం భారత కెప్టెన్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అతని హయాంలో భారత్ తొలిసారి న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలోనూ పరాభవం ఎదుర్కొంది.
టెస్ట్‌ల్లోనూ గిల్ (కెప్టెన్‌గా) ప్రదర్శన పేలవంగానే ఉంది. అరంగేట్రం సిరీస్‌లో (ఇంగ్లండ్) చావుతప్పి కన్ను లొట్ట పోయింది (2-2తో డ్రా). తాజాగా సౌతాఫ్రికా చేతిలో స్వదేశంలోనే ఘోర భంగపాటు (క్లీన్ స్వీప్) ఎదురైంది. ప్రదర్శన విషయంలో గిల్ తన గురువు గంభీర్‌తో పోటీ పడుతున్నాడు.


