
పోలీసుశాఖలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది’ అంటుంది ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025. ‘ఎందుకు ఇలా?’ అనేదానిపై ఎందరో ప్రముఖులు తమ అభిపప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో మహిళలు తప్పనిసరిగా ఎందుకు ఉండాలి’ అనే కోణంలో కొందరు విలువైన విశ్లేషణ చేశారు. అన్నపూర్ణలాంటి ధైర్యసాహసాలు మూర్తీభవించిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ల గురించి చదివినప్పుడు వారి విశ్లేషణ నూటికి నూరుపాళ్లు సరిౖయెనదే అనిపిస్తుంది.
కర్నాటకలోని హుబ్లీ నగరంలో గత ఆదివారం ఐదేళ్ల బాలికను అపహరించి, అత్యాచార యత్నం చేసి, చంపేసిన సంఘటన రాష్ట్రాన్ని అట్టుడికించింది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది బిహార్‌కు చెందిన రితేష్ కుమార్. ఇతడు వలసకూలీ. సీసీ టీవీల కెమెరా ఫుటేజీ సహాయంతో రితేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణ కోసం తీసుకువెళుతున్న సమయంలో రితేష్ పోలీసులపై రాళ్ల దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అశోక్‌నగర్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ అన్నపూర్ణ పారిపోవద్దు’ అని రితేష్‌ను హెచ్చరిస్తూ గాలిలో కాల్పులు (వార్నింగ్ షాట్) జరిపింది. రితేష్ ఆమె హెచ్చరికను ఖాతరు చేయలేదు.
రాళ్ల దాడీ ఆపలేదు. దీంతో గత్యంతర లేని పరిస్థితులలో అన్నపూర్ణ రితేష్‌పై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ సంఘటనలో అన్నపూర్ణతోపాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అన్నపూర్ణ ధైర్యసాహసాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ‘లేడి సింగం’ అనే విశేషణాన్ని ఆమె పేరుకు ముందు జోడిస్తున్నారు. తాజా విషయానికి వస్తే... కర్నాటక మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అన్నపూర్ణను అభినందించారు.
‘హేయమైన నేరాలకు పాల్పడిన నిందితులను ఉరి తీయాలి. న్యాయం త్వరితగతిన జరగాలి. పోలిస్ ఇన్‌స్పెక్టర్ అన్నపూర్ణ చర్య రాష్ట్రవ్యాప్తంగా ఇతర అధికారులకు స్ఫూర్తిగా నిలవాలి. అన్నపూర్ణను అత్యున్నత రాష్ట్ర పురస్కారంతో సత్కరించాలని ముఖ్యమంత్రి, హోంమంత్రులకు సిఫారసు చేస్తాం’ అన్నారు హెబ్బాళ్కర్.
బెల్గాం జిల్లాలోని గుజనట్టి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ధార్వార్డ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఎంఎస్‌సీ చేసింది. 2018లో పోలిస్‌శాఖలో చేరింది. ‘రాష్ట్రంలో ఇంతకు ముందు ఏ మహిళా పోలీస్ అధికారి చేయని సాహసాన్ని అన్నపూర్ణ చేసింది. హాట్సాప్’ అంటూ సోషల్ మీడియాలో అన్నపూర్ణపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.
(చదవండి: 'ఇది తప్పనిసరి' .. విడాకులపై స్పందించిన మెలిండా గేట్స్..! ఆ ఏజ్‌లోనే విడిపోవడానికి కారణం..)