
ఓవల్ క్యురేటర్‌తో గంభీర్ వాగ్వాదం
పిచ్‌కు దగ్గరగా రావడంపై వివాదం
చివరి టెస్టుకు బుమ్రా దూరం
లండన్: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు రెండు రోజుల ముందు భారత జట్టును మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం మొదలైంది. అయితే ఇది ఆటగాళ్ల నుంచి రాలేదు. చివరి టెస్టు జరిగే ఓవల్ పిచ్ క్యురేటర్ చేసిన ‘అతి’ మైదానంలో చర్చకు దారి తీసింది. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహానికి ఇది కారణమైంది. మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో కొందరు భారత ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం ఓవల్ మైదానానికి వెళ్లింది. టెస్టుకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఇరు జట్ల కెప్టెన్ లేదా కోచ్‌లు పిచ్‌ను పరిశీలించడం, దానిపై ఒక అంచనాకు రావడం సాధారణ ఆనవాయితీ.
గంభీర్ కూడా తన సహచర కోచింగ్ సిబ్బందితో పిచ్ వద్దకు వెళ్లాడు. అయితే క్యురేటర్ లీ ఫోర్టస్ బృందంలోని ఒక సభ్యుడు అక్కడికి వచ్చి పిచ్‌కు బాగా దగ్గరగా వెళ్లవద్దని, అక్కడి నుంచి 2.5 మీటర్ల దూరం ఉండాల్సిందిగా కోరాడు. ఇది గంభీర్‌కు కాస్త అసహనం తెప్పించింది. పిచ్ పాడు కాకుండా క్యురేటర్లు జాగ్రత్తలు చెప్పడం సహజమే అయినా ఒక జట్టు కోచ్‌ను నిలువరించడం ఎప్పుడూ జరగదు. మ్యాచ్ జరిగే ప్రధాన పిచ్‌కు బాగా దగ్గరగా భారత ఆటగాళ్లు పదే పదే రావడం క్యురేటర్‌కు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.
అయితే ప్రాక్టీస్‌కు కేటాయించిన మూడు పిచ్‌లకు ఇది బాగా దగ్గరగా ఉందని, పూర్తిగా అటు వెళ్లకుండా ఉండటం సాధ్యం కాదని మన కోచింగ్ బృందం జవాబి చ్చినట్లు తెలిసింది. అయితే వివాదం అక్కడితో ముగిసిపోలేదు. భారత్‌కు చెందిన సహాయకుడు ఒకరు కూలింగ్ బాక్స్‌ను ఆటగాళ్ల ప్రాక్టీస్ నెట్స్ వద్దకు తీసుకెచ్చే ప్రయత్నం చేయగా, దీనిని కూడా క్యురేటర్ వారించాడు. దాంతో కోపం వచ్చిన గంభీర్ ఏదో మాట అనడం... ఇలా మాట్లాడవద్దని, మళ్లీ ఇలా చేస్తే ఐసీసీకి ఫిర్యాదు చేస్తానని క్యురేటర్ అన్నాడు.
అంతే...ఏం చేసుకుంటావో చేసుకోమంటూ తనదైన శైలిలో తీవ్రంగా బదులిచ్చాడు. ‘మేం ఏం చేయాలో నువ్వు చెప్పనవసరం లేదు. మా బృందం ఏం చేయాలో కూడా నువ్వు చెప్పవద్దు. నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు కేవలం గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే. అంతకు మించి ఏమీ కాదు. నీ పరిధిలో ఉండు. నువ్వు గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే’ అని గంభీర్ తీవ్రంగా జవాబిచ్చాడు. చివరకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కలగజేసుకొని ఫోర్టిస్‌ను దూరంగా తీసుకెళ్లి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చి oది.