breaking news
Dipu
-
బంగ్లాదేశ్‌లో దాస్ హత్య.. ముందే ఫోన్ చేస్తే బతికేవాడు
సాక్షి, నేషనల్ డెస్క్: బంగ్లాదేశ్‌లో మతోన్మాదుల చేతిలో నిస్సహాయంగా మూక హత్యకు గురైన హిందూ మైనారిటీ వర్గానికి చెందిన దీపూ చంద్రదాస్ ఉదంతానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన పని చేసిన కంపెనీ వర్గాలతో పాటు సహచరులే హత్యలో పాత్రధారులుగా మారినట్టు పోలీసులు వెల్లడించారు! దాంతో బంగ్లాదేశ్‌లోని మైనారిటీ వర్గాలన్నీ మరోసారి భగ్గుమంటున్నాయి.బంగ్లాదేశ్‌లో మైమెన్సింగ్ పట్టణంలోని ఓ బట్టల ఫ్యాక్టరీలో కార్మికునిగా పని చేస్తున్న 27 ఏళ్ల దాస్ డిసెంబర్ 16న దారుణ హత్యకు గురవడం తెలిసిందే. కంపెనీ ఆవరణ బయటే మతోన్మాద మూక ఆయనను అతి దారుణంగా కొట్టిచంపింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ఢాకా–మైమెన్గంజ్ హైవే మీదికి లాక్కెళ్లి బాహాటంగా తగలబెట్టింది. మత దూషణకు పాల్పడ్డాడన్నది దాస్‌పై ప్రధాన ఆరోపణ. అయితే అందుకు అసలు ఆధారాలే లేవని పోలీసులు ఇప్పుడు తీరిగ్గా చెబుతున్నారు. పైగా దాస్ హత్య ఆవేశంలో అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని యాంటీ క్రైం ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ) స్పష్టం చేయడం విశేషం. అంతేకాదు, దాస్‌ను దారుణంగా కొట్టిచంపడంలో ఏకంగా ఆయన సహోద్యోగులు కూడా మూకతో చేతులు కలిపినట్టు ఆర్ఏబీతో పాటు స్థానిక మీడియా కూడా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆర్ఏబీ ఇప్పటిదాకా 10 మందిని అరెస్టు చేసింది. అనంతరం పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అసలేం జరిగింది? దాస్ మతదూషణకు పాల్పడుతూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టినట్టు డిసెంబర్ 16న ఉదయం నుంచే జోరుగా పుకార్లు షికారు చేశాయి. విషయం తెలియని ఆయన ఎప్పట్లాగే విధులకు హాజరయ్యాడు. అదే ఆయన పాలిట మృత్యువుగా పరిణమించింది. సాయంత్రానికల్లా సహోద్యోగులే ఆయనను దూషించడం మొదలుపెట్టారు. వారించాల్సిన పై అధికారులు పట్టించుకోకపోగా, దాస్‌తో బలవంతంగా రాజీనామా పత్రంపై సంతకం చేయించారు.మరోవైపు మధ్యాహ్నం నుంచే కంపెనీ బయట ఉన్మాద మూక పోగడం మొదలుపెట్టింది. సాయంత్రానికల్లా దాస్‌పై ఫ్యాక్టరీ ఆవరణలోనే తొలి దాడి జరిగినట్టు ఆర్ఏబీ–14 క మాండర్ నయీముల్ హసన్ వెల్లడించారు! ‘‘ఫ్యాక్టరీ ఫ్లోర్ ఇన్చార్జి దాస్‌తో బలవంతంగా రాజీనామా చేయించడమే గాక ఆవేశంతో ఉడికిపోతున్న మూకకు ఆయనను స్వయంగా అప్పగించాడు. రాత్రి 8:30 గంటల వేళ, సరిగ్గా తర్వాతి షిఫ్ట్ కార్మికులు చిన్న గేట్ గుండా లోపలికొస్తున్న సమయంలో, బయట మూగిన మూక చూస్తుండగా దాస్‌ను బలవంతంగా లాక్కెళ్లి ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గరున్న సెక్యూరిటీ రూములో ఉంచాడు.అంతే! ఆ వెంటనే మూక లోనికి దూసుకొచ్చి దాస్‌ను బయటికి లాక్కెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే విచక్షణారహితంగా కొట్టిచంపింది. దాస్ సహోద్యోగులు కూడా వారితో చేతులు కలపడం ఈ ఉదంతంలో మరో విషాదం’’అని హసన్ వివరించారు. అంతేకాదు, ‘‘ఇంత ఉద్రిక్తత నెలకొన్నా రాత్రి 8 గంటల దాకా ఫ్యాక్టరీ బాధ్యులు తమకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. సకాలంలో ఒక్క ఫోన్ కాల్ చేసుంటే దాస్ బతికేవాడే’’అని చెప్పుకొచ్చారు. ‘‘ఫోన్ రాగానే మేం హుటాహుటిన బయల్దేరినా కిలోమీటర్ల కొద్దీ విపరీతంగా ట్రాఫిక్ జామై సకాలంలో ఘటనా స్థలికి చేరలేకపోయాం. మేం వెళ్లేసరికే అంతా అయిపోయింది’’అన్నారు.కంపెనీ అంగీకారం! దాస్ హత్యోదంతంలో ఫ్యాక్టరీ తప్పేమీ లేదని సీనియర్ మేనేజర్ షకీబ్ మహ్మూద్ బుకాయించినా, సహోద్యోగుల్లో కొందరు సాయంత్రానికల్లా దాస్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారంటూ వాస్తవాన్ని చెప్పకనే చెప్పాడు! అంతేకాదు, దాస్ దైవదూషణకు పాల్పడ్డట్టు ఎలాంటి రుజువులూ దొరకలేదని కూడా అంగీకరించాడు. ‘‘మూకను శాంతింపజేసేందుకు దాస్‌తో ఉత్తుత్తి రాజీనామా చేయించాం. కానీ ఆ చర్యతో మూక కాదు కదా, సహోద్యోగులు కూడా శాంతించలేదు’’అంటూ హంతకుల్లో తమ ఉద్యోగులు కూడా ఉన్నట్టు పరోక్షంగా చెప్పాడు. -
Transgender Dipu: ఎనిమిదేళ్ల క్రితం వివాహం
అనకాపల్లి టౌన్/కశింకోట/మునగపాక: బయ్యవరం వద్ద లభించిన శరీర భాగాలతో వెలుగు చూసిన వ్యక్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. బుధవారం మరో రెండు చోట్ల మిగతా శరీర భాగాలు లభ్యం కావడంతో హత్యకు గురైన వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించారు. బయ్యవరం వద్ద జాతీయ రహదారి వంతెన కింద మంగళవారం ఒక చేయితోపాటు నడుం కింద శరీర భాగాలతో ఉన్న మూట దొరకడంతో గుర్తు తెలియని మహిళ హత్యగా భావించిన పోలీసులు వాటిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి భద్రపరిచిన సంగతి తెలిసిందే. ఏడు ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాలు మృతదేహం మిగిలిన భాగాల కోసం గాలింపు చేపట్టాయి. అనకాపల్లిలో డైట్ కళాశాల వద్ద జాతీయ రహదారి పక్కన జలగల మదుం వద్ద కాలువలో హతురాలి తల భాగం, ఎడమ చేయి లభ్యమయ్యాయి. మండలంలోని తాళ్లపాలెం జాతీయ రహదారి వంతెన దిగువన మొండెం భాగం సంచిలో లభ్యమైంది. వీటిని పరిశీలించి హత్యకు గురైన వ్యక్తిని అనకాపల్లి గవరపాలెం ముత్రాసు కాలనీకి చెందిన మైపల దిలీప్ శివశంకర్ అలియాస్ దీపు (40)గా గుర్తించారు. ప్రత్యేక బృందాలు విచారిస్తున్నట్లు స్థానిక సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. హత్యకు కారకునిగా భావిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన నిందితుడ్ని అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నట్లు సమాచారం.ఎనిమిదేళ్ల క్రితం వివాహంపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తితో 8 సంవత్సరాల క్రితం దీపు వివాహం చేసుకొని మునగపాక మండలం నాగులాపల్లి వద్ద నివాసముంటున్నారు. ఆనవాళ్లను బట్టి పోలీసులు మృతదేహాన్ని గుర్తించి నాగులాపల్లిలోని దీపు ఇంటికి క్లూస్ టీమ్‌ను తీసుకొని వెళ్లారు. గదిలో ఎటువంటి ఆనవాళ్లు లేకుండా నిందితుడు జాగ్రత్త పడినట్టు తెలిసింది. పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బుధవారం అనకాపల్లికి చెందిన హిజ్రాలందరూ తమ వర్గానికి చెందిన వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. నిందితులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, లేనిపక్షంలో తమ సంఘానికి అప్పగించాలని ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి ర్యాలీగా నెహ్రుచౌక్కు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిజ్రాలు కొండబాబు, భారతమ్మలు మాట్లాడుతూ నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి, దీపు గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారన్నారు. హత్య జరిగిన ముందు రోజు కూడా కలిసే ఉన్నారని తెలిపారు. గతంలో హిజ్రాలపై హత్యలు జరిగినప్పటికీ నేటి వరకూ పోలీసులు పట్టించుకోలేదని రోజురోజుకు హిజ్రాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. అనంతరం నెహ్రుచౌక్ నుంచి ర్యాలీగా వచ్చి డీఎస్పీ శ్రావణితో హిజ్రాలు మాట్లాడారు. -
త్వరలో ప్రేమ వివాహం చేసుకుంటున్నా: దీపు
ప్రతిభావంతులైన నేటి తరం యువ గాయకుల్లో దీపు ఒకరు. ఎనిమిదేళ్ల క్రితం ‘టెన్త్‌క్లాస్’ సినిమా ద్వారా గాయకునిగా పరిచయమయ్యారు తను. ఇప్పటివరకూ మూడొందల పై చిలుకు సినీ గీతాలను ఆలపించి, తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఓ మంచి స్థానాన్ని సాధించిన ఈ యువ సంగీత కెరటంతో ‘సాక్షి’ సంభాషణ... కెరీర్ ఎలా ఉంది? బావుందండీ.. కెరీర్ ప్రారంభించినప్పట్నుంచీ ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. పాడుతూనే ఉన్నాను. నా సక్సెస్‌కి కారణం.. నా సంగీత దర్శకులే. మీ కెరీర్లో మీకు బాగా పేరుతెచ్చిన పాటలు? ‘యమదొంగ’లో ‘నాచోరె నాచోరె..’, ‘చిరుత’లో ‘లవ్యూ రా.. లవ్యూ రా..’, ‘మగధీర’లో ‘నా కోసం నువ్ జుట్టు పీక్కుంటే బాగుంది..’, ‘రచ్చ’లో ‘ హీ ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ’.. ఇలా చాలా పాటలున్నాయి. అయితే.. ఇవన్నీ ఓ ఎత్తు ‘ఈగ’లో కీరవాణిగారు పాడించిన ‘నేనే నానినే నేనే నానినే..’ పాట ఓ ఎత్తు. గాయకునిగా నన్ను మరో మెట్టు పై కూర్చోబెట్టిందీ పాట. మీ కెరీర్లో మరిచిపోలేని ప్రశంస? ‘నేనే నానినే..’ పాట చరణంలోని ఓ లైన్ హై పిచ్‌లో ఉంటుంది. నాకంటే ముందు ఆ పాటను కొంతమందితో పాడించారట కీరవాణి. కానీ.. ఆయనకు నచ్చలేదు. నేను పాడిన తీరుతో ఆయన సంతృప్తి చెందారు. ‘ఈ పాట నీ కోసమే పుట్టినట్లుంది. హై పిచ్‌ని బాగా అందుకున్నావ్’ అని కీరవాణిగారు ఇచ్చిన ప్రశంస జీవితంలో మరచిపోలేను. సింగర్లు ఎక్కువైపోయారు కదా! పోటీ కష్టంగా ఉందా? పోటీ ఎక్కువే. కానీ.. నా స్థానం నాకుందని నేను నమ్ముతాను. నా అదృష్టం బాగుండి మంచి పాటలు పాడాను. ఇంకా పాడాలి. గాయకునిగా చెరగని స్థానాన్ని సంపాదించాలి. నా ముందున్న కర్తవ్యం అదే. గాయకునిగా ప్రేరణ? చిన్నప్పట్నుంచీ బాలూగారి పాటలు వింటూనే పెరిగాను. ఆయనలా పాడాలని ప్రయత్నించేవాణ్ణి. పాటల పోటీల్లో కూడా పాల్గొనేవాణ్ణి. శంకర్‌మహదేవన్, కె.కె ప్రభావం కూడా నాపై ఉంది. ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? తాతగారు పాడేవారట. మా బాబాయ్ కూడా మ్యూజికల్ నైట్స్‌లో పాడేవారు. వారి పోలికే వచ్చిందేమో! సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది? ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లోని నా పాట మిక్కీ జె.మేయర్‌గారికి నచ్చిందట. వెంటనే... టెన్త్‌క్లాస్’ సినిమాకు నాతో పాడించారు. అలా సింగర్‌ని అయ్యా. మ్యూజిక్ డెరైక్షన్ చేయాలనే ఆలోచనేమైనా ఉందా? ప్రస్తుతానికి లేదు. అయితే... ఓ ఆల్బమ్ మాత్రం చేస్తా. ఎవరైనా ఆల్బమ్ చేయడానికి ముందుకొస్తే సరే. లేకపోతే నా సొంత ఖర్చుతోనే ఆల్బమ్ చేస్తా. మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు కదా! ఇప్పటివరకూ ఎన్ని దేశాల్లో పాడారు? ‘సూపర్‌సింగర్’ కార్యక్రమం నాకు ఎక్కడలేని గుర్తింపును తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మ్యూజికల్ షోస్ ఇచ్చానంటే దానికి ‘సూపర్‌సింగర్’ కార్యక్రమమే కారణం. ఇప్పటివరకూ అమెరికా, దుబాయ్, మస్కట్, మలేసియా, సింగపూర్... తదితర ప్రదేశాల్లో షోలు చేశాను. గాయకునిగా మీ లక్ష్యం? బాలీవుడ్లో పాడాలి. ఇళయరాజా, రెహమాన్‌లతో పనిచేయాలని ఉంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యూజిక్‌లో డిప్లమా చేశాను. ప్రస్తుతం రామాచారి వద్ద లైట్ మ్యూజిక్, విజర్సు బాలసుబ్రమణ్యంగారి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నా. అసలు మీ స్వస్థలం ఏది? నేను పూర్తి హైదరాబాదీని. ఇక్కడే బీటెక్ చేశాను. మరి పెళ్లెప్పుడు? ఆ పనిలోనే ఉన్నా. త్వరలోనే చెబుతా. ప్రేమ వివాహమా? అవును. ఎవరా అమ్మాయి. ఆమె సింగరేనా? కాదు..అసలు నా ప్రొఫెషన్‌తో ఆమెకు సంబంధం లేదు.


