
లండన్: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సమస్య తలెత్తడంతో గురువారం దక్షిణ ఇంగ్లండ్‌లోని పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 100 విమాన సర్వీసులు, ఆలస్యంగా నడవడం లేదా రద్దవడం సంభవించాయి. దీంతో వేలాదిగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. హీత్రూ, గాట్విక్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్, కార్డిఫ్, ఎడిన్‌బరో తదితర విమానాశ్రయాల్లో పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు.
సుమారు 20 నిమిషాల తర్వాత సమస్యను పరిష్కరించినప్పటికీ ఆ ప్రభావం సాయంత్రం వరకు కొనసాగింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తాము వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి దరిద్రంగా మారిందంటూ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్విరామంగా పనిచేస్తున్నామని నేషనల్ ఎయిర్‌ట్రాఫిక్ సర్వీసెస్(ఎన్‌ఏటీఎస్) తెలిపింది.